ఛాతీ, టీబీ ఆస్పత్రి తరలింపు అడ్డుకోండి
- వాస్తు కారణంతో తరలింపు అన్యాయం
- హైకోర్టులో నాగం జనార్దన్‌రెడ్డి, జెడ్సన్ వేర్వేరు పిటిషన్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ, టీబీ ఆస్పత్రిని రంగారెడ్డి జిల్లా అనంతగిరికి తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో బుధవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ ఆస్పత్రిని తరలించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని, 2008లో నిర్ణయించిన విధంగా ఎర్రగడ్డలో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన బక్కా జెడ్సన్ వేర్వేరుగా ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారు.
ఇందులో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్యవిద్య డెరైక్టర్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ెప్రజలకు అందుబాటులో ఉన్న ఛాతీ, టీబీ ఆస్పత్రిని 75 కిలోమీటర్ల అవతలకు తరలించేందుకు ప్రభుత్వం గతనెల 27న జీవో కూడా జారీ చేసిందని, ఇది ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని వారు తెలిపారు. ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలో 750 బెడ్లతో టీచింగ్ ఆస్పత్రి, 150 మంది విద్యార్థులతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు 2008లో అప్పటి ముఖ్యమంత్రి ప్రకటించారని నాగం తన పిటిషన్‌లో వివరించారు.
అదే సమయంలో ఆస్పత్రిని తరలించాలని యోచించిన అప్పటి ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి వచ్చిన నిరసనతో విరమించుకుందని తెలిపారు. వాస్తు కారణాలతో ఈ ఆస్పత్రి స్థలంలో సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఈ నిర్ణయాన్ని అడ్డుకోవాలని ఆయన కోర్టును కోరారు. ఛాతీ, టీబీ ఆస్పత్రికి వచ్చే రోగులకు గుండె, న్యూరో, కిడ్నీ తదితర విభాగాల్లో వైద్య నిపుణుల అవసరం కూడా ఉంటుందని, దీన్ని తరలిస్తే రోగులు ఇబ్బంది పడతారని జెడ్సన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ రెండు వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చే అవకాశాలున్నాయి.
సీఎం కేసీఆర్ అలా చెప్పడం వెనుక కుట్ర
టీబీ ఆసుపత్రి నగరం నడిబొడ్డున ఉండొద్దని, మారు మూల ప్రాంతంలో ఉంటే ప్రశాంతంగా ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పడం వెనుక కుట్ర ఉందని నాగం ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఎంతో చరిత్ర ఉన్న ఈ ఆసుపత్రిలోనే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పేద రోగులపై వైఎస్‌కు ఉన్న ప్రేమ కేసీఆర్‌కు లేదని వ్యాఖ్యానించారు.