ఓటుకు పోదాం చలో చలో
- 7న సీమాంధ్రలో పోలింగ్
- రైళ్లు, బస్సులు కిటకిట
- వందల్లో వెయిటింగ్ లిస్ట్
సాక్షి, సిటీబ్యూరో: నగరం ఓటుకోసం సొంత ఊరు బాటపట్టింది. ఈనెల 7న సీమాంధ్రలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ అనూహ్యంగా పెరిగింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రతి రోజు నడిచే వెయ్యి బస్సులకు అదనంగా 200 బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేపట్టింది.
ఈ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తుండగా, ప్రైవేట్ ఆపరేటర్లు సైతం రెట్టింపు చార్జీలు విధిస్తున్నారు. దీంతో సొంత ఊళ్లో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు, తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు ఉత్సాహంగా బయలుదేరుతున్న నగర వాసులకు ప్రయాణం భారంగా పరిణమించింది. ఒకవైపు వేసవి సెలవులు, మరోవైపు సార్వత్రిక ఎన్నికలు కలిసి రావడంతో సీమాంధ్రకు వెళ్తున్న ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది.
సాధారణ రోజుల్లోనే అన్ని రైళ్లు, బస్సులు కిక్కిరిసి బయలుదేరుతుండగా, ఈనెల 5,6 తేదీల్లో లక్షలాది మంది తరలి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. జంట నగరాల నుంచి విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్టణం, కాకినాడ, మచిలీపట్నం, చిత్తూరు, నెల్లూరు, కడప, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇప్పటి నుంచే ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో రిజర్వేషన్ చేసుకున్నారు. అన్ని దూరప్రాంత ైరె ళ్లలో వెయిటింగ్‌లిస్ట్ బాగా పెరగడంతో మిగిలినవారు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, గుంటూరు రూట్లలో రెగ్యులర్ బస్సులతో పాటు, 6న బయలుదేరేందుకు ఇప్పటికే 80 ప్రత్యేక బస్సులు బుక్కయ్యాయి. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
వందల్లో వెయిటింగ్ లిస్టు
బస్సుల్లో డిమాండ్ ఇలా ఉండగా, నగరం నుంచి బయలుదేరే అన్ని ప్రధాన రైళ్లలోనూ వెయిటింగ్‌లిస్ట్ బాగా పెరిగిపోయింది. విశాఖ, కాకినాడ, గోదావరి, చెన్నై, తిరుపతి, చిత్తూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ఫలక్‌నుమా, గౌతమి, నర్సాపూర్, చార్మినార్, వెంకటాద్రి, నారాయణాద్రి, పద్మావతి సహా అన్ని రైళ్లల్లో వెయిటింగ్‌లిస్ట్ చాంతాడంత పెరిగింది. ఈనెల 5,6 తేదీల్లో పలు రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఇలా ఉంది..
విడిపోయాక తొలి ఎన్నికలు..
రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆ ప్రభుత్వంపైనే ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కరం ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. అందుకే నేను వెళ్తున్నాను. ఇంకా ఆగితే ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.
- చిన్న, వైజాగ్
రద్దీ బాగా ఉంది
ఎప్పటి నుంచో ప్రయత్నిస్తే ఈ రోజు రిజర్వేషన్ దొరికింది. ఎట్టి పరిస్థితుల్లోను ఓటు హక్కును వినియోగించుకోవాలనే పట్టుదలతో వెళ్తున్నాను. రెండు రాష్ట్రాల్లోనూ మంచి ప్రభుత్వాలు రావాలంటే ప్రజా ప్రతినిధుల ఎన్నికే ముఖ్యం.
- దినేష్, తిరుపతి