సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల కేడర్ కేటాయింపులపై యథాతథస్థితి కొనసాగించాలంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఇప్పటికే జారీచేసిన ఉత్తర్వులను జూన్ 3 వరకు పొడిగించింది. ఈ మేరకు వెంకటేశ్వర్‌రావు, రంజనా చౌదరిల నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. కేడర్ కేటాయింపులను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ధర్మాసనం మరోసారి విచారించింది. ఇందులో తమను తెలంగాణలోనే కొనసాగించాలని ఐఏఎస్ అధికారులు వాణీప్రసాద్, కరుణ వాకాటి, ఐపీఎస్ శివప్రసాద్‌లు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం జూన్ 3 వరకు వీరిని తెలంగాణలోనే కొనసాగించాలని ఆదేశించింది.
అలాగే తనను ఏపీలోనే కొనసాగించాలని ఐఎఫ్‌ఎస్ అధికారి పీఎస్ రాఘవయ్య కోరుతుండగా...ట్రైనీ ఐఏఎస్‌లు శ్రీజన, శివశంకర్‌లు సహా ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం వీరికి జూన్ 3 వరకు ఎక్కడి వారిని అక్కడే కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 3కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా క్యాడర్ కేటాయింపులపై అభ్యంతరాలుంటే ప్రత్యూష్‌సిన్హా కమిటీకి నివేదించాలని ఈ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్లకు సూచించగా... కమిటీకి నివేదించినా స్పందనలేదని, కమిటీపై నమ్మకం లేకే క్యాట్‌ను ఆశ్రయించామని నివేదించారు.