సర్వ హక్కులతో స్వగృహాలు | CM YS Jagan Launched Jagananna Sampoorna Gruha Hakku Scheme | Sakshi
Sakshi News home page

సర్వ హక్కులతో స్వగృహాలు

Published Wed, Dec 22 2021 2:58 AM | Last Updated on Wed, Dec 22 2021 1:40 PM

CM YS Jagan Launched Jagananna Sampoorna Gruha Hakku Scheme - Sakshi

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు కింద పత్రాలు పంపిణీ చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

మీకెందుకయ్యా.. కడుపుమంట? 
ఈ రోజు మీ అన్న ప్రభుత్వం.. మీ తమ్ముడి ప్రభుత్వం మంచి చేస్తుంటే జీర్ణించుకోలేని శక్తులు చాలా ఉన్నాయి. అది చంద్రబాబు కావచ్చు.. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 కావచ్చు. ఒకవేళ వారు మీ దగ్గరికి వస్తే కొన్ని ప్రశ్నలు అడగండి. అయ్యా.. మా ఇళ్లను ఎలాంటి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ లేకుండా మార్కెట్‌ రేటుకు కొనుగోలు చేస్తారా? అని గట్టిగా నిలదీయండి. మీ వారసులకేమో మీ ఆస్తులను రిజిస్టర్‌ చేసి ఇస్తారు కదా..! మరి మా బిడ్డలకు ఇంటిని చట్టబద్ధంగా రిజిస్టర్‌ చేసే అవకాశాన్ని మా జగనన్న మాకు కల్పిస్తుంటే మీకెందుకయ్యా కడుపు మంట? అని గట్టిగా అడగండి. మీరు కొనుగోలు చేసిన రిజిస్టర్డ్‌ భూముల మాదిరిగానే మా ఇంటి విలువ కూడా పెరిగేలా ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని మా అన్న చెబుతుంటే మీకెందుకయ్యా కడుపు మంట? అని ప్రశ్నించండి.
– సీఎం జగన్‌

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇల్లు అంటే కేవలం ఇటుకలు, సిమెంట్‌తో నిర్మించిన కట్టడం మాత్రమే కాదని ఒక మనిషి సుదీర్ఘకాలం పడిన కష్టానికి, సంతోషానికి సజీవ సాక్ష్యం లాంటిదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.26 వేల కోట్ల విలువైన భూమిని 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల కింద ప్రభుత్వం పంపిణీ చేసిందని చెప్పారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా పేదలకు స్థిరాస్తిపై వివాదరహితంగా, క్లియర్‌ టైటిల్‌తో సర్వహక్కులూ కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు. ఆ వివరాలివీ..

కలను నిజం చేస్తున్నాం...
ఇవాళ నా పుట్టిన రోజు నాడు దేవుడి దయతో దాదాపు 52 లక్షల మందికిపైగా మంచి జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సొంతూరు మాదిరిగానే మనం ఉన్న ఇల్లును కూడా జీవిత కాలం గుర్తు పెట్టుకుంటాం. రూపాయి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న ఇంటిని తదనంతరం పిల్లలకు ఒక ఆస్తిగా ఇవ్వాలని ఆరాట పడే పేదల కలలను నిజం చేస్తున్నాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పేదలకు ఇంటి పట్టాలు, స్థలాలు మాత్రమే ఇస్తున్నారు కానీ వాటిపై హక్కులు కల్పించడం లేదు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా 52 లక్షలకుపైగా కుటుంబాలకు రూ.1.58 లక్షల కోట్ల విలువైన ఆస్తిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నాం. ఇందులో ఓటీఎస్‌తో మొదటగా లబ్ధి పొందుతున్న 8.26 లక్షల మందికి పత్రాల పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాం. 
ఓటీఎస్‌ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

హక్కులు లేక.. దిక్కు తోచక
తమ ఇంటిలో కేవలం నివసించే హక్కు మాత్రమే ఉన్న 52 లక్షల మందికి సర్వ హక్కులు కల్పించేందుకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని తెచ్చామని సగర్వంగా తెలియజేస్తున్నా. వారికి అందించే ఆస్తి విలువ రూ.1.58 లక్షల కోట్లు. అది నేరుగా వారి చేతుల్లోకి వస్తుంది. నచ్చినట్లుగా ఉపయోగించుకోవచ్చు. ఇంటిపై హక్కులు దక్కితే అవసరం వచ్చినప్పుడు మార్కెట్‌ రేటుకు అమ్ముకునే వీలుంటుంది. ఇప్పటిదాకా ఆ అవకాశం లేదు. వారసత్వంగా సంతానానికి రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చే వీలు కూడా లేదు. కష్ట కాలంలో తనఖా పెట్టి బ్యాంకు రుణాలు తీసుకునేందుకూ వీల్లేదు. ఏ హక్కూ లేకుండా గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లలో గడపాల్సిన పరిస్థితి. 

శనక్కాయలు, బెల్లానికీ సరిపోవు...
ఇంటి మీద మనకు హక్కు లేకపోతే మార్కెట్‌లో రూ.10 లక్షలు పలికే నివాసం విలువ మరో రకంగా ఉంటుంది. రూ.2 లక్షలకు కూడా కొనేవారుండరు. శనక్కాయలకు, బెల్లానికి కూడా సరిపోవు. ఉదాహరణకు ఈ రోజు ఇదే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌ చేసిన భూమి, ఇంటికి.. రిజిస్ట్రేషన్‌ చేయని వాటికి తేడా ఎంత ఉందో ఒకసారి గమనించాలని కోరుతున్నాం. రిజిస్ట్రేషన్‌ జరిగిన వాటి విలువ చేయని వాటితో పోలిస్తే పలు రెట్లు అధికంగా ఉంది. నా పాదయాత్ర సమయంలో నన్ను కలిసిన అక్క చెల్లెమ్మలను అడిగి ఈ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించాం.

పేదలకు ఇంటిపై సర్వ హక్కులు కల్పిస్తూ అవసరమైతే కష్ట కాలంలో అమ్ముకునే స్వేచ్ఛను కూడా ఈరోజు నుంచి కల్పిస్తున్నాం. ఓటీఎస్‌ (వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌) ద్వారా తొలుత లబ్ధి పొందిన 8.26 లక్షల మందికి ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి సంపూర్ణ హక్కులతో డాక్యుమెంట్లను ఇవాళ అందచేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో సొంత డబ్బులతో ఇల్లు నిర్మించుకున్న దాదాపు 12 లక్షల కుటుంబాలు కేవలం రూ.10 చెల్లిస్తే చాలు రిజిస్ట్రేషన్‌ చేసి హక్కులు కల్పిస్తున్నాం. హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా లోన్‌ తీసుకున్న వారు గ్రామాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్‌లో రూ.20 వేలు చెల్లిస్తే చాలు. వీరందరికీ సర్వ హక్కులతో ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఆస్తిని వారి చేతుల్లో పెడతాం. 

పేదలకు రూ.16 వేల కోట్ల లబ్ధి
2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ వద్ద స్థలాలను తనఖా పెట్టి ఇళ్ల నిర్మాణాల కోసం రుణాలు తీసుకున్న 40 లక్షల మంది లబ్ధిదారులు అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.14,400 కోట్లు బకాయి ఉండగా ఏకంగా రూ.10 వేల కోట్లు పూర్తిగా మాఫీ చేస్తున్నాం. అంతేకాకుండా రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంప్‌ డ్యూటీల రూపంలో మరో రూ.6 వేల కోట్లను ప్రభుత్వమే భరిస్తూ పేదలకు ప్రయోజనం కల్పిస్తోంది. మొత్తంగా రూ.16 వేల కోట్ల మేర లబ్ధి చేకూరుస్తున్నాం. ఒకవేళ అదే వారే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి వస్తే 7.50 శాతం మేర రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంప్‌ డ్యూటీలు కట్టాలి. ఒక ఇంటి విలువ రూ.15 లక్షలు అని లెక్కేసుకున్నా కనీసం రూ.లక్ష రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు అది కూడా పూర్తిగా మాఫీ చేస్తూ ఉచితంగా రిజిస్ట్రేషన్‌తో 52 లక్షల కుటుంబాలకు మేలు చేస్తున్నాం.

నిషేధిత భూముల జాబితా నుంచి తొలగింపు
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 41 వేల మంది అసలు, వడ్డీ కడితే కేవలం డి.ఫారం మాత్రమే దక్కింది. అటువంటి వారందరికీ ఈరోజు రిజిస్ట్రేషన్‌ చేసి డాక్యుమెంట్లు ఇస్తున్నాం. నిషేధిత భూముల జాబితా (22 ఏ) నుంచి పూర్తిగా తొలగిస్తున్నాం. సబ్‌ రిజిస్ట్రార్‌æ కార్యాలయాలకు వెళ్లి గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా మీ ఇంటిని సచివాలయాల్లోనే నామమాత్రపు రుసుము చెల్లించి కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఓటీఎస్‌ ద్వారా లబ్ధి పొందిన వారికి ఎలాంటి 
లింక్‌ డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. 

పేదలు రూ.15.29 కోట్లు చెల్లిస్తే హక్కులేవి?
ప్రభుత్వం కట్టించిన పేదల ఇళ్లపై కనీసం వడ్డీనైనా మాఫీ చేయాలని 2014 నుంచి 2019 వరకు ఈ పెద్దమనిషి చంద్రబాబు పాలనలో అధికారులు ఐదుసార్లు ప్రతిపాదనలు పంపితే నిరాకరించారు. రుణమాఫీ దేవుడెరుగు.. కనీసం వడ్డీ కూడా మాఫీ కూడా చేయని ఈ పెద్ద మనిషి ఇవాళ మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. దాదాపు 43 వేల మంది లబ్ధిదారులు అప్పో సప్పో చేసి రూ.15.29 కోట్లు చెల్లిస్తే గత సర్కారు ఎలాంటి యాజమాన్య హక్కులు కల్పించిందని గట్టిగా నిలదీయండి. 

ఆ పెద్ద మనుషులకు చెప్పండి
అధికారంలోకి వచ్చిన 30 నెలల వ్యవధిలోనే ఈ ప్రభుత్వం ఎలాంటి వివక్ష, దళారులకు తావు లేకుండా బటన్‌ నొక్కి నేరుగా రూ.1.16 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా అర్హుల ఖాతాలకు జమ చేసింది. ఒక్క రూపాయి కూడా లంచానికి ఆస్కారం లేకుండా పంపిణీ చేసి మంచి చేసిన జగనన్న మీవద్ద నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటాడా? ఈ విషయాన్ని ఆ పెద్ద మనుషులకు ఒకసారి తెలియజేయాలని కోరుతున్నా. మీ పిల్లలైతే ఇంగ్లీష్‌ మీడియం బడుల్లో చదవచ్చు.. మా పిల్లలేమో తెలుగుమీడియం బడుల్లో మాత్రమే చదవాలా? అని వారిని అడగండి. మా జగనన్న 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి పేదలకు మంచి చేస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకోవడం ధర్మమేనా? అని ప్రశ్నించండి. ఇదే రాజధాని (అమరావతి)లో పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే సామాజిక అసమతుల్యత నెలకొంటుందని ఆ పెద్ద మనుషులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. 

ఓటీఎస్‌ ఉగాది వరకు పొడిగింపు
ఓటీఎస్‌ పథకాన్ని వచ్చే ఉగాది వరకు పొడిగిస్తున్నాం. వీలైనంత ఎక్కువ మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఏప్రిల్‌ 2వతేదీ వరకు పొడిగించాలని నిర్ణయించాం. ఈ పథకం ద్వారా మంచి జరుగుతుంది. సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 

31 లక్షల ఇళ్ల పట్టాలు ఒక చరిత్ర...
చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా రెండున్నరేళ్లలో 31 లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేశాం. ఒక అన్నగా నిండు మనసుతో అక్కచెల్లెమ్మలకు అందచేశాం. ఆ ఇంటి స్థలాల విలువ అక్షరాలా రూ.26 వేల కోట్లు. అందులో ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు కూడా మొదలయ్యాయి. గృహ నిర్మాణాలు పూర్తయ్యాక మౌలిక వసతులతో కలిపి ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన ఆస్థిని పెట్టినట్లు అవుతుంది.  

హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు
కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని, పేర్ని నాని, చెరుకువాడ శ్రీరంగనాధ రాజు, ధర్మాన కృష్ణదాస్‌ తానేటి వనిత, పి.విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల్, శాసనమండలి చైర్మన్‌ కె.మోషేన్‌రాజు, సీఎం ప్రొగామ్స్‌ కోఆర్డినేటర్‌ తలశిల రఘరామ్, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దొరబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు సభకు అధ్యక్షత వహించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement