ola and uber
-
ఓలా, ఉబెర్లపై ఢిల్లీ ప్రభుత్వ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: త్వరలో ఢిల్లీలో ఓలా, ఉబెర్ లాంటి యాప్ బేస్డ్ క్యాబ్ అగ్రిగేటర్లను ప్రభుత్వం నియంత్రించనుంది. ఇందు కోసం కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన డ్రాఫ్ట్ పాలసీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలపడంతో కొత్త పాలసీని త్వరలో నోటిఫై చేస్తామని రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ తెలిపారు. కొత్త పాలసీ ప్రకారం ఓలా ఉబెర్ లాంటి యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసు ప్రొవైడర్లు ఢిల్లీలో వాడే తమ వాహనాలను 2030లోగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవాల్సి ఉంటుంది. 25 కంటే ఎక్కువ వాహనాలున్న సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలన్నింటికీ కొత్త పాలసీ వర్తిస్తుంది. ఈ పాలసీ కింద అగ్రిగేటర్లు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.క్యాబ్ ఆపరేటర్లు కస్టమర్ల వద్ద నుంచి పీక్ అవర్స్‌లో వసూలుచేసే అత్యధిక ఛార్జీలపై మాత్రం డ్రాఫ్ట్‌లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఈ కామర్స్ సేవలందించే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీలకు కూడా ఈ కొత్త పాలసీ వర్తించనుంది.వారు కూడా తమ వాహనాలన్నింటినీ గడువులోగా విద్యుత్ వాహనాలుగా మార్చుకోవాల్సి ఉంటుంది.వాహనాలన్నీ రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగానే ఢిల్లీలో తిరగాల్సి ఉంటుంది.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై లక్ష రూపాయల దాకా జరిమానాలు విధంచనున్నారు. ఇదీచదవండి..దివ్యాంగులకు రైల్వేశాఖ అందించే ప్రత్యేక సౌకర్యాలివే.. -
ఆ ప్రయాణికులకు షాకిచ్చిన ఓలా, ఉబర్ డ్రైవర్లు
సాక్షి, హైదరాబాద్: ఓలా, ఉబెర్ డ్రైవర్లు క్యాబ్ బంద్ తలపెట్టారు. దీంతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే సుమారు మూడు వేల క్యాబ్‌లపై ప్రభావం పడింది. ఉబెర్, ఓలా సంస్థలు సరైన కమీషన్లు ఇవ్వడం లేదని, తమ శ్రమకు తగిన ఆదాయం లభించడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో రాకపోకలు సాగించే క్యాబ్‌లు చాలావరకు నిలిచిపోయాయి. ఓలా, ఉబెర్ సర్వీసులకు ఆటంకం ఏర్పడడంతో జీఎమ్మార్ ఎయిర్ పోర్టు మూడు ప్రత్యామ్నాయ క్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ►ఎయిర్‌పోర్టు నుంచి సాధారణంగా ప్రతిరోజూ సుమారు 5000 క్యాబ్‌లు 24 గంటల పాటు సేవలందజేస్తాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి క్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ కోవిడ్ దృష్ట్యా కొంతకాలంగా క్యాబ్‌ల సంఖ్య 3 వేలకు తగ్గింది. గతంలో ఎయిర్‌పోర్టుకు నడిపే క్యాబ్‌లకు రోజుకు రూ.2000 నుంచి రూ.3000 వరకు ఆదాయం లభించగా ఇప్పుడు రోజుకు రూ.1000 కూడా రావడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ►ఎయిర్‌పోర్టులో రూ.250 పార్కింగ్ చార్జీలు, డీజిల్ ఖర్చు మినహాయిస్తే రోజుకు రూ.500 మాత్రమే మిగులుతున్నాయని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధి షేక్ సలావుద్దీన్ విస్మయం వ్యక్తం చేశారు. ఓలా, ఉబెర్ సంస్థల నుంచి సరైన కమీషన్లు లభించకపోవడంతోనే తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టు నుంచి ఓలా, ఉబెర్ క్యాబ్‌ల సేవలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. కమీషన్లు పెంచాలి.. ప్రభుత్వం గతంలో ప్రతిపాదించినట్లుగా కిలోమీటర్‌కు రూ.17 చొప్పున ఇవ్వాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతంఒక కిలోమీటర్‌పై రూ.10 కూడా గిట్టుబాటు కావడం లేదని, దీంతో రూ.లక్షల్లో అప్పులు తెచ్చి కొనుగోలు చేసిన వాహనాలకు నెల నెలా రుణాలు కూడా చెల్లించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. కమీషన్లు పెంచే వరకు క్యాబ్‌లు నడపబోమని సలావుద్దీన్ స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయంగా మూడు క్యాబ్ సర్వీసులు.. డ్రైవర్ల ఆందోళన దృష్ట్యా ఉబెర్, ఓలా సేవలకు ఆటంకం ఏర్పడడంతో జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి చాయిస్, 4 వీల్స్, క్విక్ రైడ్ అనే మూడు క్యాబ్ సర్వీస్ ఆపరేటర్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు ఆర్టీసీ పుష్పక్ బస్సు లు కూడా అందుబాటులో ఉన్నాయని, ప్రయాణికుల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. చదవండి: వారి కన్నీటి కథ.. కండలు కరిగినా కడుపునిండదాయె -
చర్చలు విఫలం.. నిరవధిక సమ్మెలో ఓలా, ఊబర్ డ్రైవర్లు
ముంబై : గురువారం ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో నిరవధికంగా సమ్ మెను కొనసాగించాలని క్యాబ్ డ్రైవర్లు నిశ్చయించుకున్నారు. క్యాబ్ సంస్థల యాజమాన్యం డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయకపోవటం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఓలా, ఉబర్ సంస్థలు తమకు చెల్లించే వాటాను పెంచాలని, దురుసుగా ప్రవర్తించే ప్రయాణికుల నుంచి భద్రత కల్పించాలనే డిమాండ్లతో ముంబై నగరంలోని క్యాబ్ డ్రైవర్లు గత పదకొండు రోజులుగా సమ్మె చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా ఓలా, ఊబర్ సంస్థల యాజమాన్యం తమ డిమాండ్లను పట్టించుకోవటంలేదని ‘‘మహారాష్ట్ర రాజ్య రాష్ట్రీయ కమ్గర్ సంఘ్’’(ఎమ్‌ఆర్‌ఆర్‌కేఎస్) ఆరోపించింది. ఎమ్‌ఆర్‌ఆర్‌కేఎస్ అధ్యక్షుడు గోవింద్ మోహితే మాట్లాడుతూ.. ఓలా, ఊబర్ సంస్థల యాజమాన్యం పోలీసు అధికారుల సమక్షంలో తమ సమస్యలపై సానుకూలంగా స్పందించినా.. చర్చల్లో ఇందుకు భిన్నంగా నడుచుకున్నాయని పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. జీతాలు పెంచుతానని చెప్పి తమని మోసం చేసిన ఓలా, ఊబర్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు. చదవండి : మూడో రోజుకు చేరిన ఓలా, ఉబర్ స్ట్రైక్ -
మూడో రోజుకు చేరిన ఓలా, ఉబర్ స్ట్రైక్
ముంబై: నగరంలో ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు చేపట్టిన సమ్మె మూడో రోజుకి చేరుకుంది. ఓలా, ఉబర్ సంస్థలు తమకు చెల్లించే వాటాను పెంచాలని, దురుసుగా ప్రవర్తించే ప్రయాణికుల నుంచి భద్రత కల్పించాలనే డిమాండ్లతో ముంబై నగరంలోని క్యాబ్ డ్రైవర్లు సోమవారం నుంచి సమ్మె చేపట్టారు. దీంతో ముంబైలో 80 శాతం వరకు ఓలా, ఉబర్ సంస్థలకు చెందిన క్యాబ్‌లు రోడ్డెక్కడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమేర ఆ సంస్థలకు చెందిన క్యాబ్‌లు నడిచినప్పటికీ.. ధరలు రెండింతలు ఉండటంతోపాటు.. వాటి కోసం అధిక సమయం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు క్యాబ్‌లు నడుపుతున్న వారిపై కూడా స్ట్రైక్‌లో పాల్గొన్న డ్రైవర్లు బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ప్రయాణికులు తమ భద్రతపైన ఆందోళన చెందుతున్నారు. గత కొంతకాలంగా క్యాబ్ సర్వీస్‌లకు అలవాటు పడ్డ జనాలు మూడు రోజులుగా ఓలా, ఉబర్ సేవలు పెద్ద ఎత్తున నిలిచి పోవడంతో సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. -
క్యాబ్‌లకు బ్రేక్...
సాక్షి, హైదరాబాద్: ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్ల ఆందోళన కొనసాగుతోంది. శుక్రవారం రెండోరోజు కూడా పలు మార్గాల్లో సర్వీసులను నిలిపివేశారు. సికింద్రాబాద్, ఈసీఐఎల్, కుషాయిగూడ, హైటెక్‌సిటీ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తదితర రూట్లలో ఓలా, ఉబెర్ సర్వీసులకు బ్రేక్ పడింది. దీంతో ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్, తదితర ఐటీ కారి డార్లలోనూ క్యాబ్ సేవలు నిలిచి పోయాయి. దీంతో ఆ మార్గాల్లో పనిచేసే ఉద్యోగులు, ఐటీ నిపుణులు ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఓలా, ఉబెర్ సంస్థల్లో నెలకొన్న అనారోగ్యకరమైన పోటీ వాతా వరణం, రోజుకు 18 నుంచి 20 గంటలపాటు పని చేసినా రుణాలు చెల్లించలేని దుస్థితి, ఫైనాన్షియర్ల వేధింపులు, క్యాబ్‌డ్రైవర్ల ఆత్మహత్యల నేపథ్యంలో డ్రైవర్లు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం వందలాది మంది క్యాబ్డ్రైవర్లు అసెంబ్లీ ముట్టడికి విఫలయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు శివతోపాటు పలువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రత్యేక యాప్ కోసం డ్రైవర్ల డిమాండ్... ఓలా, ఉబెర్ క్యాబ్ సంస్థల్లో సుమారు 1.5 లక్షల క్యాబ్‌లున్నాయి. చాలా మంది డ్రైవర్లు రూ.లక్షల్లో అప్పు చేసి వాహనాలను కొనుగోలు చేశారు. మొదట్లో పెద్ద ఎత్తున ఆదాయం, ప్రోత్సాహకాలు లభించడంతో చాలామంది డ్రైవర్లు ఓలా, ఉబెర్‌లకు బారులు తీరారు. డ్రైవర్ల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో సదరు సంస్థలు ప్రోత్సాహకాలకు కోత విధించి, కమీషన్లను పెంచుకున్నాయి. దీంతో గతంలో నెలకు రూ.50 నుంచి రూ.60 వేలు సంపాదించిన డ్రైవర్‌కు ఇప్పుడు రూ.25 వేలు కూడా లభించడం లేదు. దీంతో వాహన రుణాలు చెల్లించడం, భార్యా పిల్లలను పోషించుకోవడం కష్టంగా మారింది. దీంతో డ్రైవర్లు ‘ఓలా, ఉబెర్ క్యాబ్‌కు హఠావో, డ్రైవర్‌కు బచావో’అనే నినాదంతో ఆందోళనకు దిగారు. లక్షలాదిమంది డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వమే ఒక యాప్‌ను రూపొం దించాలని, డ్రైవర్లకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించాలని కోరుతున్నారు. -
స్తంభించిన ఓలా.. ఉబెర్
► రాజధానిలో క్యాబ్ డ్రైవర్ల ఆందోళన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ చేపట్టిన క్యాబ్‌ల బంద్‌తో శనివారం వేలాది వాహనాలు నిలిచిపోయాయి. ఓలా, ఉబెర్ క్యాబ్ సంస్థల వేధింపులకు వ్యతి రేకంగా పిలుపునిచ్చిన ఈ బంద్‌తో నూతన సంవత్సర వేడుకలకు ఆటంకం కలిగింది. అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లేవారు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు, శంషాబాద్ విమానాశ్ర యం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. వారు ఆటోలు, బస్సులు, అరకొరగా నడిచిన ఇతర సంస్థల క్యాబ్ సర్వీసులను ఆశ్ర యించారు. గ్రేటర్ ఆర్టీసీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి 50 అదనపు బస్సులు నడిపినా ఇబ్బందులు తప్పలేదు. ఆదివారం నుంచి మరిన్ని బస్సులు పెంచుతామని ఆర్టీసీ తెలిపింది. నగర వ్యాప్తంగా ధర్నాలు... తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతా ల్లో ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, మల్కాజిగిరి, ఈసీఐఎల్, సికింద్రా బాద్, ఉప్పల్, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కూకట్పల్లి, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ క్యాబ్‌లను అడ్డు కున్నారు. పలుచోట్ల పోలీసులు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఓలా, ఉబెర్‌లకు చెందిన సుమారు లక్ష క్యాబ్ సర్వీసుల్లో 60 శాతానికి పైగా నిలిచిపోయాయి. డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన... తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆందోళన విరమించబోమని, ఈ నెల 4 వరకు బంద్ పాటిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు శివ తెలిపారు. ఓలా, ఉబెర్ సంస్థల దోపిడీకి నిరసనగా సుందరయ్య పార్కు వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. డ్రైవర్లకు కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించకుండా శ్రమ దోచు కుంటున్నారని సీఐటీయూ నాయకులు ఆరో పించారు. చాంద్రాయణగుట్ట, బాబానగర్ వద్ద ప్రధాన రహదారిపై క్యాబ్ డ్రైవర్లు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఉబెర్ అదనపు ఆకర్షణ... క్యాబ్‌ల బంద్ నేపథ్యంలో ఉబెర్ సంస్థ శనివారం డ్రైవర్లకు అదనపు వేతనాలను ప్రకటించింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని సర్వీసులు నడిపేందుకు ముందుకు వచ్చే డ్రైవర్లకు రూ.8 వేల వరకు చెల్లించనున్నట్లు వారికి ఎస్ఎంఎస్లు పంపింది.