సాక్షి, హైదరాబాద్: ఓలా, ఉబెర్ డ్రైవర్లు క్యాబ్ బంద్ తలపెట్టారు. దీంతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే సుమారు మూడు వేల క్యాబ్‌లపై ప్రభావం పడింది. ఉబెర్, ఓలా సంస్థలు సరైన కమీషన్లు ఇవ్వడం లేదని, తమ శ్రమకు తగిన ఆదాయం లభించడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో రాకపోకలు సాగించే క్యాబ్‌లు చాలావరకు నిలిచిపోయాయి. ఓలా, ఉబెర్ సర్వీసులకు ఆటంకం ఏర్పడడంతో జీఎమ్మార్ ఎయిర్ పోర్టు మూడు ప్రత్యామ్నాయ క్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చింది.
►ఎయిర్‌పోర్టు నుంచి సాధారణంగా ప్రతిరోజూ సుమారు 5000 క్యాబ్‌లు 24 గంటల పాటు సేవలందజేస్తాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి క్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ కోవిడ్ దృష్ట్యా కొంతకాలంగా క్యాబ్‌ల సంఖ్య 3 వేలకు తగ్గింది. గతంలో ఎయిర్‌పోర్టుకు నడిపే క్యాబ్‌లకు రోజుకు రూ.2000 నుంచి రూ.3000 వరకు ఆదాయం లభించగా ఇప్పుడు రోజుకు రూ.1000 కూడా రావడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
►ఎయిర్‌పోర్టులో రూ.250 పార్కింగ్ చార్జీలు, డీజిల్ ఖర్చు మినహాయిస్తే రోజుకు రూ.500 మాత్రమే మిగులుతున్నాయని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధి షేక్ సలావుద్దీన్ విస్మయం వ్యక్తం చేశారు. ఓలా, ఉబెర్ సంస్థల నుంచి సరైన కమీషన్‌లు లభించకపోవడంతోనే తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టు నుంచి ఓలా, ఉబెర్ క్యాబ్‌ల సేవలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు.
కమీషన్లు పెంచాలి..
ప్రభుత్వం గతంలో ప్రతిపాదించినట్లుగా కిలోమీటర్‌కు రూ.17 చొప్పున ఇవ్వాలని డ్రైవర్‌లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతంఒక కిలోమీటర్‌పై రూ.10 కూడా గిట్టుబాటు కావడం లేదని, దీంతో రూ.లక్షల్లో అప్పులు తెచ్చి కొనుగోలు చేసిన వాహనాలకు నెల నెలా రుణాలు కూడా చెల్లించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. కమీషన్లు పెంచే వరకు క్యాబ్‌లు నడపబోమని సలావుద్దీన్ స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాయంగా మూడు క్యాబ్ సర్వీసులు..
డ్రైవర్ల ఆందోళన దృష్ట్యా ఉబెర్, ఓలా సేవలకు ఆటంకం ఏర్పడడంతో జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి చాయిస్, 4 వీల్స్, క్విక్ రైడ్ అనే మూడు క్యాబ్ సర్వీస్ ఆపరేటర్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు ఆర్టీసీ పుష్పక్ బస్సు లు కూడా అందుబాటులో ఉన్నాయని, ప్రయాణికుల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment