సాక్షి, మెదక్ : కరోనా.. అంటేనే ప్రపంచదేశాలు గజగజ వణుకుతున్నాయి. ఆ వైరస్ అంటే భయం పౌల్ట్రీ నిర్వహకుల పాలిటశాపంగా మారింది. చికెన్ తింటే కరోనా వ్యాధిసోకుతుందని కొందరు సోషల్ మీడియాలో కథనాలు పెట్టడటంతో చికెన్ తినేందుకు జనం జంకుతున్నారు. కొనేవారు లేక రెండునెలలు నిండినా కోళ్లుఫారాల్లోనే మగ్గుతున్నాయి. దీంతో ఫౌల్ట్రీ రైతులు తీవ్రనష్టాల పాలవుతున్నారు. మెదక్ జిల్లోలో సుమారు 1,876 కోళ్లఫారాలు ఉన్నాయి. వీటిపై ప్రత్యక్షంగా పరోక్షంగా 10వేల మంది ఆధారపడి జీవనం జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో చెప్పుకోదగ్గ నీటిప్రాజెక్టులు లేక పోవటంతో బోర్లపై ఆధారపడి వ్యవసాయంలో వరుసనష్టాలు వస్తుండటంతో కొందరు రైతులతో పాటు నిరుద్యోగులు బ్యాంకుల్లో రుణాలు పొంది కోళ్లఫారాలను నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ప్రపంచాన్ని వణికించే కరోనా వైరస్ కోళ్లను తింటే వస్తుందని కొందరు సోషల్ మీడియాల్లో కథనాలను పెట్టడంతో చికెన్ అమ్మకాలు తగ్గాయి.
రెండునెలలుగా ఫారాల్లోనే...
కోళ్లఫారాల్లో ఒక్కోబ్యాచ్‌ని కేవలం 45 రోజుల పాటు మాత్రమే పెంచుతారు. అంతకుమించి ఒక్కరోజుకూడ ఫారాల్లో ఉంచరు. ఎందుకంటే కోడిపెరుగు దల 45 రోజులుదాటితో పూర్తిగా నిలిచిపోతోంది. అప్పటికే ఒక్కో కోడి 2.50 కిలోల నుంచి 3 కిలోల బరువు వస్తోంది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ బూచితో చికెన్ తినేవారు వెనుకడుగు వేయటంతో కోళ్లు ఫారాల్లోనే ఉంటున్నాయి. రెండు నెలలు గడిచిపోయినా కోళ్లయజమానుదారులు వాటిని సకాలంలో తీసుక పోకపోవటంతో ఫారాల్లోనే మగ్గుతున్నాయి. రెండుమాసాలు గడిచిపోవటంతో కోళ్లు అధిక బరువుతో మృత్యువాత పడుతున్నాయి. చనిపోయిన కోళ్లకు సదరు యజమాని ఫౌల్ట్రీ రైతులకు డబ్బులు ఇవ్వరు. దీంతో రెండు నెలలపాటు పెరిగిన కోడిచనిపోవటం వల్లా తీవ్ర నష్టాల పాలౌతున్నారు. అంతే కాకుండా 45 రోజుల్లో బ్యాచ్‌ని తీసుక పోతే మరోబ్యాచ్‌ని వెనువెంటనే వేసుకుని పెంచుకుంటే సదరు రైతుకు లాభాలు వస్తాయి. కానీ రెండు నెలలపాటు ఫారాల్లోనే ఉండటంతో అన్ని విధాలుగా రైతులు నష్టాలు పాలవుతున్నారు.
మంత్రులు తిన్నా..
చికెన్ తింటే కరోనా వ్యాధివస్తుందనే వదంతులు ఎవరు నమ్మవద్దని ఏకంగా ఆరోగ్యశాఖ మంత్రితో పాటు ఇతర మంత్రులు ఇటీవలే చికెన్ తిన్నారు. లేనిపోని వదంతువులతో చికెన్ తినకుంటే దానిపై ఆధారపడ్డ పౌల్ట్రీ ఇప్పటికే చాలా నష్టాల్లో కూరుక పోయిందని నిరభ్యంతరంగా చికెన్ తినాలని చెప్పారు.
తగ్గిన ధర..
ప్రతిఏటా వేసవికాలం వచ్చిందంటే కిలో చికెన్ ధర రూ. 200 వరకు ఎగబాకేది. కానీ ఈ సంవత్సరం కరోనా బూచితో కిలో చికెన్ ధర కేవలం రూ.100 నుంచి రూ. 120 మాత్రమే పలుకుతున్నా.. చికెన్ తినేందుకు ప్రజలుముందుకు రావటంలేదని చికెన్ విక్రయదారులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి...
ఏనాడులేని విధంగా నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. బోర్లువేసి నష్టాలపాలై బ్యాంకుల్లో లక్షలాది రూపాయల అప్పులు తీసుకుని కోళ్లఫారాలను వేశాం. కరోనా బూచితో చికెన్ తినేవారు ముందుకు రాకపోవటంతో ఫారాల్లోనే కోళ్లు మగ్గుతున్నాయి. 45 రోజులకే ఒక్కో బ్యాచ్‌ను తీసుక పోతారు. కానీ రెండు నెలల సమయం ముంచుకొస్తున్నా కోళ్లు తీసుక పోవటంలేదు. దీంతో కోళ్లు అధిక బరువెక్కి చనిపోతున్నాయి. చనిపోయిన కోళ్లుకు కమిషన్ డబ్బులు ఇవ్వరు. పంటనష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచి ప్రభుత్వమే ఆదుకోవాలి.
–ఆరె రాజు, పౌల్ట్రీ, రైతు
Comments
Please login to add a commentAdd a comment