
సాక్షి, హైదరాబాద్: ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్న విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీలో తన పార్టీ ఘోరంగా ఓడిపోతుందని జాతీయ మీడియా సర్వేలన్నీ తేల్చి చెబుతున్న సందర్భంలో దాన్ని కప్పిబుచ్చుకునేందుకు ఢిల్లీ వేదికగా ఆయన తెగ బిల్డప్ ఇస్తున్నారని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసిన తర్వాత మోదీకి వ్యతిరేకంగా జట్టుకట్టేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. ఇతర పార్టీ నేతల మాట ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం ఎగ్జిట్ ఫలితాల తర్వాత నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని, ఈ విషయాన్ని ఆయనకు సన్నిహితంగా ఉండే కొందరు నేతలే చెబుతున్నారని తెలిపారు. బాబు డ్రామాలన్నింటికీ ఈనెల 23న తెరపడుతుందని, మోదీ నేతృత్వంలో బీజేపీ మరోమారు కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment