
చంద్రబాబు చీకటి జీవో
- రైతుల భూవిక్రయ హక్కులను కొల్లగొట్టే యత్నం
- భూముల రిజిస్ట్రేషన్‌కు ఎమ్మార్వో నివేదిక తప్పనిసరి
- దేశంలో ఎక్కడాలేని నిబంధనలతో జీవో
- వెల్లువెత్తిన ప్రజాగ్రహంతో వెనక్కు తగ్గిన సర్కారు
- జీవోనుంచి వ్యవసాయ భూములకు మినహాయింపు
- జీవో మొత్తం రద్దు చేయాలని ప్రజల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా చంద్రబాబు ప్రభుత్వం చీకటి జీవో జారీ చేసిం ది. ఈ జీవో ద్వారా రైతుల భూ విక్రయ హక్కులను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తోంది. విక్రయిం చిన భూములను హక్కుదారులు నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి.. కొన్నవారికి రిజిస్ట్రేషన్ చేయించే హక్కును ప్రభుత్వం లాగేసుకుంది. హక్కుదారుల పేరులో ఉన్న హక్కును నల్ల జీవో(398 జీవో)తో ప్రభుత్వం కాలరాసింది.
వ్యవసాయు భూముల విక్రయ రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ అధికారుల సబ్ డివిజన్ నివేదిక ను తప్పనిసరి చేస్తూ శుక్రవారం ప్రభుత్వం నల్లజీవో జారీ చేసిన విషయం విదితమే. వుండల రెవెన్యూ అధికారి నుంచి సబ్ డివిజన్ నివేదికతో కూడిన ధ్రువీకరణ పత్రం సవుర్పిస్తేనే వ్యవసాయు భూముల విక్రయ రిజిస్ట్రేషన్లు చేయూలని, లేని పక్షంలో రిజిస్ట్రేషన్ చేసేందుకు తిరస్కరించాలని జీవోలో పేర్కొన్నారు. తద్వారా ప్రభుత్వానికి లేని హక్కులను జీవో జారీ ద్వారా సొంతం చేసుకొంది. చట్టంలో లేని అధికారాలనూ కైవసం చేసుకుంది.
‘‘శుక్రవారం జారీ చేసిన నల్ల జీవో ప్రకారం భూముల రిజిస్ట్రేషన్‌కు యజమనుల పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్‌డీడ్స్ ఉంటే సరిపోదు. చట్టంలో లేని నిబంధనలను జీవో ద్వారా పెట్టడం ఎలా సాధ్యం? చట్టంలో లేని నిబంధనలు విధించాలంటే.. చట్టాన్ని సవరించడం మినహా ప్రభుత్వానికి మరో మార్గం లేదు’’ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు.
అధికారులకు ధ్రువీకరణ ఎలా సాధ్యం?
‘‘సర్వే నంబర్ల వారీగా మండల రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటే.. సమగ్ర సమాచారం ఎమ్మార్వోకు ఎలా తెలుస్తుంది? రికార్డులు పరిశీలించి, అందులో ఉన్న వివరాల మేరకు ధ్రువీకరణపత్రం ఇవ్వాలి. రికార్డు కోసం మళ్లీ ప్రభుత్వ పోర్టల్ ‘వెబ్‌ల్యాండ్’ మీద అధారపడాలి. వెబ్‌ల్యాండ్‌లో అన్ని వివరాలను పరిశీ లించిన తర్వాతే రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్ట్రేషన్ చేస్తారు. రెవెన్యూ అధికారులు కొత్తగా చేసేదేమీ ఉండదు. కేవలం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికావడంలో తీవ్ర జాప్యం చేయడానికే తప్ప.. మరే విధంగానూ ఈ జీవో ఉపయోగపడదు. దీనిపై ప్రభుత్వం ఏదో కుట్ర చేస్తోందని అర్థం’’ అని రైతు నేతలు మండిపడుతున్నారు.
వెనక్కి తగ్గిన ప్రభుత్వం
నల్ల జీవోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చంద్రబాబు ప్రభుత్వం కాస్తంత వెనక్కి తగ్గింది. ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలకు భయపడిన ప్రభుత్వం..‘భూముల రిజిస్ట్రేషన్‌కు సబ్ డివిజన్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి’ అనే నిబంధనను తాత్కాలికంగా పక్కనపెడుతున్నామంటూ రెవెన్యూ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి సబ్ డివిజన్ ధ్రువీకరణ పత్రాలను పొందుపరచాలనే ఆదేశాలను ప్రస్తుతం నిలుపుదల చేస్తున్నాం. ప్రస్తుత పద్ధతిలోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మేరకు అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చాం’’ అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
లే అవుట్ల మాటేమిటి?
చీకటి జీవో జారీపై రైతులు నుంచి వ్యక్తమయిన ఆగ్రహావేశాలకు జంకిన ప్రభుత్వం.. వ్యవసాయ భూములకే సబ్ డివిజన్ నివేదిక తీసుకురావాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. గృహ నిర్మాణాలకు వేసిన లే అవుట్లకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. లే అవుట్ వేసిన భూములు.. వ్యవసాయ భూములుగా పరిగణించరు కాబట్టి.. కొన్నవారికి రిజిస్ట్రేషన్లు చేయించాలంటే సబ్ డివిజన్ నివేదిక తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జీవో మొత్తం రద్దు చేయాలని, మినహాయింపులకు పరిమితం కావద్దని ప్రభుత్వానికి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.