కందుల సేకరణలో కేంద్రం వివక్ష | Central govt discrimination in the collection of red gram | Sakshi
Sakshi News home page

కందుల సేకరణలో కేంద్రం వివక్ష

Published Sun, Mar 4 2018 3:30 AM | Last Updated on Mon, Oct 1 2018 2:19 PM

Central govt discrimination in the collection of red gram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతాంగానికి మద్దతుధర కల్పించడంతో, కందుల సేకరణలో కేంద్రం తీరుపై మార్కెటింగ్‌ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. కందుల కొనుగోళ్లపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసినా ఇంతవరకూ స్పందన లేదని, కేంద్రం వివక్ష చూపుతోందని అన్నారు. కందుల కొనుగోళ్లపై శనివారం సెక్రెటేరియట్‌లో సమీక్షించారు. ఇప్పటివరకు రూ.1,315 కోట్ల విలువ చేసే 24.13 లక్షల క్వింటాళ్ల కందులను తెలంగాణ ప్రభుత్వం సేకరించినట్టు తెలిపారు. దాదాపు మరో 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల కందులు మార్కెట్‌కు వస్తున్నట్టు చెప్పారు. ఈసారి 2.51 లక్షల హెక్టార్లలో రైతులు కందిపంట వేశారని, కేవలం 75 వేల మెట్రిక్‌ టన్నుల సేకరణకే కేంద్రం అంగీకరించడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.

కంది రైతుల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం రూ.600 కోట్ల బ్యాంక్‌ గ్యారంటీ ఇచ్చిందన్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలని మార్క్‌ఫెడ్, హాకా సంస్థలను మంత్రి కోరారు. గోడౌన్లు లేని 164 మండలాల్లో 5 ఎకరాల చొప్పున స్థలాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆయా ప్రదేశాల్లో గోడౌన్ల వసతి డిమాండ్‌ను సరిగ్గా అంచనా వేయాలని కోరారు. దీనిపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు. గోడౌన్లు మంజూరైనా భూసేకరణ పూర్తికాని ప్రాంతాల్లో , ప్రత్యామ్నాయస్థలాన్ని ఎంపిక చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులతో చర్చించాలని మార్కెటింగ్‌ అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు. ప్రైవేట్‌ గోడౌన్లలో 4 లక్షల మెట్రిక్‌ టన్నుల సరుకులుండడంపట్ల మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలోని గోడౌన్లకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఖరీఫ్‌లో ఎరువులు, విత్తనాలను రైతులు నిల్వ చేసుకోవడానికి వీలుగా గోడౌన్ల నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. 9 కోల్డ్‌ స్టోరేజ్‌ల ఏర్పాటుకు కేసీఆర్‌ ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్రంలో వాటి ఏర్పాటుకు డిమాండ్‌ ఎక్కడున్నదో పరిశీలించాలని కోరారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై కేబినెట్‌ సబ్‌కమిటీ ఈ నెల 6న సమావేశం అవుతున్నందున నాబార్డు, మార్కెటింగ్, హార్టికల్చర్‌ సంస్థలు అధ్యయనం చేయాలని కోరారు. సమావేశంలో మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, జాయింట్‌ డైరెక్టర్లు లక్ష్మణుడు, మార్కెటింగ్‌ ఎస్‌ఈ ఉమామహేశ్వరరావు, జె.డి.రవికుమార్, వరంగల్‌ ఇన్‌చార్జ్‌ జె.డి.శ్రీనివాస్, మార్క్‌ఫెడ్, హాకా, నాబార్డు, వేర్‌ హౌసింగ్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement