సంప్రదాయాన్ని ధిక్కరించాడని..
పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్‌తో సహా మరో ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం పెద్దవూర మండలం బాసోనిబావి తండాలో జరిగింది. పులిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని బాసోనిబావితండాలో గిరిజనులు పవిత్రంగా భావించే హోలీమాత (కాముడి) పండగను వారం రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీ.
గతంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ పండగను ఈ సారి పది సంవత్సరాలకు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రంతా తండావాసులు నిద్రాహారాలు మాని గిరిజన సంప్రదాయం ప్రకారం నృత్యాలు చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి వేకువజామున కాముడిని దహనం చేశారు. దీనిని చూడటానికి పరిసర తండాలైన కోమటికుంటతండా, నంభాపురంల నుంచి గిరిజనులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కాముడిని దహనం చేస్తున్న సమయంలో కోమటికుంట తండాకు చెందిన బాణావత్ బాలు కూడా వచ్చాడు. ఎవరైనా కాముడి దహనాన్ని చూడొచ్చు కానీ బూడిదను ముట్టుకోవడం, నోట్లో వేసుకోవడం గానీ చేయరాదనేది సంప్రదాయం. కాముడిని కాల్చిన తర్వాత వచ్చే బూడిదను గ్రామ పెద్ద అయిన మదిగేరియా మొదటగా తీసుకుని బొట్టు పెట్టుకుని నోట్లో వేసుకున్న తరువాత గ్రామ పెద్దలు, అనంతరం తండావాసులు దానిని తీసుకుంటారు. కేకే తండాకు చెందిన బాలు పవిత్రమైన కాముడి బూడిదను ఎవరూ తీసుకోకముందే దానితో బొట్టు పెట్టుకుని నోట్లో వేసుకున్నాడు. గిరిజనుల సంప్రదాయం ప్రకారం ఇది తండాకు అరిష్టం. దీంతో బాలును తండాకు చెందిన గిరిజనులు పట్టుకుని చితక బాదారు.
కోపంలో అతనిని ఏమైనా చేసారేమోనని తండాకు చెందిన గ్రామపెద్ద ఒకరు అతన్ని తీసుకుని వెళ్లి ఇంట్లో తాళం వేసి నిర్బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి హాలియా సీఐ శివశంకర్, పెద్దవూర, హాలియా, సాగర్ ఎస్‌ఐలు ఇండ్ల వెంకటయ్య, బోజ్యానాయక్, రజినీకర్‌లు తమ సిబ్బందితో చేరుకున్నారు. ఇంటిలో బంధించిన బాలును స్టేషన్‌కు తరలించే క్రమంలో తండావాసులు అతన్ని తీసుకుపోవద్దని, తమకు అప్పగించాలని అతడిని అంతం చేస్తామని పోలీసులను అడ్డుకుని రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. ఈ క్రమంలో పెద్దవూర ఏఎస్‌ఐ తాడిపర్తి శేషుబాబు, హెడ్‌కానిస్టేబుల్ శ్యాంసుందర్‌రెడ్డి, మరో ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులకు గాయాలయ్యాయి.
వీరిలో ఏఎస్‌ఐకి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సాగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సంప్రదాయానికి భంగం కలిగించిన బాలుపై కేసు నమోదు చేశామని, అదేవిధంగా అక్కడికి వెళ్లిన పోలీసులపై దాడి చేసి విధులకు ఆటంకం కల్గించినందుకు తండావాసులపై కూడా కేసులు పెట్టి రిమాండ్‌కు పంపనున్నట్లు సీఐ తెలిపారు.