నర్సన్నపేటకు నడిచొచ్చిన అదృష్టం | Chief Minister locals gossiping voice went up .. | Sakshi
Sakshi News home page

నర్సన్నపేటకు నడిచొచ్చిన అదృష్టం

Published Wed, Jun 17 2015 11:50 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

Chief Minister locals gossiping voice went up ..

జగదేవ్‌పూర్: అడగకముందే వరాలివ్వడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అలవాటు. ఆయన ఏ గ్రామం నుంచి వెళ్లినా ఠక్కున ఆగుతారు. చొరవ తీసుకొని స్థానికులతో మాట్లాడతారు. గ్రామ స్థితిగతులు తెలుసుకొని అప్పటికప్పుడు వారికి వరాలు కురిపిస్తుంటారు. మొన్న మార్కుక్.. నిన్న పాములపర్తికి వరా లు కురిపించినట్టుగానే తాజాగా నర్సన్నపేటనూ అక్కున చేర్చుకున్నారు. బుధవారం సాయంత్రం 4.50 గంటలకు కాన్వాయ్‌లో ముఖ్యమంత్రి తన ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు ఉండి మళ్లీ కరీంనగర్ పర్యటనకు బయలుదేరారు.
 
 సాయంత్రం 6.30 గంటలకు సీఎం కాన్వాయ్ ఎర్రవల్లి మీదుగా నర్సన్నపేటకు చేరుకుంది. సీఎం గ్రామం మీదుగా వెళ్తున్నట్టు సమాచారం ఉండడంతో గ్రామస్తులు, మహిళలు రోడ్డుపై వేచి ఉన్నారు. గ్రామానికి చేరుకోగానే సీఎం స్థానికులను చూసి కాన్వాయ్ ఆపారు. ఆ వెంటనే ఆయన కారు దిగి గ్రామస్తులతో ముచ్చటించారు. ‘మీ గ్రామంలో సమస్యలు ఏమున్నాయి?’ అంటూ ఆరా తీశారు. వెంటనే గ్రామస్తులు స్థానికంగా నెలకొన్న సమస్యలను సీఎంకు విన్నవించారు.
 
 సీఎం కేసీఆర్‌కు, గ్రామస్తులకు మధ్య జరిగిన సంభాషణ ఇలా...
 గ్రామస్తులు: చేబర్తి గ్రామ పంచాయితీ పరిధిలో మా గ్రామం ఉంది. మా గ్రామాన్నే ప్రత్యేక పంచాయతీని చేయాలి. సీసీ రోడ్లు, తాగునీటి సమస్య ఉంది. గతంలో వేసిన సీసీ రోడ్లు మాత్రమే ఉన్నాయి.
 
 సీఎం: బస్‌షెల్టర్ లేదా?, పింఛన్లు అందరికి వస్తున్నాయా?, సీసీ రోడ్లకు రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నా..
 
 గ్రామస్తులు: బస్ షెల్టర్ లేదు.. పింఛన్లు 90 శాతం వస్తున్నాయి సారూ.
 సీఎం: గ్రామంలో రేపే బస్ షెల్టర్‌కు ముహూర్తం పెట్టు అని పక్కనే ఉన్న గడా అధికారి హన్మంతరావును ఆదేశించారు.
 
 గ్రామస్తులు: పిల్లలకు బస్సు సౌకర్యం సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. కుషాయిగూడ బస్సు మా గ్రామానికి రావాలి.
 
 సీఎం: రేపటి నుంచే బస్సు మీ ఊరికే కాదు గణేశ్‌పల్లి వరకు వస్తుంది.
 గ్రామస్తులు: సారూ గ్రామంలో చాలామందికి ఇండ్లు లేవు.
 
 సీఎం: ఎందరికి లేవు. లేనోళ్లందరికి ఇండ్లు కట్టిస్తాం. జాగ లేకున్నా జాగను కొనిచ్చి ఇండ్లు కట్టిస్తాం సరేనా. అలాగే నర్సన్నపేట, గణేశ్‌పల్లి గ్రామాలకు సోలార్ లైట్లను అందించాలి అని గడా అధికారిని ఆదేశించారు. ‘మీ గ్రామ సమస్యలు తీర్చుస్తాం.. కానీ మీ గ్రామంలో మురుగు గుంతలు, చెత్త చెదారం లేకుండా చేసుకోవాలి. ఎటూ చూసిన మంచిగా రోడ్లు కనిపించాలి’ అంటూ హామీలిచ్చారు. దీంతో గ్రామస్తుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అనుకోకుండా ఆపి వరాలు ఇచ్చిన సీఎంను ఇప్పుడే చూస్తున్నామని, ఇక తమ గ్రామానికి అదృష్టం పట్టినట్టేనని స్థానికులు సంబరపడ్డారు. ఆ తరువాత సీఎం కాన్వాయ్‌లో ఎక్కి గణేశ్‌పల్లి మీదుగా కరీంనగర్ వెళ్లారు. గణేశ్‌పల్లి వద్ద ఆగిన జనాలకు నమస్కారం చేస్తూ ముందుకు కదిలారు.
 
 కుటుంబ సమేతంగా ఫాంహౌస్‌కు..
 సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా ఫాంహౌస్‌కు వచ్చారు. కేసీఆర్ సతీమణితోపాటు కూతురు ఎంపీ కవిత కూడా ఉన్నట్లు సమాచారం. సీఎం ఫాంహౌస్‌కు వస్తున్నారని సమచారం ఉండడంతో ఎస్పీ సుమతి, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. గురువారం మళ్లీ ఫాంహౌస్‌కు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement