చిన్నారుల రక్షణకు ‘పెంటావలెంట్’ టీకా
- ప్రాణాంతక ఐదు వ్యాధుల నుంచి రక్షణ
- మూడో వారంలో ప్రారంభానికి ఏర్పాట్లు
- ఏడున ‘ఇంద్రధనుస్సు’ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన కంఠసర్పి, కోరింతదగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్-బీ, ఇన్‌ఫ్లూయెంజా.. ఈ ఐదు వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రవేశపెట్టనున్న ‘పెంటావలెంట్’ టీకాను ఈ నెల మూడోవారంలో ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించే అవకాశాలున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి గత జనవరి చివరినాటికి ఈ టీకాను అందుబాటులోకి తేవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించినా కిందిస్థాయిలో ఏర్పాట్లు జరగకపోవడంతో అప్పట్లో వాయిదా వేశారు. పెంటావలెంట్ టీకాపై ప్రభుత్వం రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులకు ఈ టీకాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని జిల్లా, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, మార్కెట్ సెంటర్లు, రైల్వే, బస్‌స్టేషన్లు, సినిమా థియేటర్లలో పోస్టర్లు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సందేహాలపై చిన్నపాటి గైడ్‌ను తెలుగులో తయారుచేసి అన్ని జిల్లాలకు పంపించారు. వీటిని ఆశ, ఏఎన్‌ఎం తదితర వైద్య సిబ్బందికి అందజేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పెంటావలెంట్ టీకా చిన్నపిల్లల ఆరోగ్యానికి మంచిదన్న సందే శాన్ని జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర అవసరాల కోసం 11 లక్షల డోసుల టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని జిల్లాల వారీగా త్వరలోనే పంపిణీ చేయనున్నారు.
బాలానగర్‌లో ఇంద్రధనుస్సు...
సార్వత్రిక రోగ నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా సక్రమంగా టీకాలు అందని పిల్లలకు తిరిగి టీకాలు వేసేందుకు రూపొందించిన మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని ఈ నెల ఏడో తేదీన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల కస్టర్ పరిధిలోని బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతీ నెల ఒక వారం పాటు... అలా నాలుగు నెలల్లో నాలుగు వారాలు ఇంద్రధనుస్సు కార్యక్రమం అమలుకానుంది. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చిన్నారులకు టీకాలు వేస్తారు.