ఇంటి నిర్మాణం భారం | burden of the construction of the house | Sakshi
Sakshi News home page

ఇంటి నిర్మాణం భారం

Published Tue, Jun 10 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

ఇంటి నిర్మాణం భారం

ఇంటి నిర్మాణం భారం

ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం కూడా చేతులెత్తేయడంతో సిమెంట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పెంచిన ధరలకు నిరసనగా సిమెంట్ డీలర్లు మూడురోజులు దుకాణాలు మూసివేసి ఆందోళనలు చేసినా పట్టించుకున్నవారు లేరు.

ఐదు రోజుల్లో 50 శాతం పెంపు..
 సిమెంట్ ధరలు ఐదు రోజుల్లోనే 50 శాతం పెంచారు. 50కిలోల సిమెంట్ బస్తా రూ.295 (43గ్రేడ్), రూ.310 (53 గ్రేడ్)కు చేరింది. నెల క్రితం ధరలు తక్కువగా ఉండడంతో ఆర్థికంగా ఉన్నవారితోపాటు సామాన్యులూ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ఈ నెల ఒకటో తేదీన బస్తా సిమెంట్‌కు రూ.200 ఉన్న ధర.. 2, 5 తేదీ వరకు ఏకంగా రూ.310కి చేరింది. జిల్లాలో సుమారు 25 కంపెనీల సిమెంట్ అమ్ముడవుతోంది. ప్రతీ కంపెనీ రూ.5 తేడాతో విక్రయిస్తోంది. ఈ లెక్కన సిమెంట్ కంపెనీలు ఎంత సిండికేట్ సాగిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్దమొత్తం ఒకేసారి పెరగడంతో నిర్మాణరంగం సంక్షోభంలో పడింది. ధరలు మరింత పెరిగే అవకాశముందని డీలర్లు చెబుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికే కూలిరేట్లు భారీగా పెరిగాయి. తాజాగా సిమెంట్ బస్తాపై రూ.100 అదనపు భారం పడుతుండడం నిర్మాణ రంగాన్ని కుంగదీస్తోంది. మరో రెండు రోజుల్లో మరో రూ.30 పెరగనున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

నెలకు రూ.30 కోట్ల భారం
 జిల్లావ్యాప్తంగా 500 వరకు సిమెంట్ దుకాణాలుంటే.. ఒక్క జిల్లా కేంద్రంలోనే 70 దుకాణాలు (డీలర్) ఉన్నాయి. వీటి ద్వారా ప్రతీనె ల 60వేల టన్నుల సిమెంట్ విక్రయం జరుగుతోంది. జిల్లా కేంద్రంలో 20 వేల టన్నుల సిమెంట్ అమ్ముతున్నట్లు డీలర్లు చెబుతున్నారు. ఈ లెక్కన నెలకు రూ.30 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. పెరిగిన ధరలతో సిమెంట్ కొనుగోలుపైనే రూ.15 కోట్ల అదనపు భారం వినియోగదారులపై పడుతోంది. మిగిలిన ఇసుక, ఇనుము, ఇటుక కలుపుకుంటే నెలకు రూ.30 కోట్ల భారం ప్రజలపై పడుతున్నట్లు నిర్మాణదారులు చెబుతున్నారు.
 
ఇటుకకూ తప్పని పెరుగుదల
 అకాల వర్షాలతో ఇటుక బట్టీల వ్యాపారం అతలాకుతలమైంది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. రెండు నెలల క్రితం ట్రాక్టర్ లోడ్ ఇటుక రూ. ఏడు వేలు కాగా.. ప్రస్తుతం రూ. ఎనిమిది వేల నుంచి రూ.పది వేలకు అమ్ముతున్నారు.
 
క్రమంగా పెరుగుతున్న స్టీల్
 నిర్మాణంలో స్టీల్ వాడకం తప్పనిసరి. వీటి ధరలు కూడా ఒక్కసారిగా కాకుండా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గత ఏడాది రూ.42 వేలకు టన్ను ఉన్న స్టీల్.. ప్రస్తుతం రూ.55 వేలకు చేరింది. ఏడాదిలోనే ఆరుసార్లు పెరిగి అటు డీలర్లను, ఇటు వినియోగదారులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. నిర్మాణదారుల నుంచి అడ్వాన్సుగా డబ్బులు తీసుకునే పరిస్థితి లేదని, తెల్లవారితే రేటు ఎలా ఉంటుందో కూడా తెలియడం లేదని డీలర్లు చెబుతున్నారు.
 
ఇసుకకు రెక్కలు..
 ఇసుక క్వారీలకు ప్రభుత్వం అనుమతి రద్దు చేయడంతో అది మాఫీయాగా మారింది. అక్రమంగా ఇసుక తరలిస్తూ రేట్లను పెంచి అమ్ముతున్నారు. ట్రాక్టర్ ఇసుక రెండు నెలల క్రితం రూ. వెయ్యి నుంచి రూ.1200 ఉండగా,  ఇప్పుడది రూ.1700 నుంచి రూ.రెండు వేలకు చేరింది. వర్షాకాలం నాటికి  రూ.మూడు వేలకు చేరుతుందేమోనని నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement