సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న కరోనా కట్టడి చర్యలను పర్యవేక్షించడంలో భాగంగా కేంద్రం బృందం సోమవారం హైదరాబాద్‌లో పర్యటించింది. నగరంలోని కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రులు టిమ్స్, గాంధీ ఆస్పత్రులను కేంద్ర బృందం సందర్శించింది. అదేవిధంగా దోమల్‌గూడలోని కంటైన్‌మెంట్ ప్రాంతాన్ని పరిశీలించింది. చెస్ట్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ మృతికి సంబంధించిన వివరాలను ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అడిగి తెలుసుకున్నారు. (లాక్‌డౌన్‌పై చర్చించనున్న తెలంగాణ కేబినెట్)
అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య శాఖ ఉన్నతాధికారులతో సుమారు ఐదు గంటల పాటు కేంద్ర బృందం చర్చించింది. తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్నచర్యలను అధికారులు కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో సర్వైలెన్స్, కంటైన్‌మెంట్ చర్యలు, ఆసుపత్రుల సన్నద్దత, వైద్య సంరక్షణ పరికరాల సమీకరణ, వైరెస్ నివారణ చర్యలపై అధికారులు కేంద్ర బృందానికి వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో 17081 బెడ్లు ఉన్నాయని మరింత మెరుగైన చికిత్స కోసం 4489 అదనపు సిబ్బందిని రిక్రూట్ చేశామని తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది. వైద్య మౌలిక సదుపాయలు మెరుగుపరచడం కోసం రూ.475.74 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు. కేంద్ర బృందం రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.
రాష్ట్రంలో కరోనా నియత్రణ చర్యలు, వైద్య పరీక్షల సామర్ధ్యం పెంచడం, కాంటాక్ట్ ట్రేసింగ్, క్లినికల్ మేనేజ్‌మెంట్‌పై కేంద్ర బృందం పలు సూచనలు చేసిందని చెప్పారు. కేసులు పెరుగుతున్ననేపథ్యంలో వచ్చే రెండు నెలలో చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సీఎస్ అధికారులను అదేశించారు. అనంతరం కేంద్రం బృందం ఢిల్లీ బయలుదేరింది. మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై కేంద్ర బృందం నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment