గులాబీ దళపతి క్షేత్ర పర్యటన!
- దసరా తర్వాత జిల్లాలకు
- పార్టీ సంస్థాగత అంశాలపై దృష్టి
- సిద్దిపేట నుంచే తొలి పర్యటన
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పాలనపై మాత్రమే దృష్టి పెట్టిన గులాబీ దళపతి, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇక పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనా దృష్టి సారించనున్నారు. ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు తాను జిల్లాల్లో పర్యటిస్తానని కేసీఆర్ ప్రకటించారు. కానీ, వివిధ కారణాలతో పర్యటన వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి తప్పనిసరిగా సీఎం జిల్లాల పర్యటన ఉండేలా పార్టీ నాయకత్వం ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. దసరా తర్వాత నుంచి ఆయన జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల నేతలకు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. కాగా, సిద్దిపేట నుంచే సీఎం పర్యటనలు మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.
రైతులతో నేరుగా: తాజా వర్షాలతో చెరువులు, సాగునీటి ప్రాజెక్టులు నిండి రైతులంతా సంతోషంగా ఉండడంతో వారిని నేరుగా కలవాలని సీఎం భావిస్తున్నారని పేర్కొం టున్నారు. కొత్త జిల్లాలు కూడా దసరా నుంచే ఉనికిలోకి వస్తున్న నేపథ్యంలో ఒకటి రెండు చోట్ల మినహా ప్రభుత్వ ప్రతిపాదనలకు ఇప్పటికే అనుకూలత వ్యక్తమవుతున్న దృష్ట్యా ఈ రెండు అంశాలను సమర్థంగా వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లా స్థాయిలోనూ అధికారులతో సమీక్షలు నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలోని సమస్యల గురించి తెలుసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును సమీక్షించడం వంటి వాటికి జిల్లాల పర్యటనలను ఉపయోగించుకోనున్నారని తెలుస్తోంది. పార్టీ సమావేశాలు కూడా జరుపుతారని అంటున్నారు. మొత్తంగా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా తమ పాలనపై ప్రజల నాడిని మరోసారి తెలుసుకోవడం, ప్రజావసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల్లో మరింత బాధ్యతను పెంచడం వంటి బహుళ ప్రయోజనాల కోసం సీఎం పర్యటనలు ఉంటాయని విశ్లేషిస్తున్నారు.
పదవుల పంపకంపై దృష్టి
జిల్లాల పర్యటనల్లో భాగంగా ముఖ్యమంత్రి.. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెట్టడంతోపాటు రెండేళ్లకు పైగా పెండింగులో ఉన్న పదవుల పంపకంపైనా దృష్టి పెడతారని చెబుతున్నారు. జిల్లాల్లో పార్టీ అధ్యక్ష పదవులు తప్ప వేటినీ భర్తీ చేయలేదు. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని అటు అధికారిక పదవులు, ఇటు పార్టీ పదవుల పంపకంపై స్పష్టత ఇస్తారని సమాచారం. కొత్త జిల్లాల నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారిక పదవుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థ వంటి వాటి విషయంలో చైర్మన్ల పదవులు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. సీఎం కేసీఆర్ జరపనున్న జిల్లాల పర్యటనలో ఈ పదవుల నియామకానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం.