రూరల్ తహసీల్దార్ కార్యాలయం లోపలికి వెళ్తున్న ప్రజలు
సాక్షి, కరీంనగర్ : అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాలకు పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టారు. కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో ఉన్న కరీంనగర్‌రూరల్, అర్బన్ తహసీల్దార్ కార్యాలయాలకు సోమవారం వివిధ సమస్యలపై బాధితులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆయా కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తహసీల్దార్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన మానిటర్‌లో తహసీల్దార్లు కార్యాలయాల్లోకి వచ్చే వారిని, లోపల ఉద్యోగుల పనితీరును పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా కార్యాలయాల లోపలికి వెళ్లేముందు దరఖాస్తుదారులను అటెండర్లు పూర్తి వివరాలు అడిగి లోపలికి పంపిస్తున్నారు. వీఆర్‌వోల అనుమతి లేకుండా నేరుగా తహసీల్దార్లను కలువకుండా రక్షణ చర్యలు తీసుకున్నారు.
ఒకవైపు ప్రజావాణిలో భూసమస్యలపై జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌కు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ కొందరు బాధితులు మళ్లీ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులను కలిసేందుకు వచ్చారు. అయితే ముందుగా సంబంధిత గ్రామాల వీఆర్‌వోలు బాధితుల దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం సమస్య పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇచ్చారు. మరికొందరు బా«ధితులను వీఆర్‌వోలు స్వయంగా తహసీల్దార్ సుధాకర్ వద్దకు తీసుకెళ్లి సమస్యను వివరించారు. దరఖాస్తు ఎవరి వద్ద ఉంది, సమస్య ఏమిటో తెలుసుకుని పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను తహసీల్దార్ సుధాకర్ వీఆర్‌వోకు సూచించారు. అదేవిధంగా అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ముందుగా అటెండర్ దరఖాస్తుదారుల సమస్యలను అడిగి తెలుసుకుని లోపలికి పంపిస్తున్నారు. సంబంధిత అధికారి దరఖాస్తుదారుల సమస్యను పరిశీలించి అవసరమైతే తహసీల్దార్ దగ్గరకు స్వయంగా తీసుకెళ్తున్నారు.
అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీకెమెరా
Comments
Please login to add a commentAdd a comment