సమృద్ధిగా నిధులు.. ప్రగతి లేని పనులు | CDP Funds Not Utilising In Nizamabad | Sakshi
Sakshi News home page

సమృద్ధిగా నిధులు.. ప్రగతి లేని పనులు

Published Mon, Jul 8 2019 2:37 PM | Last Updated on Mon, Jul 8 2019 2:50 PM

CDP Funds Not Utilising In Nizamabad - Sakshi

సాక్షి, సిరికొండ (నిజామాబాద్‌రూరల్‌): జిల్లాలో పార్లమెంటు, జిల్లా, మండల ప్రాదేశిక నియోజకవర్గ, శాసనసభ, పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ప్రచారంలో మునిగితేలిన నాయకులు ఇక అభివృద్ధిపై దృష్టిపెడితే సమస్యల దుర్గాలైన నియోజకవర్గాలకు మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. గతఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి నిధులు సమృద్ధిగా ఉన్న శాసనసభ్యుల చొరవలేక అధికారుల నిర్లక్ష్య ఫలితంగా ఇనుప పెట్టెలలో మూలుగుతున్నాయి. చేస్తున్న పనులు సంవత్సరాల తరబడి ఇంకా కొనసాగుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి నిధులపై (సీడీపీ) సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలతో ప్రత్యేక కథనం.

నిధులున్నా ఖర్చు చేయని వైనం
నిజామాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఐదేళ్లలో జిల్లాకు రూ.56.25 కోట్లు మంజూరయ్యాయి. 1627 పనులు మంజూరు కాగా ఇప్పటి వరకు 731 పనులు మాత్రమే పూర్తయ్యాయి. వీటికి రూ. 22.40 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా 896 పనులు పూర్తి కాలేదు. కొన్ని పనులు సంవత్సరాల తరబడి కొనసాగుతుండగా ఇంకా కొన్ని పనులు ప్రారంభం కాలేదు. 2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించిన సింహభాగం పనులు ఇంకా క్షేత్ర స్థాయి ప్రారంభం కూడా కాలేదు. కొన్ని పనులు ప్రారంభించిన మధ్యలోనే ఆగిపోయాయి. శాసనసభ ఎన్నికల కారణంగా పనులు ఆగిపోగా పంచాయతీ ఎన్నికల కోడ్‌ కారణంగా ఇంత వరకు పనులు ప్రారంభం కాలేదు.

ఎన్నికలకు ముందు భారీగా ప్రతిపాదిత పనులు 
శాసనసభ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి శాసనసభ్యులు భారీగా ప్రతిపాదిత పనులకు ఆర్థిక అనుమతులు ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్యేకు రూ. 3 కోట్ల నిధులను ప్రభుత్వం 2016–17 నుంచి కేటాయిస్తున్నది. ఎన్నికలకు ముందుగానే పల్లెల్లో సమస్యల పరిష్కారానికి, సామాజిక భవనాలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను కేటాయిం చారు. మురుగు కాలువలు, సీసీ రోడ్లు, మంచి నీటి కల్పన, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, దోబీ ఘాట్లు, గ్రంథాలయాలు, వివిధ కులాలకు సామాజిక భవనాల నిర్మాణం కోసం భారీగా నిధులు కేటాయించారు. ఎన్నికల కోడ్‌ కారణంగా పనులు నిలిచిపోయాయి. చాలా పల్లెల్లో సామాజిక భవనాల నిర్మాణ పనులు మాత్రం పూర్తయ్యాయి.  అలాగే 2014–15లో ప్రతిపాదించిన 36 పనులు నేటీకీ పూర్తి కాలేదు. మిగతా నాలుగేళ్లలో కూడా ప్రతిపాదించిన చాలా పనులు ఇంకా పూర్తి కాలేదు.

2014–15 నుంచి 2018–19 వరకు విడుదలైన సీడీపీ నిధుల ప్రగతి వివరాలు

నియోజకవర్గం విడుదలైన నిధులు(కోట్లలో) మంజూరైన పనులు పూర్తయినవి ఖర్చు చేసిన నిధులు పెండింగ్‌ పనులు
ఆర్మూర్‌ 11.25 307 78 29099465   229
బాల్కొండ 11.25 370 143 33896685 227
బోధన్‌ 11.25 274  216 70250825 133
ని.రూరల్‌  11.25 421 212   55277624 96
ని.అర్బన్‌   11.25  255 82 35529696  173
మొత్తం 56.25 1627 731 22,40,54,295 858

                       
ప్రారంభం కాని పనులు
జిల్లాలో పార్లమెంటు, శాసనసభ, జిల్లా మండల ప్రాదేశిక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయినది. పల్లెల్లో నూతన సర్పంచ్‌లు కొలువుదీరారు. ఎన్నికల కోడ్‌ ముగిసింది. 2017–18, 2018–19 సంవత్సరాలకు క్షేత్రస్థాయిలో 1050 పనుల వరకు మంజూరు చేశారు. దాదాపుగా 900 వరకు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. అధికారులు సీడీపీ నిధుల వినియోగంను పర్యవేక్షణ చేస్తు ఖర్చు చేస్తే పల్లెలకు మౌలికవసతులు సమకూరుతాయి. నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాల మౌలిక సౌకర్యాల కల్పన కోసం ఎమ్మెల్యేలు సీడీపీ నిధులు మంజూరు చేస్తున్నప్పటికి పనులను దక్కించుకున్న గుత్తేదారులు పనులను నత్తనడకన కొనసాగిస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

సీడీపీ నిధుల ఖర్చులో గోప్యత
ఒక నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎంత సీడీపీ నిధులు మంజూరయ్యాయి. ఎక్కడెక్కడ పనులు ప్రారంభించారు. మొదలైన పనుల ప్రగతి వివరాలు తెలుసుకోవడానికి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఒక వెబ్‌సైట్‌ లేదు. సామాన్య ప్రజలు తెలుసుకోవాలన్నా వివరాలు ఎక్కడ లభించవు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధిక మొత్తంలో ఖర్చు చేసే సీడీపీ నిధులపై పారదర్శకత లోపించడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement