సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి ఇప్పుడు దేశవ్యాప్తంగా అనుసరిస్తోన్న లాక్‌డౌన్‌ను కొన సాగించాలా? ఎత్తివేయాలా? మరేదైనా ప్రత్యామ్నాయం ఉందా? అనే దానిపై కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రధాని కార్యాలయ వర్గాల ఆదేశాలతో రాష్ట్రంలోని పలువురు సీనియర్ ఐఏఎస్‌లకు, కలెక్టర్లకు ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చాయి. దాదాపు అందరూ లాక్‌డౌన్‌ను ఇంకొన్నాళ్లు కొనసాగించాలని చెప్పినట్లు తెలిసింది. అలాగైతేనే కరోనా వైరస్‌ను పూర్తిగా నిరోధించగలమని రాష్ట్రానికి చెందిన అధికారులు వెల్లడించినట్లు తెలిసింది. ‘కరోనా కేసుల సంఖ్య ఇంకా ఆగలేదు. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడంలేదు. కేసుల సంఖ్య తగ్గకుండా, లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది’అని ఢిల్లీ వర్గాలకు చెప్పినట్లు ఒక అధికారి వ్యాఖ్యానించారు.
‘మర్కజ్’తో పెరిగిన కేసులు
కరోనా పూర్తిస్థాయి నియంత్రణకు మున్ముందు ఎలాంటి వైఖరి అనుసరించాలన్న దానిపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. ఈనెల 14తో లాక్‌డౌన్ దేశవ్యాప్తంగా పూర్తికానుంది. కానీ ఇప్పటికీ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరణాలూ ఆగడంలేదు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఎత్తివేయాలా?, లేకుంటే కేసులు ఎక్కువగా నమోదైన చోట్ల హాట్‌స్పాట్లను ఏర్పాటుచేసి, అక్కడ లాక్‌డౌన్‌ను కొనసాగించి, మిగిలిన ప్రాంతాల్లో దశలవారీగా ఎత్తివేస్తే ఎలా ఉంటుంది? అనే దానిపై ఢిల్లీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రానికి చెందిన అధికారులు తెలంగాణలో ఉన్న పరిస్థితిని కేంద్రానికి విన్నవించారు. ‘మర్కజ్ ఘటన అనంతరం రాష్ట్రంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
అదే లేకుంటే ఇప్పుడు రాష్ట్రంలో సాధారణ పరిస్థితులే ఉండేవి. కానీ మర్కజ్ నుంచి వచ్చినవారు, వారి కుటుంబీకుల ద్వారా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మొదట్లో ఐదారు జిల్లాలకే పరిమితమైన కరోనా ఇప్పుడు 25 జిల్లాలకు వ్యాపించింది. పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్న సమయంలో లాక్‌డౌన్ ఎత్తివేస్తే వైరస్‌ను కట్టడి చేయలేం’అని చెప్పినట్టు మరో అధికారి వెల్లడించారు. ‘లాక్‌డౌన్ ఎత్తివేయకపోతే వ్యాపారాలు, సాధారణ ప్రజలకు ఉపాధి, రోగులు ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి ఉండదు కదా? ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాల’ని ఢిల్లీ వర్గాలు ప్రశ్నించాయని సమాచారం.‘ఇప్పటివరకు ఎలాగో ప్రజల సాయంతో లాక్‌డౌన్ విజయవంతం చేశాం. మరికొన్నాళ్లు ఓపికపడితే గండం నుంచి బయటపడతామ’ని బదులిచ్చినట్టు ఓ అధికారి తెలిపారు.
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది. మర్కజ్ ద్వారా జిల్లాల్లో రోజురోజుకూ కేసులు బయటపడుతున్నాయి. గద్వాల, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఇది మున్ముందు ఎటువంటి పరిస్థితికి దారితీస్తుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘ప్రస్తుతం మర్కజ్ నుంచి వచ్చినవారు, వారి కుటుంబీకులకే వైరస్ పరిమితమైంది. మున్ముందు ఇది మూడో కాంటాక్ట్‌కు ఏమైనా చేరిందా అనేది తెలుస్తుంది. లాక్‌డౌన్‌ను మరికొన్నాళ్లు కొనసాగించాక కేసులేమైనా ఉంటే బయటపడతాయి. అప్పటివరకు ఉత్కంఠ తప్పద’ని అధికారులు అంటున్నారు. ‘నేరుగా మర్కజ్ నుంచి వచ్చినవారు, వారి బంధువులు, స్నేహితులు.. ఇలా అన్ని కాంటాక్ట్‌లకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశాక, తదుపరి కేసుల సంఖ్య తగ్గొచ్చు. ఇంటింటి సర్వే ద్వారా ఇది తెలుస్తుంది. దాన్నిబట్టి నిర్ణయాలు ఉంటాయి’అని ఒక అధికారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment