పక్కాగా..
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టిన అన్నాడిఎంకే సర్కారు గుడిసెల నిర్మూలన విభాగం నేతృత్వంలో పేదలకు పక్కా గృహాల నిర్మాణాలపై దృష్టి కేంద్రీకరించింది. గత ఐదు సంవత్సరాల్లో 50 వేల 470 బహుళ అంతస్తుల తరహా, వ్యక్తిగత గృహాలు(సొంత స్థలంలో సొంతంగా) లబ్దిదారులకు నిర్మించి ఇచ్చారు. మరో మూడు వేల 29 బహుళ అంతస్తులు, 7513 వ్యక్తిగత గృహాల నిర్మాణాలు సాగుతున్నాయి.
మళ్లీ అధికార పగ్గాలు తమ చేతికి చిక్కిడంతో పక్కాగా...పక్కా గృహాల నిర్మాణాల మీద మళ్లీ అమ్మ జయలలిత దృష్టి కేంద్రీకరించే పనిలో పడ్డారు. ఈ ఏడాది 23,476 గృహాల్ని నిర్మించేందుకు సిద్ధం అయ్యారు.ఇందుకు తగ్గ ఆమోద ముద్రను బుధవారం వేశారు. చెన్నై, తంజావూరు, తిరుచ్చి, ఈరోడ్, కోయంబత్తూరు, పుదుకోట్టై, నామక్కల్, నాగపట్నం నగరాల్లో బహుళ అంతస్తుల తరహాలో 7204 గృహాల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు.
గుడిసెల్లో ఉన్న వాళ్లు సొంతంగా స్థలం కల్గి పక్కా గృహాలను నిర్మించుకోదలచని పక్షంలో అందుకు రూ. 2.1 లక్షలు అందించేందుకు నిర్ణయించారు. నాలుగు వందల చ. అడుగుల్లో హాల్, బెడ్ రూమ్, వంట గది, స్నానపు గది, మరుగు దొడ్డి సౌకర్యంతో ఈ ఇంటిని నిర్మించుకోవచ్చు. లబ్దిదారులు అదనంగా 300 చ. అడుగుల మేరకునిర్మించుకునేందుకు అవకాశం కల్పించినా, అందుకు తగ్గ భారాన్ని వారే మోయాల్సి ఉంటుంది.