మార్చి ఒకటిన జిల్లాకు సీఎం కేసీఆర్!
- బీడీ కార్మికుల భృతి ప్రారంభం ఇక్కడి నుంచే
- కామారెడ్డిలో శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి
- తిమ్మాపూర్ వెంకన్న కొండకు వెళ్లే అవకాశం
- సీఎం పర్యటన ఏర్పాట్లలో అధికారులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మార్చి ఒకటిన జిల్లాలో పర్యటించనున్నారు.
బీడీ కార్మికులకు నెలకు రూ.వెయి రూపాయల భృతిని వచ్చే నెల నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం బీడీ కార్మికుల సమస్యలు, భృతిపై శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన అనంతరం నిజామాబాద్, మెద క్, కరీంనగర్ జిల్లాలలో స్వయంగా తానే ఈ పథకాన్ని ప్రా రంభించనున్నట్లు ప్రకటించారు. బీడీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న కొత్త పథకాన్ని కామారెడ్డి నుంచి ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాలోపర్యటించనున్నట్లు సమాచారం. అలాగే బీర్కూరు మండలం తిమ్మాపూర్‌లో నిర్మి స్తున్న వెంకన్న కొండను కూడ ముఖ్యమంత్రి సందర్శించనున్నారు.
ఇటీవల బీర్కూరు మండలంలో జరిగిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడ సీఎం కేసీఆర్ మార్చి ఒకటిన జిల్లాకు రానున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 21న జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అపుడు అధికారులు కూడా కామారెడ్డిలో మకాం వేసి ఏర్పాట్లను పరిశీలించారు. వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, విద్య, వైద్య ఆరోగ్య,గృహనిర్మాణ, వ్యవసాయ తదితర శాఖలకు సంబంధించిన నివేదికలను సిద్ధం చేశారు. చివరి నిముషంలో సీఎం పర్యటనను రద్దయినట్లు సీఎంఓ సమాచారం వచ్కిచంది. తిరిగి ఇపుడు సీఎం పర్యటన ఖరారు కావడంతో అధికారులు మళ్లీ ఏర్పాట్లపై దృష్టి సారించారు. సీఎం కోసం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.