ఇతడి పేరు నగేష్.. మూడు నెలల క్రితం వరకు క్యాబ్‌డ్రైవర్. రెండేళ్ల క్రితం అప్పు చేసి కారు కొనుక్కున్నాడు. ఉబర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో బతుకు బండిని ముందుకు నడిపించాడు. తల్లిదండ్రులు సైతం అతడితో పాటే ఉంటున్నారు. నాచారం సమీపంలోని మల్లాపూర్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం. దగ్గర్లోని ఓ స్కూల్లో పిల్లల చదువులు. ప్రతినెలా ఏదో విధంగా కారు రుణ వాయిదాలు, ఇంటి అద్దె చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉన్నంతలో జీవితం సాఫీగానే గడిచిపోతుందనుకుంటున్న తరుణంలో కరోనా మహమ్మారి పిడుగులా వచ్చిపడింది. లాక్‌డౌన్‌తో అంతా కకావికలమైంది. ఎక్కడికక్కడ రవాణా స్తంభించింది. క్యాబ్ సేవలకు బ్రేక్ పడింది. అప్పటి వరకు సాఫీగా సాగిపోయిన నగేష్ బతుకు ‘బండి’ఆగిపోయింది. ‘లాక్‌డౌన్ సడలించడంతో ధైర్యం వచ్చింది.బండి బయటకు తీశాను. కానీ జనం క్యాబ్‌లు ఎక్కేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈఎంఐ కట్టలేని దుస్థితిలో కారును మొబైల్ చెరుకు బండిగా మార్చుకున్నాడు. మేడిపల్లి దగ్గర్లోనిరహదారిపై అతడి మొబైల్ చెరుకు బండి నిత్యం వినియోగదారుల కోసం ఎదురుచూస్తోంది.
‘పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మడం’ అంటే ఇదేనేమో. ఎలాంటి ఒడిదొడుకులూ లేకుండా జీవనం సాగిస్తున్న సమస్త వృత్తులను కరోనా కకావికలం చేసింది. బతుకు బాటను ఛిద్రం చేసింది. ఉపాధిపై ఉక్కుపాదం మోపింది. కిరాణా దుకాణాలు, కూరగాయలు, పండ్ల అమ్మకాలు వంటి కొన్ని రకాల వ్యాపారాలు మినహా అనేక రంగాలపై పెను ప్రభావం చూపింది. కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రైవేటు స్కూళ్లలో టీచర్లుగా పనిచేసిన ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చేసేదేమీ లేక కొందరు రోడ్ల పక్కన పండ్లు, కూరగాయలను విక్రయిస్తున్నారు. గూగుల్, ఇన్ఫోసిస్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు మొదలుకొని వందలాది ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోం’ వెసులుబాటునిచ్చాయి. దీంతో ఐటీ కారిడార్‌లకు క్యాబ్‌ల రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా మహమ్మారి ఉద్ధృతి దృష్ట్యా నగరంలో జనం క్యాబ్‌లు, ఆటోలు ఎక్కేందుకు భయపడుతున్నారు. సొంత వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుండటంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ఇలా.. ఎన్నో వృత్తులపై కరోనా పెను ప్రభావమే చూపించింది.
సాక్షి, సిటీబ్యూరో, జోన్ బృందం: అనేక రకాల వృత్తులను కరోనా కటేసింది. లాక్‌డౌన్‌తో బతుకుదెరువును ప్రశ్నార్థకం చేసింది. దీంతో చాలా మంది ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు. కిరాణా దుకాణాలు, కూరగాయలు, పండ్ల అమ్మకాలు వంటి కొన్ని రకాల వ్యాపారాలు మినహా అనేక రంగాలు ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు స్కూళ్లలో టీచర్లుగా పనిచేసిన ఎంతోమంది మహిళలు జీతాలు లేక తిప్పలు పడుతున్నారు. స్కూళ్లు నడవడం లేదంటూ.. ఫీజులు వసూలు చేసేనే జీతాలంటూ ఇబ్బంది పెడుతున్నారు. ఆన్‌లైన్ క్లాసులను తక్కువ మందితో కొనసాగిస్తూ మిగతా వారిని తొలగించేస్తున్నారు. రోడ్ల పక్కన పండ్లు, కూరగాయలను బండ్లపై విక్రయిస్తున్నారు. గూగుల్, ఇన్ఫోసిస్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు మొదలుకొని వందలాది ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వెసులుబాటునిచ్చాయి. దీంతో ఐటీ కారిడార్‌లకు క్యాబ్‌ల రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా మహమ్మారి ఉధృతి దృష్ట్యా నగరంలో జనం క్యాబ్‌లు, ఆటోలు ఎక్కేందుకు భయపడుతున్నారు. సొంత వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
టీచర్ జాబ్ వదిలి టైలరింగ్
సికింద్రాబాద్‌లోని తుకారాంగేట్‌లో ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేశాను. కరోనా నేపథ్యంలో స్కూల్ మూసివేశారు. దీంతో మాకు జీతాలు కూడా రావడం లేదు. విద్యార్థులకు ఆన్‌లైన్ విద్య పెట్టి స్టాఫ్‌ను తగ్గించేసి బోధన చేస్తున్నారు. జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత్యంతరం లేక టీచర్ జాబ్ మానేసి టైలరింగ్ చేసుకుంటున్నా.– రాణి, తుకారాంగేట్
జాబ్ కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తున్నా..
లాక్‌డౌన్ కారణంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అప్పటి నుంచి జీతాలు సరిగా ఇవ్వడం లేదు. జీతాలు అడిగితే లాక్‌డౌన్‌లో ఇవ్వడం కష్టమని స్కూల్ యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో టీచర్ ఉద్యోగం మానేసి ప్రత్యామ్నాయ మార్గంగా ఒక జాబ్ కన్సల్టెన్సీలో ఉద్యోగంలో చేరాను. తప్పని పరిస్థితుల్లో టీచర్ జాబ్ మానేసి ఈ ఉద్యోగం చేయాల్సి వస్తోంది.– రామలీల, సికింద్రాబాద్
అద్దె కట్టడం కూడా భారంగా మారింది
కరోనా కారణంగా టిఫిన్ సెంటర్‌కు వచ్చేందుకు ఎవ్వరూ మొగ్గుచూపడం లేదు. దీంతో ఈ కష్టకాలంలో ఇంటి అద్దె కట్టడానికి సైతం కూడా డబ్బులు సమకూరని పరిస్థితులు తలెత్తాయి. అందుకే టిఫిన్ సెంటర్‌ను మూసివేసి ఓ ప్రైవేటు ఉద్యోగం వెతుక్కున్నాను. ఇంట్లో నుండే పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాను. – రమాదేవి, ఈస్ట్‌మారేడుపల్లి
కూరగాయలు అమ్ముతున్నాం..
లాక్‌డౌన్‌తో ఉద్యోగం పోయింది. రెండు నెలలకు పైగా లాక్‌డౌన్ కారణంగా యాజమాన్యం సిబ్బందిని తగ్గించుకుంది. దీంతో కుటుంబం రోడ్డున పడింది. సహారా వద్ద రోడ్డుపై కూరగాయలు అమ్ముతూ కుటుంబపోషణ చేసుకుంటున్నాం. మేము భార్యాభర్తలిద్దరం కూరగాయలను రోడ్డు పక్కన అమ్ముతున్నాం. – శ్రీను, మన్సూరాబాద్
మాస్క్‌ల వ్యాపారం చేసుకుంటున్నా
సీజనల్‌కు అనుకూలంగా తోపుడు బండిపై పండ్లు, కూరగాయలు, ఇతరత్రా అమ్ముకుంటూ వచ్చా. కరోనా ప్రభావంతో పూర్తిగా అమ్మకాలు పడిపోయాయి. దీంతో ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్న మాస్క్‌ల వ్యాపారం చేసుకుంటూ పూట గడుపుకుంటున్నాం. మా కుటుంబం గడిచేంత డబ్బులు రానప్పటికీ గత్యంతరం లేక మాస్క్‌ల విక్రయాలు చేపడుతున్నాం. – అనీత, సూరారం రాజీవ్ గృహకల్ప.
పండ్లు అమ్మి జీవనం సాగిస్తున్నాం
మాది విజయవాడ.. నా భర్త నేను సంవత్సరం క్రితం అప్పుచేసి ఐడీపీఎల్ సమీపంలో నెలకు రూ.11 వేల అద్దెతో టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశాం. కరోనా వైరస్ మహమ్మారి మా వ్యాపారంపై దెబ్బ కొట్టింది. మూడు నెలలుగా అద్దె చెల్లించలేకపోయాం. టిఫిన్ సెంటర్ బండి రేకులు తొలగించి దానిపైనే పండ్ల విక్రయాలు చేపట్టాం. లాభం లేకపోయినా మరోదారి లేక పండ్లు అమ్మి జీవనం సాగిస్తున్నాం. – తులసి,ఐడీపీఎల్ ఆదర్శ్‌నగర్.
కరోనా కాటేస్తుందేమో..
క్యాబ్ డ్రైవర్లను కరోనా భయం వెంటాడుతోంది. లాక్‌డౌన్ నడలించిన తర్వాత ఎలాంటి పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజ్‌లు, శానిటైజర్లు ఇవ్వకుండానే క్యాబ్ సంస్థలు తమ సేవలను వినియోగించుకుంటున్నాయని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల వల్ల కరోనా వైరస్ సోకుతుందేమోననే భయంతో చాలామంది డ్రైవర్లు ప్రత్యామ్నాయ ఉపాధిని ఎంచుకుంటున్నారు. ఉబెర్, ఓలా నుంచి భరోసా లభించడం లేదు. ప్రోత్సాహకాలు లేవు. పైగా బండ్లను బ్లాక్‌లో పెట్టి వేధిస్తున్నారు. ఇంక బండి నడిపి ఏం లాభం..’ అని ఆవేదన వ్యక్తం చేశారు యూసుఫ్‌గూడకు చెందిన జూకీర్ హుస్సేన్. ప్రస్తుతం మామిడి పండ్లు విక్రయిస్తున్నాడు.
ప్రయాణికులు లేక వెలవెల
ఉబెర్, ఓలా వంటి సంస్థలు 50 శాతం మేరకు వాహనాలను అందుబాటులోకి తెచ్చినా ప్రయాణికులు లేక వెలవెలపోతున్నాయి. ‘18 గంటల నుంచి 20 గంటల పాటు ఓలా, ఉబెర్ యాప్‌లు ఓపెన్ చేసుకొని కూర్చున్నా ఆశించిన స్థాయిలో బుకింగ్‌లు రావడం లేదు.’ అని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సలావుద్దీన్ విస్మయం వ్యక్తం చేశారు. క్యాబ్ అగ్రిగేటర్‌లకు వందల కోట్ల రూపాయాల ఆదాయాన్ని ఆర్జించిన డ్రైవర్లకు ఇప్పుడు ఎలాంటి ఉపాధి లేకుండా పోయిందని, ఇటు ప్రభుత్వం కానీ, అటు క్యాబ్ సంస్థలు కానీ తమను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఆరోగ్య బీమా కల్పించాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. దేశీయ విమాన సర్వీసులు, రైళ్లు, బస్సుల రాకపోకలు పరిమిత స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. కానీ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్‌లకు రాకపోకలు సాగించేందుకు కూడా ఎక్కువ శాతం సొంత వాహనాలనే వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.
మొబైల్ కిరాణం..
అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన ప్రభాకర్‌కు వింగర్ వాహనం ఉంది. హెచ్‌ఎస్‌బీసీ, ఈజీ కమ్యూట్ సంస్థల ఉద్యోగుల కోసం బండి నడిపేవాడు. లాక్‌డౌన్‌తో సేవలు నిలిచిపోయాయి. కష్టాలు మొదలయ్యాయి. మార్చి నెల వరకు చేసిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఈజీ కమ్యూట్ సంస్థ వేధిస్తున్నట్లు వాపోయాడు. ఇప్పుడు ప్రభాకర్ తన వింగర్ వాహనంలోనే ఒక చిన్న మొబైల్ కిరాణా దుకాణం ప్రారంభించాడు. ప్రతిరోజూ అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి నారపల్లికి వచ్చి అక్కడ వస్తువులను విక్రయిస్తున్నాడు. ‘లాక్‌డౌన్ కాలంలో పస్తులున్నాం. ఇప్పటికీ బండికీ ఈఎంఐ కట్టలేకపోతున్నాను. కిస్తీలు పెరిగిపోతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఐటీ సంస్థలకు బండ్ల అవసరం లేకుండా పోయింది. సెప్టెంబర్ వరకు ఇలాగే ఉంటుందన్నారు. అప్పటి వరకు ఉపాధి కోసం ఈ మార్గం ఎంచుకున్నాను.’ అని చెప్పారు.
తప్పనిసరి పరిస్థితుల్లో..
దాదాపు మూడు నెలల లాక్‌డౌన్ సందర్భంగా వ్యాపారాలు లేక తీవ్రంగా నష్టపోయాం. ఇటీవలే లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇచ్చారు. దీంతో మా సెంటర్‌లో టిఫిన్స్ కేవలం పార్శిల్ మాత్రమే ఇస్తున్నాం. షాపు అద్దె చెల్లించడం ఇబ్బందిగా మారింది. శానిటైజర్లు, ఫెడల్ స్టాండ్లు, మాస్క్‌లు, చేతి గ్లౌజులు అమ్ముతున్నాం. – విష్ణు తివారి,బాలాజి టిఫిన్ సెంటర్ యజయాని, బేబంబజార్
మాస్క్‌లు విక్రయించి..
గతంలో ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేశాను. ప్రస్తుతం అందులో పనిలేదు. దీంతో ఇబ్బందికరంగా మారింది. ఇంటి అద్దె, నిత్యావసరాలకు డబ్బులు లేకపోవడంతో మాస్కులు తెచ్చి విక్రయిస్తున్నా. జవహర్‌నగర్ రోడ్ల పక్కన మాస్కులను విక్రయిస్తే వచ్చే కాస్త డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. – ఆజాద్, అంబేద్కర్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment