ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన షెడ్యూల్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అసెంబ్లీ సమావేశాలు ముగింపురోజైన
భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన షెడ్యూల్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అసెంబ్లీ సమావేశాలు ముగింపురోజైన ఈ నెల 21వ తేదీ సాయంత్రం జిల్లాలోని గ్రీన్‌హౌస్ కల్టివేషన్ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తారని ముందుగా అనుకున్నారు. కానీ అసెంబ్లీ సమావేశాలు మరికొన్ని రోజులపాటు పొడిగించే అవకాశం ఉన్నందున ఈ నెల 24 లేదా 25వ తేదీల్లో ఏదో ఒకరోజు జిల్లాలోని భువనగిరి డివిజన్‌కు రానున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన ద్వారా జిల్లాలో జరుగుతున్న గ్రీన్‌హౌస్ కల్టివేషన్‌పై మంత్రి వర్గ సహచరులకు, ఎంపీలు,ఎమ్మెల్యేలు, అధికారులకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం ఆయన పూర్తిస్థాయిలో పర్యటన చేపట్టాలని నిర్ణయించారు. శాసనసభ సమయం మరికొన్ని రోజులు పొడిగించిన పక్షంలో అవి ముగిసిన వెంటనే రావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భువనగిరి, బొమ్మలరామారం మండలాల్లోని గ్రీన్‌హౌస్ వ్యవసాయ క్షేత్రాలున్నాయి. వాటిని పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ వ్యా ప్తంగా గ్రీన్‌హౌస్ కల్టివేషన్ ద్వారా రైతులకు అధికంగా మేలు చేయాలని భావిస్తున్నారు.
ఏర్పాట్లలో అధికారులు..
మరోవైపు ఉద్యానవనశాఖ అధికారులు సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు.. భువనగిరిలోని వివేరా హోటల్ వెనక గల గ్రీన్‌హౌస్ కల్టివేషన్ క్షేత్రాన్ని అడిషనల్ ఎస్పీ రాధాకిషన్‌రావు గురువారం సందర్శించారు. సీఎం రానున్న సమయంలో భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలను స్థానిక సీఐలతో కలిసి చర్చించారు.
సీఎం పర్యటన ఇంకా ఖరారు కాలేదు
భువనగిరి : గ్రీన్‌హౌస్ కల్టివేషన్ పరిశీలనకు సీఎం పర్యటనకు ఇంకా ఖరారు కాలేదని కలెక్టర్ చిరంజీవులు తెలిపారు. గురువారం రాత్రి ఆయన భువనగిరి వివేరాహోటల్ వెనుక చేపట్టిన గ్రీన్‌హౌస్‌కల్టివేషన్ విధానాన్ని ఆయన పరిశీలించారు. పాలీహౌస్‌లో సేద్యమవుతున్న కూరగాయలు, పండ్ల తోటలను పరిశీ లించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్టాడుతూ ఇక్కడ జరుగుతున్న గ్రీన్ కల్టివేషన్ బాగుందని, దీనిని పరిశీలించేందుకు సీఎం వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు పర్యటన తేదీ ఖరారు కాలేదన్నారు. ఆయన వెంట ఆర్డీఓ ఎన్.మధుసూదన్, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఉద్యానవన కన్సల్టెంట్ వెంకట్‌రెడ్డి, రైతు రాఘవేందర్‌రెడ్డి ఉన్నారు.