చంద్రబాబు నాయుడు గురువారం మహబూబ్‌నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సభ రణరంగాన్ని తలపించింది...
మహబూబ్‌నగర్ క్రైం: చంద్రబాబు నాయుడు గురువారం మహబూబ్‌నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సభ రణరంగాన్ని తలపించింది. సభలో చంద్రబాబునాయుడు ప్రసంగిస్తుండగానే ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. ఏమవుతుందో అని పోలీసులు తెలుసుకునేలోగానే గాల్లోకి కుర్చీలు లేచాయి. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ సభా వేదికపైకి కుర్చీలు విసిరారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభ ఒక్కసారిగా అట్టుడికిపోయింది. దీంతో తేరుకున్న టీడీపీ కార్యకర్తలు కూడా ఎమ్మార్పీఎస్ కార్యకర్తల పైకి కుర్చీలు విసిరారు. టీడీపీ కార్యకర్తలు లేచి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లారు.
ఒకరిపైకి ఒకరు కుర్చీలు విసురుకోవడంతో కొద్దిసేపు సభా ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. చాలా సేపటి వరకు అక్కడ ఏం జరుగుతుందో పోలీసులకు, నాయకులకు అర్థం కాలేదు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలకు, జర్నలిస్టులకు, పోలీసులకు గాయాలయ్యాయి. అదే సమయంలో మిడ్జిల్ మండలంలోని గుడిగండ్ల గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ కార్యకర్త రాజు, మరో యువకుడు సభా ప్రాంగణం కప్పుపైకి వెళ్లి ఎమ్మార్పీఎస్ జెండాలతో చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పోలీసులు నివ్వెరపోయారు. వెంటనే పోలీసులు పెకైక్కి వారిని దింపేందుకు ప్రయత్నించారు. అంతలో సభలో ఉన్న టీడీపీ కార్యకర్తలు చెప్పులు, నీళ్ల బాటిళ్లు, కుర్చీలను ఎమ్మార్పీఎస్ నాయకులపైకి విసిరారు. టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నిస్తుండంతో పోలీసులు వలయంగా ఏర్పడి లాఠీచార్జి చేసి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.
తేనెటీగల దాడికి యత్నం
చంద్రబాబు సభలో నిరసన తెలిపేందుకు వచ్చిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తేనెటీగల దాడికి యత్నించారు. ఓ ప్లాస్టిక్ కవర్‌లో తేనెతుట్టెను తీసుకొచ్చి సభాప్రాంగణంపైకి విసిరేందుకు యత్నించారు. గుర్తించిన అగ్నిమాపక సిబ్బంది దానిని వెంటనే నివారించారు.
ఎస్‌ఐని సస్పెండ్ చేయాలని నినాదాలు..
సభప్రాంగణంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి డీసీఎంలోకి తరలిస్తున్న క్రమంలో పోలీసులు వారిని కులం పేరుతో దూషించడమే కాకుండా తమ కార్యకర్తలపై విచక్షణ రహితంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి అన్నారు. కార్యకర్తలను అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఉంచడంతో అధ్యక్షుడితో పాటు మరో 50మంది కార్యకర్తలు పోలీసుస్టేషన్ ఎదుట బైటాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆంధ్రా పాలకులకు వత్తాసు పలుకుతూ పోలీసులు కార్యకర్తలపై జులుం చేయడం సమంజసం కాదని చెప్పారు. ప్రశాంతంగా తమ నిరసనను తెలియజేస్తున్న క్రమంలో పోలీసులు అత్యుత్సాహంగా తమపై దాడులకు దిగారని ఆరోపించారు. ఈ దాడులలో గాయాల పాలైన బాధితులను పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఘర్షణలో ఇద్దరు పోలీసులకు గాయాలు..
ఎమ్మార్పీఎస్ కార్యకర్తల నిరసన సందర్బంగా ఎమ్మార్పీఎస్, టీడీపీ కార్యకర్తలు ఒకరిపైకి ఒకరు రాళ్లు, చెప్పులు, కుర్చీలు విసురుకునే క్రమంలో పోలీసులకు, జర్నలిస్టులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ యాదయ్య, మరో ఎస్‌ఐ తలకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఓ పత్రిక ఫొటోగ్రాఫర్ తలకు తీవ్ర గాయమైంది. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై చంద్రబాబు విచారం వ్యక్తం చేయడంతో పాటు గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చును పార్టీ భరిస్తుందని హామీ ఇచ్చారు. గాయపడిన పత్రిక ఫొటోగ్రాఫర్‌కు లక్ష రూపాయల సాయం ప్రకటించారు.
వేదిక వద్ద షార్ట్‌సర్క్యూట్
చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలోనే వేదిక వద్ద షార్ట్‌సర్క్యూట్ జరిగి కార్పెట్‌కు మంటలు అంటుకున్నాయి. అక్కడే కూర్చున్న కళాకారుల బృందం ఒక్కసారిగా పరుగులు తీయడంతో కలకలం చెలరేగింది. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.