బ్యారేజీలతో జల‘సిరి’
- కృష్ణా, గోదావరి జలాల సద్వినియోగానికి బ్యారేజీలతో ప్రయోజనం
- రాష్ర్ట ప్రభుత్వానికి నీటి పారుదల శాఖ నిపుణుల కమిటీ నివేదిక
- దుమ్ముగూడెం నుంచి ప్రాణహిత వరకు ఆరు బ్యారే జీలకు ప్రతిపాదన
- కృష్ణా పరిధిలోనూ నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన కమిటీ
- మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, కంతానపల్లి రిజర్వాయర్ల పూర్తికి సిఫారసు
- వాటితో 100 టీఎంసీల నీటి నిల్వకు ఆస్కారముందన్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలను వాటా మేరకు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే రాష్ర్టంలో మరిన్ని బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి నీటి పారుదల శాఖ నిపుణుల కమిటీ సూచించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలని కూడా పేర్కొంది. నీటి నిల్వ సామర్థ్యాన్ని ఎంతగా పెంచుకుంటే అంతగా నీటిని సాగు ప్రయోజనాలకు మళ్లించుకోవచ్చని తేల్చింది. నదుల్లో వరద ఉండే కనిష్ట రోజుల్లో గరిష్ట నీటిని ఒడిసి పట్టుకునేందుకు బ్యారేజీల నిర్మాణం అత్యావశ్యకమని ఉద్ఘాటించింది. గోదావరి, కృష్ణా నదుల్లో లభ్యత నీటిని సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రాజెక్టుల్లో రీ ఇంజనీరింగ్ జరపాలని నిర్ణయించిన రాష్ర్ట ప్రభుత్వం.. ఆ దిశగా అధ్యయనానికి రిటైర్డ్ ఇంజనీర్లతో నిపుణుల కమిటీని నియమించిన విషయం తెలిసిందే.
ఈ కమిటీ రెండు రోజుల పాటు కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టులను పరిశీలించి ప్రాథమిక నివేదికను రూపొందించింది. గోదావరి పరిధిలో మరో ఆరు బ్యారేజీలు, కృష్ణా పరిధిలోనూ పలు బ్యారేజీలను అదనంగా నిర్మించాల్సిన అవసరముందని కమిటీ నొక్కి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు కమిటీ చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి, ఇతర సభ్యులు బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలసి ప్రాథమిక నివేదికను అందజేశారు. ఈ సమావేశంలో సర్వే సంస్థ ‘వ్యాప్‌కోస్’ ప్రతినిధులు కూడా పాల్గొని ‘ప్రాణహిత’ ప్రత్యామ్నాయంపై వివరించినట్లు తెలిసింది.
కృష్ణా పరిధిలోనూ మరిన్ని..
ఇక కృష్ణా నదిలో రాష్ట్రానికి 267 టీఎంసీల వరకు నీటిని వాడుకునే వెసలుబాటు ఉంది. ఇక్కడ ఇంకా 200 టీఎంసీల వరకు నీటిని వాడుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నా యి. ఇందుకోసం కల్వకుర్తి, భీమా, నెట్టెం పాడు, కోయిల్‌సాగర్‌తో పాటు కొత్తగా పాల మూరు ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. వీటితో సుమారు 160 టీఎంసీల మేర నీటిని వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టుల పరిశీలన జరిపిన నిపుణుల కమిటీ.. సర్కారుకు పలు సిఫార్సులు చేసింది. మొదట తుంగభద్ర నుంచి రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) వద్ద 16 టీఎంసీల మేర నీటిని వాడుకునే అవకాశమున్న దృష్ట్యా అక్కడ బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని సూచించింది. దీని కోసం అవసరమైతే కర్ణాటకను ఒప్పించాలని సూచించింది. ఇక కల్వకుర్తి ప్రాజెక్టు పరి ధిలో 35 టీఎంసీల నీటి వినియోగం కోసం మరో రెండు బ్యారేజీలు నిర్మించాలని, జూరాల ప్రాజెక్టు రివర్ బ్యాంకులో గుర్రంగడ్డ వద్ద మరో బ్యారేజీని, నెట్టెంపాడులో మరో 2 బ్యారేజీలను నిర్మించాలని పేర్కొంది. బ్యారేజీల నిర్మాణం త్వరితగతిన జరగాలంటే భూసేకరణ, పునరావాస చర్యలను ముందు పూర్తి చేసి తర్వాతే టెండర్లకు వెళ్లాలని కమిటీ కీలక సూచన చేసింది.
గోదావరి పరిధిలో అనువైన ప్రాంతాలు
గోదావరిలో నికర, వరద జలాలు కలిపి లభ్యతగా ఉన్న 1,400 టీఎంసీల నీటిలో రాష్ట్రానికి 854.67 టీఎంసీల మేర వినియోగించుకునే అవకాశముంది. అయితే ప్రస్తుతం 400 టీఎంసీల మేరకే రాష్ర్టం వినియోగించుకుంటోంది. మిగతా వాటాను కూడా వాడుకలోకి తేవాలంటే బ్యారేజీల నిర్మాణం అవసరమని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. దుమ్ముగూడెం మొదలుకుని ప్రాణహిత వరకు కొత్తగా 6 బ్యారేజీలనైనా నిర్మించాలని ప్రతిపాదించింది. అప్పుడే గోదావరి బేసిన్‌లో ఎక్కడైనా నీటిని నిల్వ చేసుకుని వాడుకునే వెసలుబాటు ఉంటుందని పేర్కొంది. దుమ్ముగూడెం వద్ద ఒకటి, కంతనపల్లి-దుమ్ముగూడెం మధ్య, కంతానపల్లి, ఇచ్ఛంపల్లి, కాళేశ్వరంతో పాటు ప్రాణహితలో భాగంగా ఉన్న తుమ్మిడిహెట్టి బ్యారేజీకి 70 కిలోమీటర్ల దిగువన వేమునిపల్లి వద్ద బ్యారీజీల నిర్మాణానికి అనువైన స్థలాలు ఉన్నాయని కమిటీ తేల్చింది. అయితే వాటి సామర్థ్యం ఎంత ఉండాలన్న దానిపై మాత్రం కమిటీ ఇంకా నిర్ధారణకు రాలేదు. మేమునిపల్లి వద్ద మాత్రం 5 టీఎంసీల బ్యారేజీని నిర్మించవచ్చని పేర్కొంది.
మూడు రిజర్వాయర్లతో 100 టీఎంసీల నిల్వ..
గోదావరి బేసిన్‌లో 350 టీఎంసీల నీటిని వాడుకునే ఉద్దేశంతో 7 భారీ ప్రాజెక్టులను చేపట్టినా అవి పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడంతో లక్ష్యం నెరవేరలేదు. ప్రధానంగా దేవాదుల, ఎల్లంపల్లి, రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్, ప్రాణహిత-చేవెళ్ల, కంతానపల్లి, కాళేశ్వరం, ఎస్సారెస్పీ వర ద కాల్వ, మిడ్‌మానేరు ప్రాజెక్టులపై సర్కారు దృష్టి సారిం చింది. అయితే గోదావరి నీటిని నిల్వ చేసుకునేందుకు మిడ్‌మానేరు(25.87 టీఎంసీలు), కంతానపల్లి(50 టీఎంసీలు), ఎల్లంపల్లి(24 టీఎంసీలు) ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లను వెంటనే పూర్తి చేయాలని కమిటీ అభిప్రాయపడింది. దీనివల్ల 100 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఏర్పడుతుం ది. ప్రభుత్వం మన సు పెడితే రిజర్వాయర్లను ఏడాదిలో పూర్తి చేయొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. కంతానపల్లిని పూర్తి చేస్తే దేవాదుల ఎత్తిపోతలకు, ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2కు నిల్వ నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉం టుందని పేర్కొంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో స్టేజ్-2 పనులు పూర్తయినా, స్టేజ్-1 పనులు కొనసాగుతుండటంతో ఆ పనులను వెంటనే పూర్తి చేయాల్సి ఉంది. మిడ్‌మానేరులో పునరావాస సమస్యలను పరిష్కరిస్తే పనులు ముందుకు సాగే అవకాశముందని కమిటీ విశ్లేషించింది.