'ఎలాంటి ఎడిటింగ్ జరగలేదు' | Cash-for-vote scam:audio, video tapes are original, says FSL | Sakshi
Sakshi News home page

'ఎలాంటి ఎడిటింగ్ జరగలేదు'

Published Wed, Jun 24 2015 12:24 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

'ఎలాంటి ఎడిటింగ్ జరగలేదు' - Sakshi

'ఎలాంటి ఎడిటింగ్ జరగలేదు'

హైదరాబాద్ : ఓటుకు కోట్లు వ్యవహారం కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే స్టీఫెన్సన్ మాట్లాడిన టేపులు అసలువేనని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నిర్థారించింది. ఈ కేసుకు సంబంధించి తమకు అందిన వీడియో, ఆడియో టేపుల్లో ఎలాంటి ఎడిటింగ్ కానీ, మార్పులుగానీ జరగలేదని ఎఫ్ఎస్ఎల్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో  వీడియో, ఆడియో టేపుల్లోని స్వరాన్ని పూర్తిస్థాయిలో నిర్ధారించేందుకు చంద్రబాబుతో పాటు నిందితుల స్వర నమూనాలను ఇప్పించాలని కోరుతూ  ఏసీబీ ప్రత్యేక కోర్టులో నిన్న ఎఫ్‌ఎస్‌ఎల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

దాంతో చంద్రబాబు నాయుడుకు ఏ క్షణంలో అయినా స్వర నమూనాలు ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టు ఆదేశించే అవకాశ ఉంది. చంద్రబాబు స్వర నమూనాలు తీసుకుని ఒకట్రెండు రోజుల్లో దీనిపై ఎఫ్ఎస్ఎల్ అధికారికంగా నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసులో మరో రెండు రోజుల్లో కీలక పరిణామాలు ఉంటాయని అంచనా.

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ. 5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబే సూత్రధారి అని ఏసీబీ దర్యాప్తులో నిర్ధారించింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమైంది కూడా. అయితే తదుపరి పరిణామాల్లో ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉండకూడదని భావించిన ఏసీబీ అధికారులు.. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో, ఆడియో టేపులను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవ్వనున్న నివేదిక కోసం వేచి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement