ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి గ్రామంలోని పెదవాగు ప్రాజెక్టు పెద్ద కష్టం ఎదుర్కొంటోంది. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోవడంతో ఈ ప్రాజెక్టు ఆయకట్టు కూడా రెండు భాగాలైంది. పోలవరం ముంపు పేరుతో ఈ ప్రాజెక్టు పరిధిలోని కొన్ని ప్రాంతాలు సీమాంధ్రలోని పశ్చిమగోదావరి జిల్లాలో కలిపారు. జిల్లాలో మొత్తం ఏడు మండలాలు సీమాంధ్రలో కలవగా ఈ ప్రాజెక్టు పరిధిలోని మూడు మండలాలు ఆ రాష్ట్రంలో కలిశాయి. మొత్తం 16వేల ఎకరాలకు సాగునీరందిస్తున్న ఈ ప్రాజెక్టు ఆయకట్టును ఎలా వర్గీకరించాలి, నీటి పంపిణీ ఎలా చేయాలో అర్థంకాక నీటిపారుదల శాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నప్పటికీ ఆయకట్టు ఆంధ్రాలోకి పోవడంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నారు.
1981 సంవత్సరంలో ఖమ్మం ఇరిగేషన్ డివిజన్ పరిధిలో నిర్మించిన ఈ పెదవాగు ప్రాజెక్టు ద్వారా మొన్నటి వరకు జిల్లాలో అంతర్భాగంగా ఉన్న అశ్వారావుపేట, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 16వేల ఎకరాలకు సాగునీరందించేవారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అశ్వారావుపేట మినహా మిగిలిన రెండు మండలాలు సీమాంధ్ర పరిధిలోకి వెళ్లడంతో అధికారులు నీటి పంపకాలు ఎలా చేయాలో అర్థంకాక తలలుపట్టుకుంటున్నారు.
మొత్తం మూడు మండలాల్లో ఉన్న ఈ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో తెలంగాణకు చెందిన అశ్వారావుపేటలో 810 ఎకరాలు, సీమాంధ్రలోకి వెళ్లిన కుక్కునూరులో 5,030 ఎకరాలు, వేలేరుపాడులో 10,160 ఎకరాల భూమి సాగవుతోంది. ప్రాజెక్టు ఆయకట్టు మొత్తంగా చూస్తే తెలంగాణలో పరిధిలో 10,822 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌లో 5,175 ఎకరాలు ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని ఏ రాష్ట్ర ఇంజినీర్లు పర్యవేక్షణ చేయాలి?, ఎవరు అభివృద్ధి చేయాలి?, నీటి పంపకాలు ఎలా చేయాలో అర్థంకాక అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రాజెక్టుకు కుడి, ఎడమ కాల్వలున్నాయి. 19 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ రెండు కాల్వల ద్వారా సాగునీరందుతోంది. కుడి కాల్వ సున్నా నుంచి 14వ కిలోమీటర్ వరకు, ఎడమకాల్వ 15వ కిలోమీటర్ వరకు తెలంగాణ పరిధిలోకి వస్తుంది. మిగిలిన కిలోమీటర్ల కాల్వలు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్తాయి. రెండుకాల్వల చివరి ఆయకట్టు సీమాంధ్రలో ఉండటంతో రైతుల మధ్య నీటియుద్ధాలు తలెత్తే ప్రమాదముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులను జపాన్ దేశ ఆర్థిక సహాయంతో చేపట్టేందుకు నీటిపారుదలశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. సుమారు రూ.57.40 కోట్ల అంచనాలతో ఈ ప్రతిపాదనలు పంపారు. ఒకవేళ ఈ నిధులు మంజూరైతే ఆ పనులు ఏ రాష్ట్ర అధికారులు చేపట్టాలి? విభజన నేపథ్యంలో ఆధునికీకరణకు నిధులు మంజూరువుతాయా? లేదా? అనే సం దిగ్ధత నెలకొంది. పోలవరం ముంపులో ఎంతమేరకు ప్రాజెక్టు పరిధిలోని భూములు పోనున్నాయో కూడా ఇప్పటి వరకు స్పష్టత లేదు.
దీనిపై ఇరిగేషన్ ఈఈ అంకవీడు ప్రసాద్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరింది. ‘ఈ సమస్య మా పరిధిలో లేదు. రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? అనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి.’
పెదవాగు.. పెద్దకష్టం
Published Wed, Jun 4 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM
Advertisement