సీఎం సహాయ నిధి పేరుతో టోకరా.. | cheat with CM Relief Fund Name | Sakshi
Sakshi News home page

సీఎం సహాయ నిధి పేరుతో టోకరా..

Published Sun, Feb 22 2015 4:31 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM

cheat with CM Relief Fund Name

సాక్షి, హైదరాబాద్ : ‘రోగం నయం చేయించుకోవాలంటే ఖరీదైన వైద్యం అవసరం.. అయితే వారి వద్ద కనీసం ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చేరేందుకు కూడా నయా పైసా లేదు. ఇలాంటి పేద రోగులకు ఆర్థిక సాయం చేయండి’.. అంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను ఇద్దరు మోసగాళ్లు వరంగా మార్చుకున్నారు.  ముఖ్యమంత్రి సహాయనిధి  నుంచి రూ. లక్ష మంజూరైనట్లు బాధితులను నమ్మించి, వారి నుంచి అందిన కాడికి దోచుకుని కనిపించకుండాపోతున్నారు.

రెండేళ్లుగా సాగిస్తున్న వీరి మోసాలపై కన్నేసిన నగర సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ జీ శంకర్‌రాజు గుట్టు రట్టు చేసి నిందితులిద్దరినీ శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీసీఎస్ డీసీపీ రవివర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పటన్‌చెరుకు చెందిన గుడ్ల కుమార్ (45), అర్రోల్ల ప్రవీణ్‌కుమార్ (22) స్నేహితులు. గుడ్ల కుమార్ పనీపాటా లేకుండా తిరుగుతుండగా ప్రవీణ్ ప్రైవేట్ ఉద్యోగి. ఇద్దరికీ ఆర్థిక ఇబ్బందులు రావడంతో మోసాలు చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. తేజ (12) అనే బాలుడికి గుర్తుతెలియని వ్యాధితో బాధపడుతుండడంతో ఖరీదైన వైద్యం కోసం ‘ఎవరైనా దాతలుంటే సహాయం చేయండి’.. అని ఈ నెల 4న ఓ తెలుగు దిన పత్రిక కథనాన్ని ప్రచురించింది.  

సాయం చేయాలనుకొనేవారు బాలుడి తండ్రి సెల్ నంబర్ 73860 70093ను సంప్రదించాలని అందులో ఉంది. దీన్ని గమనించిన కుమార్, ప్రవీణ్ ఆ నంబర్‌కు ఫోన్ చేసి తాము ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉద్యోగులమని బా లుడి తండ్రిని నమ్మించారు. మీ బా బు వైద్య ఖర్చుల కోసం సీఎం సహా య నిధి నుంచి రూ. లక్ష మంజూరు చేయిస్తామని, అందుకు పంజగుట్ట ద్వారకాపురిలోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో అకౌంట్ నెంబర్ 30750994684లో రూ.5 వేలు జమ చేయాలని సూచిం చారు. దీంతో బా లుడి తండ్రి ఆ అకౌంట్‌లో డబ్బులు వేశారు.

మరుసటి రోజు నిందితుల సెల్‌కు ఫోన్ చేయగా మంజూరైన డబ్బు అపోలో ఆస్పత్రికి చెల్లిస్తామని అక్కడికి వెళ్లాల్సిందిగా నిందితులు సూచించారు. మరుసటి రోజు అపోలో ఆస్పత్రికి వెళ్లిన బాలుడి తండ్రికి అసలు విష యం తెలిసి నిందితులు తనను మోసగించారని గ్రహించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ ఏసీపీ అనురాధ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్ శంకర్‌రాజు నిందితుడి బ్యాంకు అకౌంట్ ఆధారంగా గుర్తించి కుమార్, ప్రవీణ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో మెదక్ జిల్లాలో పలువురు నిరుద్యోగులకు హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని కూడా వీరిద్దరు మోసగించారని తేలింది. రెండేళ్లలో ఎంత మంది బాధితులను మోసగించారనే విషయంపై పోలీసుల ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement