కరోనా.. నీ కథేంటి? | CCMB Focused On Coronavirus Vaccine | Sakshi
Sakshi News home page

కరోనా.. నీ కథేంటి?

Published Sun, May 24 2020 4:19 AM | Last Updated on Sun, May 24 2020 8:37 AM

CCMB Focused On Coronavirus Vaccine - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. మన రాష్ట్రంలో వైరస్‌ తీవ్రత ఏ స్థాయిలో ఉంది? దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి? వంటి అంశాలపై ప్రతిష్టాత్మక సీసీఎంబీ పరిశోధనలు చేస్తోంది. గాంధీ ఆసుపత్రిలోని పాజిటివ్‌ రోగుల శాంపిళ్ల నుంచి కరోనా వైరస్‌ జీనోమ్‌ (జన్యు క్రమం)లను రూపొందించారు. వాటి ఆధారంగా జన్యు నమూనాలను తయారు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఓ కీలకాధికారి తెలిపారు. ‘వైరస్‌ పరిణామాన్ని, ఇది ఎంత వేగంగా విస్తరిస్తుందో తెలుసుకోవడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది. దాని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా అంచనా వేయడానికి సాయపడుతుంది’అని సీసీఎంబీ వర్గాలు చెబుతున్నాయి. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ అధ్యయనం కోసం చాలా నమూనాలు అవసరం. అందుకే గాంధీ ఆస్పత్రితో పాటు కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని పాజిటివ్‌ రోగుల వైరస్‌ జీనోమ్‌లను కూడా సేకరించినట్లు తెలిసింది. ఇలా చేయడం వల్ల వైరస్‌ వంశ వృక్షాన్ని గుర్తించడానికి వీలవుతుందని సీసీఎంబీ చెబుతోంది. (ఇవాంకను ఆకట్టుకున్న జ్యోతి కథ)

వైరస్‌ బలహీనపడుతోందా?
ఐసీఎంఆర్‌ కూడా దేశంలోని వివిధ సంస్థలతో కలసి జీనోమ్‌ సీక్వెన్స్‌పై అధ్యయనం చేసింది. ఆ అధ్యయన నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఈ అధ్యయనంలో హైదరాబాద్‌కు చెందిన రెండు సంస్థలు కూడా పాలుపంచుకున్నాయి. భారత్‌లో వివిధ ప్రాంతాల నుంచి తీసుకున్న 25 వైరస్‌ జీనోమ్‌లపై ఐసీఎంఆర్‌ అధ్యయనం చేసింది. ఆ వివరాలను గ్లోబల్‌ ఇనిషియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఆల్‌ ఇన్‌ఫ్లుయెంజా డేటా (జీఐఎస్‌ఏఐడీ)కి అందజేసింది. వీటితో కలిపి ఇప్పుడు జీఐఎస్‌ఏఐడీ సంస్థ వద్ద మొత్తం 3,993 జీనోమ్‌ల చరిత్ర ఉంది. మన దేశంలో ఏ జీనోమ్‌ ద్వారా వైరస్‌ ఎక్కడ నుంచి వచ్చింది.. ఏ జాతితో ఎక్కువ సారూప్యత కలిగి ఉంది.. ఏ జాతి వైరస్‌ బలహీనంగా ఉంది.. ఏ జాతి వైరస్‌ బలంగా ఉందో అధ్యయనం చేసినట్లు చెబుతున్నారు. (ఫేస్మాస్క్ గురించి మనకు ఏం తెలుసు?)

దేశంలో మొదట్లో నమోదైన కేసులకు చైనాతో సంబంధముంది. ఆ తర్వాత చైనాతో అంతర్జాతీయ ప్రయాణాలు నిలిపేశారు. అనంతరం ఇతర ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి కేసులు వచ్చాయి. చివరకు ఎక్కడ మూలాలున్నాయో తెలుసుకుంది. మన జీనోమ్‌లకు చైనా, అమెరికా, కెనడా, స్పెయిన్, కువైట్‌ల జీనోమ్‌లతో సంబంధం ఉన్నట్లు గుర్తించింది. అయితే మన దేశంలో వైరస్‌ వేగంగా మార్పు చెందుతోందని ఐసీఎంఆర్‌ గుర్తించింది. వైరస్‌ మార్పు చెందడమంటే అది బలహీనం అవుతున్నట్లు చెప్పొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. వాస్తవంగా పుట్టినచోట ఒరిజినల్‌ వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతుందని, రాను రానూ దాని తీవ్రత తగ్గుతుందని చెబుతున్నారు. (అమెరికాను బ్రేక్ చేయనున్న బ్రెజిల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement