చిన్నారి పెళ్లి కూతుళ్లు | Child Marriages In Adilabad District | Sakshi
Sakshi News home page

చిన్నారి పెళ్లి కూతుళ్లు

Published Sat, Dec 9 2017 11:14 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

Child Marriages In Adilabad District - Sakshi

ఆదిలాబాద్‌: నిరక్షరాస్యత.. మూఢనమ్మకాలు.. పేదరికం కారణంగా ముక్కుపచ్చలారని బాలికలకు మూడు ‘ముళ్ల’ బంధం పడుతోంది. బంగారు భవిష్యత్‌ను బందీ చేస్తోంది. వివాహా మనే పసుపుతాడుతో వారి బాల్యం స్వేచ్ఛకు ఉరితాడు బిగుస్తోంది. ఆడపిల్లలు భారమనో.. పేదరికం కారణంగానో.. భారం దించుకోవా లనో.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మైదాన, గిరిజన ప్రాంతాల్లో బాలికలకు తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నారు. బాల్య వివాహా ల కారణంగా ఆరోగ్య, సామాజిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించలేకపోతున్నారు. శుక్రవారం తాంసి మండలంలో బాలిక నిశ్చితార్థాన్ని అధికారులు అడ్డుకున్నారు.

ఆదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రతి ఏడాది బాల్య వివాహాలు పెరిగిపోతున్నాయి. గత ఐదేళ్లలో 134 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. ఇది అధికారికంగా మాత్రమే. అనధికారికంగా జరుగుతున్న ప్రతి ఏడాది 20 నుంచి 25 బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఒక్కో నెలలో మూడు నుంచి నాలుగు బాల్య వివాహాలు అడ్డుకున్న సంఘటనలూ ఉన్నాయి. 2016 ఫిబ్రవరిలో వారం రోజుల వ్యవధిలో నాలుగు బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. 2017 జూన్‌లో వారం రోజుల వ్యవధిలో మూడింటిని అడ్డుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఇంకా ఎన్నో వివాహాలు జరుగుతున్నాయి. మేనరికం పేరుతో చిన్నారులకు బలవంతుపు పెళ్లిళ్లు చేస్తుండగా, మరికొన్ని ఆర్థికంగా కుటుంబ పోషణ భారమై తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. కొన్ని వివాహాల్లో అబ్బాయిలకు సైతం తక్కువ వయసు ఉన్నవారు ఉంటుండగా.., వృద్ధులకు సైతం బాలికలతో పెళ్లి చేస్తున్నారు. చట్ట ప్రకారం అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు దాటిన తర్వాతనే పెళ్లి చేయాలి.

ఏజెన్సీ ప్రాంతాల్లోనే అధికం..
ఏజెన్సీ ప్రాంతాలైన ఆసిఫాబాద్, వాంకిడి, కెరమెరి, కుంటాల, సిర్పూర్, కాగాజ్‌నగర్, ఖానాపూర్, ఉట్నూర్, ముథోల్, నిర్మల్, తదితర గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు గుట్టుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. సమాజంలో ఆడపిల్లలకు ఉన్న అభద్రత భావాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు బాల్య వివాహాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎంతో కొంత చదువుకోవాలని అనుకుంటున్న బాలికలకు బాల్య వివాహం చేస్తున్నారు. చిన్నతనంలో పెళ్లి చేయడం ద్వారా కట్నకానుకలు కూడా ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం రాదనే ఉద్దేశంతో ఈ పనిచేస్తున్నారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే తమ బాధ్యత తీరుతుందనే భావనలో ఉన్నారు. కానీ పెళ్లి తర్వాత వచ్చే సమస్యలపై ఏమాత్రం ఆలోచించడం లేదు.

చట్టరీత్యా నేరం..
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. బాలికను చేసుకునే అబ్బాయికి, బాల్య వివాహం చేసే తల్లిదండ్రులు, ప్రోత్సహించిన వారిపై, హాజరైన కుల పెద్దలు, మత పెద్దలు, పూజారులపై కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం ఉంది. 1929 నాటి బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని ప్రభుత్వం 2006లో పటిష్టం చేసింది. 2007 నుంచి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చింది. బాల్య వివాహాలకు సంబంధించి రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.2 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. బాల్య వివాహాం జరిగిన రెండేళ్ల వరకు కూడా కేసు నమోదు చేసే అధికారం ఉంటుంది. కలెక్టర్, ఎస్పీతోపాటు ఆర్డీవో, ఎంపీడీవో, సీడీపీవో, తహసీల్దార్, వీఆర్‌వోలు, ఐసీపీఎస్, సీడబ్ల్యూసీ అధికారులు బాల్య వివాహాల నిరోధక అధికారులుగా ఉంటారు. గ్రామాల్లో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు బాల్య వివాహాలు జరుగుతున్నట్లుగా గుర్తిస్తే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలి.

హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఎత్తివేత..!
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని 1098 హెల్ప్‌లైన్‌ సెంటర్‌ గత నెల రోజులుగా మూతపడింది. బాల్య వివాహాలు, బాలికల రక్షణ కోసం హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లో ఉన్న ఈ కేంద్రంలో ఎన్జీవో పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు రావడం లేదని ఉద్యోగం మానేయడంతో హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను ఎత్తివేశారు. ఈ సెంటర్‌లో ఏడుగురు సిబ్బంది పనిచేస్తుండేవారు. కోఆర్డినేటర్, ఇద్దరు కౌన్సెలర్లు, నలుగురు ఫీల్డ్‌ వర్కర్స్‌ ఉంటారు. ఈ నెంబర్‌కు వచ్చిన ఫోన్‌ సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయడంతోపాటు వీరు ప్రత్యేకంగా వచ్చిన ఫోన్‌ కాల్‌ సమాచారంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. 1098 నంబర్‌కు ఫోన్‌ చేస్తే నేరుగా చెన్నయ్‌కు వెళ్తుంది. అక్కడి నుంచి జిల్లాలో ఉన్న హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు కనెక్ట్‌ చేస్తారు. ప్రస్తుతం సెంటర్‌ లేకపోవడంతో ఐసీపీఎస్‌ అధికారులకు సమాచారం అందిస్తున్నారు. సెంటర్‌కు ప్రత్యేక సిబ్బంది ఉంటే సదరు కేసుపై పూర్తి సమాచారం ఉంటుంది. కానీ ఐసీపీఎస్‌ అధికారులకు సమాచారం అందించడం వల్ల కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. త్వరలో దీన్ని ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించినట్లు సీడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు. డయల్‌ 100, 181 నంబర్లకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంటున్నారు.

బాలిక నిశ్చితార్థం అడ్డగింత
తలమడుగు(బోథ్‌): తాంసి మండలం పొన్నారి గ్రామంలో శుక్రవారం బాలిక నిశ్చితార్థాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామంలో ఎనిమిది నెలలుగా ఉంటున్న ఓ యువకుడితో జైనథ్‌ మండలం గిమ్మ గ్రామానికి చెందిన పదో తరగతి బాలికకు పెళ్లి సంబంధం కుదిరింది. శుక్రవారం పొన్నారి గ్రామంలో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ నసీమున్నీసా గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. మైనర్‌కు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దీంతో పెళ్లి వయసు వచ్చాక పెళ్లి చేస్తామని బాలిక తల్లిదండ్రులు హామీనిచ్చారు. గ్రామపెద్దలు, ఎంపీటీసీ లక్ష్మి, రమణ, అంగన్‌వాడీ కార్యకర్తలు దేవమ్మ, గంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.  

ఈ ఏడాది జరిగిన కొన్ని ఘటనలు
జూన్‌ 17న నెన్నెల మండలం గుండ్లసోమారంలో రెవెన్యూ, ఐసీపీఎస్‌ అధికారులు 17 ఏళ్ల బాలికకు వివాహం చేస్తుండగా అడ్డుకున్నారు. ఇరువురు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి, బాలిక తల్లిదండ్రుల నుంచి ఒప్పంద పత్రం తీసుకున్నారు.
జూన్‌ 18న నస్పూర్‌ మండలం శ్రీరాంపూర్‌లోని ప్రగతి మైదానంలో బాల్య వివాహాన్ని శిశు సంక్షేమ శాఖ అధికారులు అడ్డుకున్నారు. 16 ఏళ్ల బాలికకు వివాహం చేస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేసి ఇరువర్గాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.
జూన్‌ 23న హజీపూర్‌ మండలం సబ్బెపల్లిలో ఓ బాలికకు వివాహం చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఐసీపీఎస్, ఐసీడీఎస్, పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి బాలికను పాఠశాలలో చేర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement