కంకణ బద్ధుడు | Today CM tour in Gajwel | Sakshi
Sakshi News home page

కంకణ బద్ధుడు

Published Tue, Jan 20 2015 2:54 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

కంకణ బద్ధుడు - Sakshi

కంకణ బద్ధుడు

మాట నిలబెట్టుకుంటున్న కేసీఆర్
రాష్ట్రంలోనే గజ్వేల్‌కు ప్రత్యేక గుర్తింపు
ఇప్పటికే రూ. 3 వేల కోట్ల నిధుల విడుదల
ఉద్యమంలా గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి పనులు
నేడు గజ్వేల్‌లో సీఎం పర్యటన
నిధులన్నీ గజ్వేల్‌కేనా అంటూ జిల్లా వాసుల పెదవివిరుపు


 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘గజ్వేల్  ప్రజలు నా మీద అమృతం కురిపించారు. ఇక గజ్వేల్ రూపు రేఖలు మారిపోతాయ్. మీ  అరికాలుకు ముళ్లు గుచ్చుకుంటే నా పంటితో పీకేస్తా. రాష్ట్ల్రంలోనే గజ్వేల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలబెడతా. త్వరలోనే మీరంతా చూస్తారు’’ జూన్ 4న ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గజ్వేల్ లో జరిగిన సభలో సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన మాట.. ‘‘ ఒక రోజు చూసుకుని పవర్ డే పెట్టుకుందాం. ఆ రోజున కరెంటోళ్లంతా మీ ఊళ్లకే వస్తరు.. పోలు పోలు తీరుకుంటా సర్వేజేస్తరు. కరెంటె తీగలు వేలాడుతున్నా, పోలు వంగిపోయినా రాసుకొని పోయి, మళ్లోరోజు పెట్టుకొని వాటి స్థానంలో కొత్తయి పెడతరు’’ గజ్వేల్ అభివృద్ధిపై నవంబర్ 30న ఎర్రవల్లి ఫాం హౌస్‌లో సమీక్షా సమావేశంలో కేసీఆర్ అన్న మాటలివి.
 
‘కేసీఆర్ మాటలు తుపాకీ రాముని తూటాలు’ అని ప్రతిపక్షాలు ేహ ళన చేశాయి. ఆచరణ సాధ్యం కానీ హామీలంటూ విమర్శించాయి. ఆయన హామీల విలువ రూ. లక్ష కోట్లు దాటాయని కాంగ్రెస్, టీడీపీ నాయకులు లెక్కలు కట్టిమరీ కడిగిపారేశారు. కాలం చక్రం గిర్రున తిరిగింది... ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏడు నెలలు పూర్తి చేసుకున్నారు. ఈ ఏడు నెలల కాలంలో  కేసీఆర్ ఇచ్చిన ప్రతి మాటకూ కంకణ బద్ధుడయ్యారు. ఇచ్చిన ప్రతి హామీకి కార్యరూపం ఇస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ. 3 వేల కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. వాటిలో ఇప్పటికే  కొన్ని వరాలు ఫలితాలను ఇస్తున్నాయి.. ఇంకొన్ని ప్రగతిలో ఉన్నాయి... మరికొన్ని ప్రణాళిక స్థాయిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి గజ్వేల్ ప్రజలకు ఇచ్చిన తొట్టతొలి హామీ గజ్వేల్ డెవలప్‌మెంట్ అథారిటి(గడా) ఏర్పాటు.

ఇప్పుడిది గజ్వేల్ ప్రజలకు చిరస్మరణీయమైన సేవలు అందిస్తోంది. ఇక కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం గజ్వేల్‌లో ఉద్యమం తరహాలో ట్రాన్స్‌కో అధికారులు పోల్ టూ పోల్ సర్వే నిర్వహించారు. 10,075 కరెంటు సమస్యలను గుర్తించారు. వీటి పరిష్కారానికి సర్కార్ రూ 10 కోట్లు మంజూరు చేసింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇప్పటికే  గజ్వేల్ నియోజకవర్గంలో మూడు సార్లు పర్యటించారు. అనధికారికంగా ఆయన వస్తూ...పోతూనే ఉన్నారు. తన ఎర్రవల్లి ఫాం హౌస్‌కు వచ్చిన ప్రతిసారీ గజ్వేల్ నియోజకవర్గం గురించే ఆలోచన చేశారు.

తాజాగా ఆయన మంగళవారం  గజ్వేల్ పట్టణంలో పర్యటనకు వస్తున్నారు. పట్టణంలో ఆయన పాదయాత్ర చేస్తూ కమ్మరి, కుమ్మరి, చాకలి కుల వృత్తుల వారితో మాట్లాడుతారు. వారి కష్టసుఖాలను స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. అయితే సీఎం కేసీఆర్ కేవలం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌పైనే అధికంగా దృష్టి సారించడంపై జిల్లాలోని మిగతా ప్రాంతాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. గజ్వేల్ అంత కాకపోయినా తమ ప్రాంత అభివృద్ధికీ నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
 
గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం హామీలు, వాటి ప్రగతి
గజ్వేల్ చుట్టూ రింగు రోడ్డు ఏర్పాటుభూ సేకరణకు రూ.30 కోట్లు మంజూరు    
గజ్వేల్ నగర పంచాయతీలో శాశ్వత దాహార్తి నివారణకు ‘గోదావరి సుజల స్రవంతి పథకం’ రూ.60 కోట్లు మంజూరు. పనుల ప్రారంభానికి సన్నహాలు    
గజ్వేల్‌లో 5 వేల మంది పేదలకు ఇళ్లస్థలాలు, గృహనిర్మాణదరఖాస్తుల స్వీకరణ పూర్తి, కానీ స్థల సేకరణ లో జాప్యం, గృహనిర్మాణంపై ఖరారు కానీ విధివిధానాలు    
ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.350 కోట్ల నిధులు మంజూరు
పీఆర్ రోడ్ల అభివృద్ధికి రూ.200 కోట్లు మంజూరు
ములుగులో హార్టికల్చర్ యూనివర్శిటీ, ఫారెస్ట్రీ కళాశాల ఏర్పాటు రూ.100 కోట్లు కేటాయింపు    
గజ్వేల్ మిల్క్‌గ్రిడ్‌కు రూ.30 కోట్ల మంజూరుకు అనుమతి, పథకం ప్రారంభం    
గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి, హైరిస్క్ కేంద్రం ఏర్పాటు, 100 పడకల వరకు స్థాయిపెంపునకు రూ.18 కోట్లకుపైగా మంజూరు    
తూప్రాన్ ప్రభుత్వాసుపత్రి 100 పడకలుగా మార్చేందుకు మొదలైన కార్యాచరణ    
పవర్‌డే కార్యక్రమ నిర్వహణ, కరెంటు సమస్యల పరిష్కారానికి రూ.10 కోట్లు మంజూరు    
మండల కేంద్రాలు, పంచాయతీలు, మదిర గ్రామాల అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు, పనులు ప్రారంభం    
గజ్వేల్ నియోజకవర్గంలో కొత్తగా 220 కేవీ, ఒక 132, మరో ఆరు 33/11కేవీ సబ్‌స్టేషన్లు స్థల సేకరణ షురూ.    
మిషన్ కాకతీయ కింద 606 చెరువుల అభివృద్ధి.    ఇప్పటివరకు 23 చెరువులకు రూ.9 కోట్లు మంజూరు, మిగితా చెరువుల అభివృద్ధికి కొద్ది రోజుల్లో నిధులు విడుదలయ్యే అవకాశం
 
గజ్వేల్‌లో ముఖ్యమంత్రి పర్యటన ఇలా..

ఉదయం 11.00 నుంచి 11.30 గంటల వరకు రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ గజ్వేల్‌కు చేరుకుంటారు.
తొలుత ఎస్సీ కాలనీలో పిడిచెడ్ రోడ్డు వైపున నిర్మించిన మోడల్ బస్‌షెల్టర్‌ను పరిశీలిస్తారు.
ఆ తర్వాత ఎస్సీ కాలనీవాసులతో ముఖాముఖి...కాలనీలో మౌలిక వసతులపై ఆరా
12.00 గంటలకు కోటమైసమ్మ గుడి వద్ద నుంచి బ్రహ్మణ, ముస్లింలు, కుమ్మరి, రజక తదితర  చేతి వృత్తుల వారితో ముఖాముఖి అవుతారు. ఆ తర్వాత పాదయాత్ర కొనసాగింపు.
12.30 గంటలకు ఎంపీడీఓ కార్యాలయం నుంచి 17వార్డులోని ఢిల్లీవాలా హోటల్ సమీపంలోని ఇళ్ల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో ప్రజల పలకరింపు. వారినుద్దేశించి ప్రసంగం.
1.00 గంటకు పట్టణంలో రైతు బజార్, కల్చరల్ ఆడిటోరియం, ఇంటిగ్రేటేడ్ కార్యాలయాల భవన సముదాయం, ఎమ్మెల్యే కార్యాలయ భవం ఏర్పాటు కోసం స్థల పరిశీలనపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చ.
1.30 నుంచి 2.00 గంటల వరకు భోజన విరామం.
2.30 గంటలకు పట్టణంలోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో సుమారు గంటపాటు మున్సిపల్ పాలకవర్గం, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం.
 
అంతా గజ్వేల్ కేనా...!
‘కేసీఆర్‌కు ఒక్క గజ్వేలొల్లే ఓటేసింళ్లా.... మేమెయ్యలేదా?  మాది తెలంగాణే కదా? మెతుకు సీమల లేమా? మధన్‌రెడ్డి దొరకు ఓటేయ్యమంటే  ఓటేస్తిమి, ఆ దొర కేసీఆర్ సారు నిలబెట్టిన మనిషే కదా..!  ఆళ్లనో తీరుగజూసుడేంది..మమ్ములనోతీరుగ జూసుడేంది. గజ్వేలోళ్లకు రెండు సెతులతోటి పెడుతన్నడూ, ముఖ్యమంత్రి సారు మాకు దోసిలితో కూడ ఎయ్యనంటే ఎట్టా. గజ్వేల్ జనానికి పెట్టినట్టే మాగ్గూడ పెట్టాలె సారు’                                           -రామ నర్సమ్మ, నర్సాపూర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement