కాంగ్రెస్.. సెల్ఫ్ గోల్ చేసుకుంది
♦ అసెంబ్లీ సమావేశాలు గొప్పగా జరిగాయి
♦ సభా సమయం వృథా కాలేదు
♦ పన్నెండేళ్లలో అతి తక్కువ వాయిదాలు
♦ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ఈసారి అద్భుతంగా జరిగాయని, పదిహేడు రోజుల పాటు మంచి చర్చ జరిగిందని శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. సభా సమయం వృథా కాలేదన్నారు. అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత గురువారం ఆయన అసెంబ్లీ కమిటీ హాలులో విలేకరులతో మాట్లాడారు. ‘గడిచిన 12 ఏళ్లలో అతి తక్కువ సార్లు సభ వాయిదా పడడం ఇదే తొలిసారి. పోడియంలోకి ఎవరూ రాలే దు. ఏ ఒక్క రోజూ సభా సమయం వృథా కాలేదు. ప్రతిపక్షాలను కలుపుకుని పోయాం. ప్రభుత్వం ఒక మెట్టు దిగివచ్చి సభ జరిపింది. గతంలో అన్ని పద్దులపై ఎప్పుడూ చర్చ జరగలేదు. గత ఏడాది, ఈసారి కలిపి రెండు సార్లూ అన్ని పద్దులపై చర్చించాం. మంచి సంప్రదాయాన్ని నెలకొల్పాం. మంత్రుల కంటే ప్రతిపక్ష సభ్యులకే ఎక్కువ సమయం ఇచ్చాం’ అని మంత్రి హరీశ్ వెల్లడించారు.
ప్రతిపక్షాల గైర్హాజరు దురదృష్టకరం
చివరి రోజు ప్రతిపక్షాలు సభను బాయ్‌కాట్ చేయడం దురదృష్టకరమని హరీశ్ అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు సభకు ఎందుకు హాజరు కాలేదో తమకు తెలియదని, టీవీలు చూసి బయట ప్రెస్‌మీట్‌లు పెట్టి మాట్లాడడం ఎందుకని ప్రశ్నించారు. ‘క్రికెట్ ఇంట్లో ఆడితే ఎలా? గ్రౌండ్‌లో కదా ఆడాల్సింది. మీ వాదనలో పసలేదు. నిజాయితీ ఉంటే సభకు వచ్చి మాట్లాడేవారు. ప్రతిపక్ష సభ్యులకూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇస్తామన్నాం. టెక్నాలజీ వాడొద్దని రూల్స్ ఉన్నాయా? ఆన్‌లైన్‌లో సమాచారం, మెయిల్స్ ద్వారా ప్రశ్నలు పంపాలని, సభలో ల్యాప్‌టాప్‌లు వాడాలని రూల్స్ కమిటీలో నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన అన్నారు. సభకు రాకుండా, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుందన్నారు.
సీఎం కేసీఆర్ వాస్తవ పరిస్థితులను క ళ్లకు కట్టారని, ఒక విధంగా ఆయన తన ఆత్మను సభలో ఆవిష్కరించారని చెప్పారు. కాంగ్రెస్‌ది కేవలం గోబెల్స్ ప్రచారమన్నారు. వారు మాట్లాడింది బోగసని తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ కూడా సభలో ఉండిఉంటే బావుండే దని, సీఎం ప్రతీ సభ్యుని ప్రశ్నకు జవాబిచ్చారని హరీశ్ చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ఇప్పటికైనా, కనీసం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో పాల్గొని పనులు చేసుకోవాలని, ప్రజలకన్నా మేలు చేయాలని, మంచి పనులకు మద్దతుగా నిలవాలని హితవు పలికారు. సమావేశంలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
కోటి ఎకరాల మాగాణమే లక్ష్యం మండలిలో మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కోటి ఎకరాలను మాగాణంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రాజెక్టులను చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురువారం శాసన మండలిలో సాగునీటిపై లఘుచర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను, తెలంగాణ అవసరాలను ఎలా తీ ర్చబోతున్నామన్న అంశాలను అందరికీ తెలిపేం దుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభ లో ఇచ్చిన ప్రజెంటేషన్ దేశంలోని ఇతర సీఎంలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై ప్రతిపక్షాలకు అనుమానాలుంటే నివృత్తి చేసుకోవాల్సిందిపోయి, తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనని పారిపోయాయన్నారు.
వట్టిపోయిన ప్రాజెక్టులకు నీటిని ఎలా తెస్తామో సీఎం వివరించారని, పెండింగ్ ప్రాజెక్టులను కూడా ఎలా పూర్తిచేస్తామో తెలిపారని ఆయన పేర్కొన్నా రు. ప్రాణహిత ద్వారా ఆదిలాబాద్‌కు, భీమ, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టుల ద్వారా మహబూబ్‌నగర్‌కు ఏడాదిన్నరలో సాగునీరందిస్తామన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్షాలు ఎటువంటి సూచనలిచ్చినా స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ.. ప్రాజెక్టులపై రాజకీయ పార్టీలకు ఉన్న అభ్యంతరాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు, బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్, నరేందర్‌రెడ్డి, శంబీపూర్‌రాజు, బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. హరిత విప్లవం, క్షీర విప్లవం మాదిరిగా జలవిప్లవానికి కేసీఆర్ నాంది పలికారని, త్వరలోనే కోటి ఎకరాల బీడుభూములు మాగాణంగా మారబోతున్నాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.