ఏసయ్యా..! దీవించు | jesus ... bless me | Sakshi
Sakshi News home page

ఏసయ్యా..! దీవించు

Published Wed, Dec 25 2013 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM

ఏసయ్యా..! దీవించు

ఏసయ్యా..! దీవించు

 ఎల్లలు దాటి వెల్లువలా తరలివచ్చిన భక్తజన సందోహం... భక్తిప్రపత్తులతో మార్మోగిన ప్రార్థనలు... మొక్కుల చెల్లింపులు... గురువుల దీవెనలతో... కరుణామయుని కోవెల కిక్కిరిసిపోయింది. బుధవారం మెదక్ సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. రాష్ట్రాలు, జిల్లాలు దాటి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు, సందర్శకులు ఏసయ్య దీవెనల కోసం బారులు తీరారు. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులతో లోకరక్షకుని మందిరం కిటకిటలాడింది.
 
 పాప ప్రక్షాళన చేసుకోవాలి..
 కిస్మస్ సందర్భంగా బుధవారం తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో జరిగిన మొదటి ఆరాధనలో సీఎస్‌ఐ మెదక్ డయాసిస్ వైస్ చైర్మన్ రైట్ రెవరెండ్ ఏసీ సాల్మన్ రాజ్ భక్తులకు వాక్యోపదేశం చేశారు. కులమత ప్రాంతీయ భేదాలు లేకుండా దేవుని నామస్మరణతో పాపాలను ప్రక్షాళన చేసుకోవాలన్నారు. ఈ లోకమంతా ఆయురారోగ్యాలతో... సుఖ సంతోషాలతో.. పిల్లా పాపలతో.. సకల సంపదలతో విరాజిల్లాలని ఈ సందర్భంగా తాను ప్రభువును వేడుకుంటున్నట్టు తెలిపారు. అహింస, శాంతి ద్వారా సమసమాజ స్థాపన జరుగుతుందన్నారు. మానవత్వమే ప్రభువు అభిమతమని, అందుకే ఆయన చూపిన మార్గం అనుసరణీయమన్నారు. శాంతి, కరుణ, ప్రేమప్రభువు బోధనలన్నారు. వాటి స్థాపన కై దైవ కుమారుడిగా ఏసయ్య భూమి మీదకు వచ్చారని తెలిపారు. దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు.
 
 మెదక్/మెదక్ టౌన్, న్యూస్‌లైన్:
 మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వణికిస్తున్న చలిని సైతం లెక్క చేయకుండా మంగళవారం రాత్రి నుంచే భక్తులు చర్చికి తరలివచ్చారు. బుధవారం తెల్లవారుజాము 4.30కి ప్రారంభమైన మొదటి ఆరాధనల్లో పాల్గొన్న భక్తులను గురువులు ఆశీర్వదించారు. ఉద యం 7.30 గంటల ప్రాంతంలో డయాసిస్ వైస్ చైర్మన్ రెవరెండ్ ఏసీ సాల్మన్ రాజ్, చర్చి ప్రెసిబెటరీ ఇన్‌చార్జి వై.రాబిన్‌సన్‌లు కేక్ కట్‌చేసి ఏసయ్య జయంతి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. రెండో ఆరాధనలో సంఘ కాపరి అయిన ప్రెసిబెటరీ ఇన్‌చార్జి రెవరెండ్ వై. రాబిన్‌సన్ దైవ సందేశాన్ని అం దించారు. ఈ సందర్భంగా భ క్తులు చర్చి ప్రాంగణంలోని శిలువ వద్ద క్యాండిల్స్ వెలిగిం చి, కొబ్బరికాయలు కొట్టి మొ క్కులు తీర్చుకున్నారు. అనంత రం కానుకలు సమర్పించారు. చ ర్చి లోపల వేసిన పశువుల పాక, క్రిస్మస్ ట్రీ, చర్చి ప్రాంగణంలో గల శాం తా క్లాజ్ బెలూన్‌లు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
 
 భక్తుల సౌకర్యార్థం ఎల్‌ఈడీ ప్రత్యేక స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జెయింట్ వీల్స్, ఎగ్జిబిషన్‌లతో ప్రజలు ఎంజాయ్ చేశా రు. అక్కడే ఏర్పాటు చేసిన దుకాణాల్లో తినుబండారాలు, క్రీస్తు ఫొటోలు, బైబిల్, పాటల సీడీలు, కీ చైన్‌లను కొనుగోలు చేశారు. ఈ వేడుకల్లో అసిస్టెంట్ ప్రెసిబెటరీ ఇన్‌చార్జి విజయ్‌కుమార్, గురువులు కరుణాకర్, జాన్‌పీటర్, సీఎస్‌ఐ ప్రతినిధులు గెలెన్, రోలాండ్ అండ్ పాల్, జయరాజ్, జాన్‌వెస్లీ, సాల్మన్ , సువన్ డగ్లస్, జెల్ల సుధాకర్, శాంతకుమార్, నోబుల్‌సన్, ఉదయ్‌కిరణ్, వికాస్, ప్రదీప్‌కుమార్, స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.
 
 భారతి సిమెంట్ ఆధ్వర్యంలో
 పాల వితరణ..
 క్రిస్మస్ ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు భారతి సిమెంట్ ఆధ్వర్యంలో పాల వితరణ చేశారు. ఆ సంస్థ జనరల్ మేనేజర్ ఎంసీ మల్లారెడ్డి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎ.కొండల్‌రెడ్డి, టెక్నికల్ మేనేజర్ ఓబుల్‌రెడ్డి, అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ నరేశ్, స్థానిక డీలర్ కిరణ్ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. అనంతరం భారతి సిమెంట్స్ ప్రతినిధు లు డయాసిస్ వైస్ చైర్మన్ రెవరెండ్ సాల్మన్‌రాజ్‌తో క్రిస్మస్ కేక్ కట్ చేయించా రు. సందర్భంగా భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్ష లు తెలిపారు.
 
 
 హాజరైన ప్రముఖులు..
 మెదక్ చర్చిలో జరిగిన వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ జయప్రకాశ్‌రెడ్డి, మెదక్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే లు మైనంపల్లి హన్మంతరావు, ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రొళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డితోపాటు ఎస్పీ విజయ్‌కుమార్ కుటుంబసభ్యులు హాజరై ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.  వారు వేర్వేరుగా క్రిస్మస్ కేక్‌ను కట్‌చేసి భక్తులకు పంచి పెట్టారు. వచ్చే యేడు తెలంగాణ రాష్ట్రంలోనే క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటామని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 భారీ బందోబస్తు..
 ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా మెదక్ డీఎస్పీ గోద్రూ, పట్టణ సీఐ విజయ్‌కుమార్ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లు, బస్టాండ్లతోపాటు చర్చి ప్రధాన ద్వారం వద్ద పికెట్ నిర్వహించారు.
 
 కిటకిటలాడిన మెదక్ పట్టణం
 క్రిస్మస్ సంబరాలకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులతో మెదక్ పట్టణం కిటకిటలాడింది. పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, స్వీట్‌హౌస్‌లు జనసంద్రంగా మారాయి. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement