‘మా శవాలపై రిజర్వాయర్ కట్టుకోండ్రి’ అంటూ ఓ బాధితుడు ఆత్మహత్యకు యత్నించాడు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు
తొగుట: ‘మా శవాలపై రిజర్వాయర్ కట్టుకోండ్రి’ అంటూ ఓ బాధితుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మెదక్ జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. కొమురవెల్లి మల్లన్న రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి గురువారం తుక్కాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ముంపు బాధితులకు ఎకరానికి ప్రభుత్వం రూ.4.70 లక్షలు చెల్లిస్తుందని ఆర్డీఓ ప్రకటించడంతో రైతులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. అధికారులు, పాలకులు తమను పట్టించుకోవడంలేదని నిరాశ చెందిన ఓ దళిత రైతు నర్సింహులు అధికారుల ముందే పురుగుల మందు తాగాడు. సహచర రైతులు ఎంత వారించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. జీఓ నం. 214కు బదులు జీఓ నం.123తో ముంపు బాధితులను నిలువునా ముంచుతారా? అంటూ వారు ఆర్డీఓను నిలదీశారు. ఎకరానికి రూ.10 లక్షలు చెల్లించేలా జీఓను సవరించాలని డిమాండ్ చేశారు. భూములను కోల్పోతున్న రైతులకు సాగు భూములే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ముంపునకు గురైన భూ బాధితులకు ఒకే చోట గ్రామాన్ని నిర్మించి ఇవ్వాలని గ్రామస్తులు తీర్మానం చేసి ఆర్డీఓ ముత్యంరెడ్డికి అందించారు.
రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించాలి: ఆర్డీఓ
రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న రిజర్వాయర్ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి కోరారు. ప్రభుత్వం మెరుగైన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు.