చార్మినార్. హైదరాబాద్ మహానగరానికి మణిహారం. చార్మినార్ నిర్మాణంతోనే భాగ్యనగరానికి పునాదులు పడ్డాయి. తొలుత కుతుబ్‌షాహీ, అనంతరం అసఫ్‌జాహీ పాలకులు నగర ప్రజల కోసం అన్ని ఏర్పాట్లూ చేస్తూ వచ్చారు. ఆ కాలంలో భారతదేశంలో బ్రిటిష్ పాలకులు వారి అధీనంలో ఉన్న ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం ఎత్తైన టవర్లు నిర్మించి వాటిలో గడియారాలను అమర్చారు. గడియారం అంటే అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో ఈ క్లాక్ టవర్లు ప్రజలు సమయాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. గంట గంటకూ గడియారం చేసే శబ్దాల ఆధారంగా ప్రజలు తమ దినచర్య ప్రారంభించి ముగించేవారు. బ్రిటిష్ పాలకుల అధీనంలో ఉన్న ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాతోపాటు పలు నగరాల్లో క్లాక్ టవర్లు నిర్మించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీ ప్రతినిధి 1865లో బ్రిటిష్ రెసిడెన్సీ ఆస్పత్రి ప్రాంగణం(ఇప్పుడు సుల్తాన్‌బజార్)లో నగరంలోనే తొలి క్లాక్‌టవర్‌ను నిర్మించారు. ఈ నేపథ్యంలోనే పాతబస్తీ ప్రజల సౌకర్యార్థం ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1889లో చార్మినార్‌కు నాలుగు వైపులా గడియారాలను ఏర్పాటు చేయించారు. ఒకప్పుడు హైదరాబాద్ దర్పానికి ప్రతీకలుగా నిలిచిన ఈ క్లాక్ టవర్లు నేడు నిరుపయోగంగా మారాయి. ప్రజల చూపునకు నోచుకోక.. సరైన నిర్వహణ లేక ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. చార్మినార్‌పై ఉన్న నాలుగు గడియారాలు మాత్రం 128 ఏళ్లుగా క్షణం కూడా ఆగకుండా పనిచేస్తున్నాయి. నగరంలోని క్లాక్ టవర్లపై ‘సాక్షి’ప్రత్యేక కథనం..
క్లాక్ టవర్లు.. బ్రిటిష్ అనుసరణ
1865లో సుల్తాన్‌బజార్ క్లాక్ టవర్‌ను బ్రిటిష్ రెసిడెన్సీ ప్రతినిధి నిర్మించారు. దానికి పోటీగా.. అప్పటి పాలకుల మన్ననలు పొందడానికి సంస్థాన ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు నగరంలోని ఇతర ప్రదేశాల్లో క్లాక్ టవర్లు నిర్మించి నిజాం పాలకులకు బహూకరించారు. నగరంలో ఉన్న అన్ని గడియారాలు లం డన్‌లో తయారు చేసినవే. వాటిని ఓడల ద్వారా ముంబైకి.. అక్కడి నుంచి నగరానికి తీసుకొచ్చి ప్రతిష్టించారు. చార్మినార్ ఉత్తర దిశలో ఉన్న గడియారం విలువ అప్పట్లోనే రూ.60 వేలు. మిగతా మూడు గడియారాలు ఒక్కొక్కటీ రూ.30 వేలు. ఇక నగరంలోని మిగతా గడియారాల విలువ రూ.50–60 వేల వరకూ ఉంది.
ఫతేమైదాన్ క్లాక్ టవర్..
ఆరో నిజాం సంస్థానంలో రక్షణ మంత్రిగా విధులు నిర్వహిం చిన నవాబ్ జఫర్ జంగ్ బహదూర్ ఫతేమైదాన్ క్లాక్ టవర్‌ను 1903లో నిర్మించి ఆరో నిజాంకు బహూకరించారు. ఇది బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ చివరలో ఉంది. ప్రసుత్తం ఈ క్లాక్ టవర్ కనుమరుగయ్యే స్థితిలోకి జారుకుంటోంది. ఇక నగరంలోని మొజంజాహీ మార్కెట్ నిర్మాణం అనంతరం 1935లో గడియారం ఏర్పాటు చేశారు. దీన్ని నిజాం ప్రభుత్వం నిర్మించింది. మిగతా గడియారాలన్నీ ఇతరులు నిర్మించినవే.
నగరంలో తొలి క్లాక్ టవర్...
కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సీ పనులు పూర్తయ్యాక రెసిడెంట్ అధికారి 1865లో సుల్తాన్ బజార్ క్లాక్ టవర్ నిర్మించారు. ఈ టవర్ చతురస్రాకారంలో ఉంటుంది. ఈ క్లాక్ ప్రస్తుతం పనిచేయడం లేదు. వందల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఈ నిర్మాణం కనుమరుగయ్యే పరిస్థితిలోకి జారుకుంటోంది.
మహబూబ్ చౌక్ క్లాక్ టవర్..
ఈ టవర్‌ను నవాబ్ సర్ ఆస్మాన్‌జా బహదూర్ 1890లో నిర్మించారు. సాలార్‌జంగ్ చొరవ వల్ల ఈ క్లాక్ టవర్ 1892లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇండోనేíసియా శైలిలో దీనిని నిర్మించారు. చార్మినార్ పశ్చిమ దిశలో లాడ్ బజార్‌కు ముందు మహబూబ్ చికెన్ మార్కెట్(ముర్గీ చౌక్) పక్కన ఇది ఉంది. ఈ క్లాక్ టవర్‌కు 2008లో ఇంటాక్ హెరిటేజ్ అవార్డు లభించింది.
చార్మినార్ గడియారం..
చార్మినార్‌ను 1591లో నిర్మించారు. అయితే 1889లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనా కాలంలో చార్మినార్ మొదటి అంతస్తు మధ్యలో నాలుగు వైపులా గడియారాలు అమర్చారు. ఆ రోజుల్లో పాతబస్తీ ప్రజలు ఈ గడియారం చూసి తమ దినచర్య ప్రారంభించే వారు ముగించే వారు. చార్మినార్‌లో ఉన్న మూడు గడియారాలు ఒకలా ఉంటే.. ఉత్తర దిశలో ఉన్న గడియారం భిన్నంగా ఉంటుంది. ప్రతి గంటకు ఉత్తర దిక్కులో ఉన్న గడియారం గంటలు కొడుతుంది. మిగతా గడియారాల కంటే ధర ఎక్కువ. చార్మినార్ గడియారం గొప్పతనం ఏమిటంటే ఏ రోజు దానిని ప్రతిష్టించారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ ఆగకుండా పనిచేస్తోంది. ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గడియారాలన్నీ నిలిచిపోయాయి. కానీ చార్మినార్‌పై ఉన్న గడియారం మాత్రం పనిచేస్తూనే ఉంది. పాతబస్తీకి వచ్చే పర్యాటకులు, స్థానిక ప్రజలు గడియారంలో సమయాన్ని చూసే భాగ్యం కల్పిస్తోంది.
బోసిపోయిన సికింద్రాబాద్ క్లాక్ టవర్..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర ఉన్న క్లాక్ టవర్ ప్రస్తుతం పనిచేయడం లేదు. బ్రిటిష్ కంటోన్మెంట్ ప్రగతికి చిహ్నంగా 1896లో దీనిని నిర్మించారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దేశంలోని ఎల్తైన క్లాక్ టవర్లలో మూడోది. దీని ఎత్తు 37 మీటర్లు(120 అడుగులు). 1896లో పది ఎకరాల విశాల స్థలంలో క్లాక్ టవర్ నిర్మించారు. సర్ ట్రెవర్ జాన్ సిచెల్ ప్లోడన్ 1897 ఫిబ్రవరి 1న క్లాక్ టవర్‌ను ప్రారంభించారు. గడి యారాన్ని దివాన్ బహదూర్ సేట్ లక్ష్మి నారాయణ రాంగోపాల్ బహూకరించారు. దీనికి 2005లో హెరిటేజ్ అవార్డు కూడా దక్కింది.
128 ఏళ్లుగా ఎప్పుడూ ఆగలేదు..
నేను 1962 నుంచి చార్మినార్ గడియారం నిర్వహణ చేస్తున్నాను. రోజుకు ఒక్కసారి గడియారానికి ‘కీ’ఇస్తున్నాం. చార్మినార్ గడియారం ఏర్పాటు చేసినప్పటి నుంచీ మా తాత, బాబాయిలు, మా నాన్న రసూల్ ఖాన్‌కు నిజాం ప్రభుత్వం నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. చార్మినార్ గడియారం బరువు 25 కేజీలు ఉంటుంది. ఇంగ్లండ్‌లో తయారు చేసిన మెకానికల్ గడియారం ఇది. 128 ఏళ్లుగా గడియారం ఎప్పుడూ ఆగలేదు.
– సికందర్‌ఖాన్
ఆగినా పట్టించుకోని అధికారులు
సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్(రాంగోపాల్ పేట్) పోలీస్ స్టేషన్‌పై ఉన్న క్లాక్ టవర్‌ను ఆ రోజుల్లో ప్రముఖ సంఘ సేవకుడు సేట్ రాంగోపాల్ 1900వ సంవత్సరంలో నిర్మించారు. ఈ క్లాక్ టవర్ నిర్మాణం పూర్తిగా యూరోపియన్ శైలితో సాగింది. ఈ క్లాక్ టవర్ చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. 6వ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనా హయాంలో ఈ క్లాక్ టవర్ నిర్మాణం జరిగింది. ప్రసుత్తం ఈ క్లాక్ టవర్ పనిచేయడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment