పార్లమెంటరీ బృందానికి కాంగ్రెస్ నేతల వినతి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఫార్మాసిటీని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పేదల భూములతో ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని ఆరోపిం చింది. శనివారం నగర పర్యటనకు వచ్చిన రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి సారథ్యంలోని కేంద్ర శాస్త్ర, సాంకేతిక అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులను డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఆధ్వరంలో కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఫార్మాసిటీ ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
పర్యావరణ అనుమతి, ప్రజాభిప్రాయసేకరణ లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా భూసేకరణ జరుపుతోందని ఎన్‌డీఆర్‌ఎఫ్ మాజీ చైర్మన్ ఎం.శశిధర్‌రెడ్డి, కిసాన్–ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, పర్యావరణవేత్త ప్రొఫెసర్ దొంతి నర్సింహారెడ్డి వివరించారు. వ్యవసాయరంగంపై ఆధారపడిన రైతాంగం జీవనోపాధి కోల్పోతుందని, నగరానికి సరఫరా అయ్యే కూరగాయలు, పాలు, పండ్ల ఉత్పత్తులపై ప్రభావం పడుతుందనే అంశాన్ని విస్మరించడం శోచనీయమన్నారు.