మంచిర్యాలటౌన్: డిసెంబర్ 7వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మరో పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అభ్యర్థులు వారి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రజలకు ఏమి చేస్తారనే దానిపై ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా చర్యలను చేపట్టింది. ప్రతి ఉద్యోగి ఓటుహక్కు వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ అధికారులు పోస్టల్ బ్యాలెట్‌పై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఉద్యోగుల ఓట్లు సైతం తమకు అనుకూలంగా పడేందుకు అన్ని రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ మేనిఫెస్టోల్లో వారికి అనుకూల తాయిలాలు ప్రకటించి, ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాయి.
ప్రస్తుతం ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు 3,896 మంది ఉండగా, ఇతర ఉద్యోగస్తులు మరో 2,600 మంది వరకు ఉన్నారు. ఇందులో టీచర్లు, ఎన్జీవోలు, పంచాయతీరాజ్ ఉద్యోగులు, రెవెన్యూ, పోలీసులు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్). దీనిని రద్దు చేయాలంటూ ఉద్యోగులు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇందుకు అన్ని ప్రధాన పార్టీలు సానుకూలంగా స్పందించాయి. అలాగే పీఆర్సీ, మధ్యంతర భృతిపై కూడా ఉద్యోగులు ఆశతో ఉన్నారు. ఉపాధ్యాయులైతే ఉమ్మడి సర్వీసు రూల్స్ రావడం లేదని అంటుండగా, ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తాము కోరుతున్న డిమాండ్లకు అనుకూలంగానే మేనిఫెస్టోలను ప్రకటించాలని ఆయా ఉద్యోగ సంఘాలు ప్రధాన పార్టీలను కోరుతున్నా, ఇప్పటికీ అధికారికంగా ఏ పార్టీ పూర్తిస్థాయిలో వారి మేనిఫెస్టోలను ప్రకటించలేదు.
అన్ని పార్టీలు అనుకూలమే..
ఉద్యోగుల సమస్యలు, వారి డిమాండ్లను నెరవేర్చేందుకు అన్ని ప్రధాన పార్టీలు అనుకూలంగా ఉన్నట్లుగానే ప్రకటిస్తున్నాయి. రిటైర్మెంట్ వయస్సు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని, మంచి పీఆర్సీ, మధ్యంతర భృతి ఇస్తామని, సీపీఎస్‌ను రద్దు చేసేందుకు సానుకూల నిర్ణయం తీసుకుంటామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పలు బహిరంగ సభల్లో, ఉద్యోగ సంఘాల నాయకులు కలిసినప్పుడు ప్రకటిస్తున్నారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ అధినేతలు సైతం సీపీఎస్ రద్దుతో పాటు రిటైర్మెంట్ వయస్సును పెంచుతామని ప్రకటనలు చేస్తున్నారు. ఇందులో ఉద్యోగులు ఏ పార్టీని నమ్ముతారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఉద్యోగుల డిమాండ్లను పరిష్కారిస్తామని ప్రకటిస్తే, ఉద్యోగులు అటువైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పోస్టల్ బ్యాలెట్‌కు 30 వరకు అవకాశం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఓటు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్‌లను అధికారులు అందిస్తున్నారు. జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు 3,896 మంది ఉండగా, వీరికి ఎన్నికల ఉత్తర్వులతో పాటు పోస్టల్ బ్యాలెట్ పొందేందుకు ఫారం 12లను అందించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం కలెక్టరేట్‌కు 1,449 మంది ఫారం 12లను అందించారు. ఇంకా ఆయా నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ అధికారులకు మరో 409 మంది ఉద్యోగులు ఫారం 12లను అందించారు. మిగిలిన వారు ఈ నెల 30వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను తీసుకోనున్నారు. ఎన్నికల విధుల్లో లేని ఉద్యోగులతో పాటు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే ఉద్యోగులపై అన్ని పార్టీల నేతలు దృష్టి సారించారు. ప్రతీ ఉద్యోగి ఓటుహక్కును వినియోగించుకునేందుకు కలెక్టర్ భారతి హోళీకేరి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఉద్యోగులపై దృష్టి
Published Wed, Nov 28 2018 5:52 PM | Last Updated on Wed, Nov 28 2018 5:52 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment