
ముంబై: నగరంలో ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు చేపట్టిన సమ్మె మూడో రోజుకి చేరుకుంది. ఓలా, ఉబర్ సంస్థలు తమకు చెల్లించే వాటాను పెంచాలని, దురుసుగా ప్రవర్తించే ప్రయాణికుల నుంచి భద్రత కల్పించాలనే డిమాండ్లతో ముంబై నగరంలోని క్యాబ్ డ్రైవర్లు సోమవారం నుంచి సమ్మె చేపట్టారు. దీంతో ముంబైలో 80 శాతం వరకు ఓలా, ఉబర్ సంస్థలకు చెందిన క్యాబ్‌లు రోడ్డెక్కడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమేర ఆ సంస్థలకు చెందిన క్యాబ్‌లు నడిచినప్పటికీ.. ధరలు రెండింతలు ఉండటంతోపాటు.. వాటి కోసం అధిక సమయం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
మరోవైపు క్యాబ్‌లు నడుపుతున్న వారిపై కూడా స్ట్రైక్‌లో పాల్గొన్న డ్రైవర్లు బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ప్రయాణికులు తమ భద్రతపైన ఆందోళన చెందుతున్నారు. గత కొంతకాలంగా క్యాబ్ సర్వీస్‌లకు అలవాటు పడ్డ జనాలు మూడు రోజులుగా ఓలా, ఉబర్ సేవలు పెద్ద ఎత్తున నిలిచి పోవడంతో సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.