సాక్షి, సిటీబ్యూరో: మల్కాజిగిరికి చెందిన క్యాబ్ డ్రైవర్ విష్ణు ఆరు నెలల క్రితం ఓలా సంస్థలో చేరి కారు లీజుకు తీసుకున్నాడు. ఆ సంస్థ నిబంధనల ప్రకారం సుమారు రూ.8.5 లక్షల ఖరీదైన వాహనం లీజు కోసం మొదట రూ.35,000 చెల్లించాడు. అనంతరం ప్రతి రోజూ రూ.1135 చొప్పున చెల్లిస్తూ కారు బాకీ తీర్చేయాలి. ఇలా మూడు, నాలుగేళ్లు కష్టపడితే వాహనం తన సొంతమవుతుంది. ప్రతిరోజు వచ్చే ఆదాయంతో తనకు ఉపాధి లభిస్తుందని భావించాడు. అయితే అకస్మాత్తుగా ఓలా నిబంధనలు మారిపోయాయి. కొత్తగా 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిపితే ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.4 చొప్పన చెల్లించాలని తాజాగా ఓ నిబంధన విధించారు. దీంతో రోజువారీ ఇన్‌స్టాల్‌మెంట్ తడిచిమోపెడైంది. డబ్బులు చెల్లించలేకపోవడంతో వాహనాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో అతను రోడ్డున పడాల్సి వచ్చింది. ఇది ఒక్క విష్ణుకు ఎదురైన అనుభవం మా త్రమే కాదు. క్యాబ్ సంస్థల్లో విధించే అడ్డగోలు నిబంధనల వల్ల తాము నిలువు దోపిడీకి గురవుతున్నామం టూ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు.
దోపిడీ పర్వం ఇలా....
గ్రేటర్ పరిధిలో దాదాపు 10 వేల ఓలా లీజు వాహనాలు నడుస్తున్నా యి. తమ సొంత వాహనాలు ఓలాతో అనుబంధం చేసి క్యాబ్ సేవలు అందించే ఓలా భాగస్వాములు కాకుండా ఆ సంస్థే నేరుగా కొన్ని వాహనాలను కొనుగోలు చేసి లీజుకు ఇచ్చే పద్ధతికి ఇటీవల శ్రీకారం చుట్టింది. నిరుద్యోగ యువత నుంచి దీనికి అనూహ్య స్పందన లభించింది. దీంతో గత రెండేళ్లుగా పలువురు యువకులు ఉపాధి కోసం లీజు బాటను ఎంపిక చేసుకున్నారు. సాధారణంగా ఫైనాన్షియర్ల వద్ద అప్పు తీసుకొని వాహనాల కొనుగోలు చేస్తే ప్రతి నెలా వాయిదాలు చెల్లించాలి. ఓలాలో మాత్రం ఏ రోజుకు ఆ రోజే చెల్లించాలి. ఈ లెక్కన రూ.35,000 డౌన్ పేమెంట్ చేసి ప్రతి రోజు రూ.1135 చొప్పన వాయిదాలు కట్టాల్సి ఉంటుంది. అంటే ఒక డ్రైవర్ రోజుకు రూ.2500 నుంచి రూ.3000 వరకు సంపాదిస్తే అందులో లీజు వాయిదా డబ్బులతో పాటు, మరో రూ.1000 వరకు డీజిల్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఖర్చులన్నీ పోను డ్రైవర్‌కు రూ.500 కంటే ఎక్కువ మిగిలే అవకాశం లేదు. ఒకవైపు ఈ లీజ్ దందా ఇలా ఉండగా కొత్తగా మరో నిబంధన తెచ్చారు. రోజలో 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిపితే ప్రతి కిలోమీటర్‌కు రూ.4 చొప్పున చెల్లించాలి. 300 కిలోమీటర్లు నడిపే డ్రైవర్ ప్రతి రోజు చెల్లించే రూ.1135 తో పాటు, మరో రూ.400 అదనంగా కట్టాల్సి వస్తోంది. దీంతో డ్రైవర్‌కు ఒక్కోసారి ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు. ‘‘ ఒకసారి వాహనాన్ని లీజుకు తీసుకు న్న తరువాత ఏ డ్రైవరైనా కష్టపడి పని చేయాలనుకుంటాడు. నాలుగు కిలోమీటర్లు ఎక్కువ తిప్పితే అదనపు డబ్బుల వస్తాయని భావిస్తాడు. కానీ ఓలా నిబంధనల వల్ల డ్రైవర్లు చావకుండా, బతకకుండా చేస్తున్నారు. ఇది దారుణమైన దోపిడీ. ప్రభుత్వమే మా సమస్యలకు పరిష్కారం చూపాలి.’’ అని తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సలావుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు.
మిగిలేది అప్పులే...
నగరంలో సుమారు 50 వేల క్యాబ్‌లు నగరంలో ప్రయాణికులకు వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. ఒక్క శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికే 10 వేలకు పైగా క్యాబ్‌లు నడుస్తున్నాయి. వీటిలో ఎక్కువ శాతం ఓలాకు చెందినవే. నగరంలో క్యాబ్ సేవలు ప్రారంభమైన తొలి రోజుల్లో డ్రైవర్లు ప్రతి నెలా రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు కూడా సంపాదించారు. మొదట్లో ఎంతో లాభసాటిగా ఉన్న ఓలా వ్యాపారం కొద్ది కాలంలోనే శాపంగా మారింది. రూ.లక్షల్లో అప్పులు చేసి, ఫైనాన్షియర్ల వద్ద చక్రవడ్డీలపై డబ్బులు తీసుకొని కార్లు కొనుగోలు చేసిన వాళ్లు ఓలాకు అనుసంధానమైన తరువాత తీవ్రంగా నష్టపోయి, రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో ఓలా సంస్థ లీజు వాహనాలను ముందుకు తెచ్చింది. సంస్థే స్వయంగా వాహనాలు ఇవ్వడంతో డ్రైవర్లలో మరోసారి ఆశలు చిగురించాయి. అయితే తరచు నిబంధనలు మారుస్తుండటంతో వాయిదాలు చెల్లించలేక, అప్పులు తీరే మార్గం లేక చివరకు వాహనాలను వదిలేసుకుంటున్నారు. ఈ రెండేళ్ల కాలంలో వందలాది మంది డ్రైవర్లు లీజు ఒప్పందం వల్ల అప్పల పాలై రోడ్డున పడినట్లు డ్రైవర్ల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
అక్రమ వసూళ్లను నిలిపివేయాలి
కేవలం డ్రైవర్లను దోచుకోవడమే లక్ష్యంగా ఓలా నిబంధనలు విధిస్తోంది. దీనిపై ఆందోళనకు దిగి తే బౌన్సర్‌ల ద్వారా దాడులు చేయిస్తున్నారు. ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి. రవాణాశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మను కలిసి విజ్ఞప్తి చేశాం. ఇప్పటికైనా ఓ పరిష్కారం చూపాలి. –సలావుద్దీన్, అధ్యక్షుడు,తెలంగాణ ఫోర్‌వీలర్స్ డ్రైవర్స్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment