భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు
సాక్షి, మెదక్: మెదక్ చర్చిలో ఆదివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. లోకరక్షకుడైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చిలో రోజంతా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బిషప్ ఏసీ సాల్మన్‌రాజ్ ఆధ్వర్యంలో వేకువజామున 4.30 గంటలకు దైవ ప్రార్థనలు మొదలయ్యాయి. ప్రార్థనల అనంతరం ఆయన భక్తులకు దైవ సందేశం ఇచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారితో చర్చి కిటకిటలాడింది. ప్రార్థనల్లో సుమారు 3 లక్షల మంది పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్మాదేవేందర్‌రెడ్డితో కలసి కడియం కేక్ కట్ చేశారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ బాసలికా చర్చిలో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ బిషప్ తుమ్మ బాల ప్రత్యేక ప్రార్థనలుS చేసి, క్రీస్తు సందేశాన్ని అందించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.