
ఇక్కడ లేని గొడవలు బాబు సృష్టిస్తున్నారు
శాంతిభద్రతలపై కేసీఆర్‌కు కృతజ్ఞతలు :సీఆర్
సాక్షి, హైదరాబాద్: ఏడాది కాలంగా హైదరాబాద్‌లో ఎలాంటి శాంతిభద్రత సమస్యా తలెత్తలేదని, ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్న కారణంగా ఏపీ సీఎం చంద్రబాబు రెండు రాష్ట్రాల మధ్య కొత్త సమస్యలు తెస్తున్నారని కాంగ్రెస్ నేత, శాసనమండలి విపక్ష నేత సీ రామచంద్రయ్య విమర్శించారు. హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణం ఉందని, అందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు.
ఓటుకు కోట్లు కేసులో కూరుకుపోయిన చంద్రబాబు రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను రెచ్చగొడుతూ గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇందిరాభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు సెక్షన్ 8 అమలు గురించి మాట్లాడటంలో ఉద్దేశం ఏమిటన్నారు. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామంటూ సీఎం దిగజారి మాట్లాడుతున్నారన్నారు.