
సీబీఐ దర్యాప్తు అవసరం లేదు
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై ప్రస్తుతదశలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు పునరుద్ఘాటించింది.
* ఎర్రచందనం ఎన్‌కౌంటర్లపై హైకోర్టు ధర్మాసనం
* సాక్షుల వాంగ్మూలాలు తమిళనాడులో నమోదు చేసేందుకు తిరస్కృతి
* తదుపరి విచారణ ఆగస్టు 3కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై ప్రస్తుతదశలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు పునరుద్ఘాటించింది. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే మృతులకు రీపోస్టుమార్టం నిర్వహించాలంటూ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం, బాధిత కుటుంబ సభ్యులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం వాటిని మరోసారి విచారించింది. బాధితుల తరఫున న్యాయవాదుల్లో ఒకరైన వి. రఘునాథ్, సుప్రీంకోర్టు న్యాయవాది వృందా గోవర్‌లు పలు అంశాలను ప్రస్తావించారు.
వాటిని విన్న ధర్మాసనం సిట్ దర్యాప్తు కొనసాగుతున్నందువల్ల మరికొంత కాలం వేచి చూడాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సమయంలో వృందా గ్రోవర్ వాదనలు వినిపిస్తూ... తమిళనాడులోని ఏ మేజిస్ట్రేట్ ముందైనా ముగ్గురు కూలీల తమ వాంగ్మూలాలను ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. అంతేకాక ఎన్‌కౌంటర్ మరణాలను కస్టోడియల్ మరణాలు భావించి సీఆర్‌పీసీ సెక్షన్ 176 (1ఎ) కింద విచారణకు ఆదేశించాలని కోరగా ధర్మాసనం తోసిపుచ్చింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేందుకు ఇది సరైన సమయం కాదంటూ తదుపరి విచారణను ఆగస్టు 3కి వాయిదా వేసింది.