జిల్లాల ఏర్పాటు సాహసోపేతం: లక్ష్మారెడ్డి
⇒ జిల్లాల పునర్విభజనతో నూతన శకం
⇒ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల : జిల్లాల పునర్విభజనతో రాష్ట్రంలో నూతన శకం మొదలైందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ అందరి అభిప్రాయాలకనుగుణంగా జిల్లాలను ఏర్పాటు చేయడం సాహసోపేతం అని కొనియాడారు. ఎక్కడా రాజకీయాలకు తావివ్వకుండా, ప్రజల సౌకర్యార్థం జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు.
దీంతో ప్రజలకు మరింత దగ్గరగా పాలన అందుతుందని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలు సులువుగా అందుతాయన్నారు. సత్వరమే అధికారులు సమస్యల పట్ల స్పందించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కొందరు విపక్ష నాయకులు పునర్విభజనను రాజకీయం చేయడం తగదని సూచించారు. జడ్చర్లను జిల్లా చేయాలని విపక్ష నాయకులు డిమాండ్ చేయడం హాస్యాస్పదమన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని మంత్రి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తంచేశారు.