డొల్ల కంపెనీల డొంక..! | Centre Acts on Shell companies in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో 41 వేల మంది ‘డైరెక్టర్ల’పై వేటు..

Published Wed, Sep 20 2017 1:29 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

డొల్ల కంపెనీల డొంక..! - Sakshi

డొల్ల కంపెనీల డొంక..!

- షెల్‌ కంపెనీలపై కొరడా ఝళిపించిన కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ
- ఐదేళ్ల పాటు అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు
- ఏ కంపెనీలోనూ డైరెక్టర్‌ పదవి చేపట్టకుండా నిషేధం
- ఆర్థిక, ఆదాయ నివేదికలు సమర్పించకపోవడమే కారణం
- జాబితాలో కేంద్ర మంత్రి సుజనా విద్యుత్‌ సంస్థ డైరెక్టర్లు
- డెక్కన్‌ క్రానికల్, అగ్రిగోల్డ్, డాక్టర్‌ రెడ్డీస్‌..
- నార్నే శ్రీనివాసరావు, సంఘీ, ప్రొగ్రెసివ్‌ కన్‌స్ట్రక్షన్‌ సహా..
- అనేక చిట్‌ఫండ్‌ సంస్థల్లోని వారిపైనా చర్యలు
- నగరం కేంద్రంగా తెలంగాణ, ఏపీల్లో వాటి కార్యకలాపాలు


సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ డొల్ల కంపెనీలకు అడ్డాగా మారింది. ఎడాపెడా షెల్‌ కంపెనీలు సృష్టించడం, ఏటా ఇంత టర్నోవర్‌ వచ్చిందంటూ ‘బ్లాక్‌’దందాలు సాగించడం వంటి అక్రమాలకు కేంద్రంగా మారింది. కాగితాలపైనే కంపెనీలు నిర్వహించడం పరిపాటిగా మారింది. దేశవ్యాప్తంగా అలాంటి డొల్ల కంపెనీలు, వాటిల్లోని డైరెక్టర్లపై కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కొరడా ఝళిపించగా... ఆ జాబితాలో హైదరాబాద్‌ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.

ముంబై, ఢిల్లీ తరువాత భారీ సంఖ్యలో షెల్‌ కంపెనీలు హైదరాబాద్‌ కేంద్రంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే ఉన్నట్లు తేల్చిన ఆ శాఖ.. వాటికి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న 41,068 మందిపై అనర్హత వేటు వేసింది. ఐదేళ్లపాటు ఏ కంపెనీలోనూ డైరెక్టర్‌గా పనిచేయకుండా నిషేధం విధించింది. మరే ఇతర సంస్థతోనూ వారు భాగస్వామ్యం కుదుర్చుకోకుండా వారి పేర్లను బహిర్గతం చేసింది.  

వేల కొద్దీ కంపెనీలు..
పెద్ద నోట్ల రద్దు పరిణామాల నేపథ్యంలో కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఉన్న షెల్‌ కంపెనీలపై కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ దృష్టి పెట్టింది. వాటిల్లో భారీ స్థాయిలో నల్లధనం చలామణీ అయినట్లు గుర్తించింది. ఏదో ఒక పేరుతో కంపెనీలు పెట్టడం, ఏళ్ల పాటు ఆదాయ రిటర్నులు దాఖలు చేయకపోవడం, ఆర్థిక అవకతవకలకు పాల్పడడం వంటి అంశాలకు అవి కేంద్రంగా మారినట్లు నిర్ధారించింది.

ముఖ్యంగా షెల్‌ కంపెనీలకు హైదరాబాద్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ రీజియన్‌ అడ్డాగా మారినట్లు తేల్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ కేంద్రంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉన్న అలాంటి వేల సంఖ్యలో కంపెనీలు, వాటిల్లోని 41,068 మంది డైరెక్టర్లపై వేటు వేసింది. ఐదేళ్ల పాటు కంపెనీలు పెట్టకుండా, కంపెనీల్లో డైరెక్టర్లుగా చేరకుండా నిషేధం విధించింది.

రెండు ప్రధాన కారణాలు..
‘డైరెక్టర్‌ డిస్‌క్వాలిఫై సెక్షన్‌ 164(2)(ఏ)’కింద కంపెనీలు, డైరెక్టర్లపై వేటు వేయాలని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ నిర్ణయించింది. దీనికి రెండు ప్రధాన కారణాలను చూపింది. మూడు ఆర్థిక సంవత్సరాల (2013–14, 2014–15, 2015–16)కు సంబంధించిన ఆర్థిక నివేదికలు, వార్షిక రిటర్నులు సమర్పించకపోవడం ఒక కారణంకాగా.. డిపాజిట్లను తిరిగి చెల్లించడంలో ఏడాది పాటు నిర్లక్ష్యం చేయడం, ఏళ్లకేళ్లు ఎగ్గొట్టడం రెండో కారణం. కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఉత్తర్వుల ప్రకారం.. వేటుపడిన వ్యక్తులెవరూ 2016 నవంబర్‌ నుంచి 2021 అక్టోబర్‌ చివరి వరకు కూడా ఏ కంపెనీలోనూ డైరెక్టర్‌గా చేరడానికి అవకాశం లేదు. అలాకాదని డైరెక్టర్‌గా చేరినా, చేర్చుకున్నా.. ఆ వ్యక్తితో పాటు సంబంధిత కంపెనీలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడానికి అవకాశం ఉంది.

‘సుజనా’పవర్, ప్రొగెసివ్‌ కన్‌స్ట్రక్షన్‌..
కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ప్రకటించిన అనర్హుల జాబితాలో.. కేంద్ర సహాయ మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరికి చెందిన సుజనా పవర్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థకు చెందిన ముగ్గురు డైరెక్టర్లు శంకర్‌ కుందులా, హనుమంతరావు, శ్రీనివాస గొట్టుముక్కల ఉన్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థకు చెందిన అంజిరెడ్డి, డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్, డెక్కన్‌ మార్కెటింగ్, డెక్కన్‌ పవర్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న తిక్కవరపు మంజూల, వెంకట్‌లతో పాటు మరో డైరెక్టర్‌ కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు.

ఇక ప్రొగ్రెసివ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ డైరెక్టర్‌ నాగేశ్వర్‌రావు, మెగా సిమెంట్స్‌ అండ్‌ కెమికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు, విజయవాడ షేర్‌ బ్రోకర్స్‌ లిమిటెడ్‌ 12 మంది, ఎస్‌కే బిగ్‌స్టార్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌కు చెందిన 12 మంది, వంశీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు చెందిన ఆరుగురు, కీర్తి అనురాగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు చెందిన 9 మంది, కోరమాండల్‌ పెస్టిసైడ్స్‌ సంస్థ డైరెక్టర్లు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు.

జాబితాలో మరెంతో మంది
రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మందిని బాధితులను చేసిన అగ్రిగోల్డ్‌ ఫుడ్స్‌ అండ్‌ ఫామ్స్‌ డైరెక్టర్లు అవ్వా శివరాం, అవ్వా శర్మ, వెంకట్‌ కృష్ణలను కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ అనర్హుల జాబితాలో చేర్చింది. అదే విధంగా రాజమండ్రి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు చెందిన 8 మంది డైరెక్టర్లు, హైదరాబాద్‌ కెమికల్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్‌ లిమిటెడ్‌కు చెందిన నలుగురు, ఇక నార్నే హోమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మార్వెల్‌ మైనింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థల డైరెక్టర్లు నార్నే రావు, నార్నే శ్రీనివాసరావు, నార్నే మల్లీశ్వరి, గద్దె శ్రీవెంకట్, నార్నే సుబ్బాయమ్మ, గద్దె విజయశ్రీల పేర్లూ ఉన్నాయి.

ఇక ఏపీ స్టేట్‌ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌తో పాటు అందులో డైరెక్టర్లుగా ఉన్న ఐదుగురిని, ఎప్పటి నుంచో వివాదాల్లో ఉన్న సంఘీ ఇండస్ట్రీస్, ఆ కంపెనీల్లోని డైరెక్టర్లపైనా వేటు వేసింది. అంతేగాకుండా 4 వేల రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, 6 వేలకు పైగా ఉన్న చిట్స్‌ఫండ్స్, వాటి డైరెక్టర్లను, పలు ఐటీ, సెక్యూరిటీ, ఇన్‌ఫ్రా సంస్థలను సైతం అనర్హత జాబితాలో చేర్చింది.

దేశంలోనే మూడో స్థానం!
దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కంపెనీలు, డైరెక్టర్లపై కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ అనర్హత వేటు వేసింది. అత్యధికంగా దేశరాజధాని ఢిల్లీ పరిధిలో 74,920 మంది డైరెక్టర్లను నిషేధించగా.. 66,851 మందితో ముంబై రెండో స్థానంలో, 41,068 మందితో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచాయి. తర్వాత ఎర్నాకులంలో 14 వేల మంది, కటక్‌లో 11,383 మంది డైరెక్టర్లపై వేటు పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement