గన్నీ బ్యాగుల సేకరణకు కొత్త మార్గం | Civil Supply Corporation Will Collect Gunny Bags From Ration Dealers | Sakshi
Sakshi News home page

గన్నీ బ్యాగుల సేకరణకు కొత్త మార్గం

Published Tue, Jul 23 2019 8:58 AM | Last Updated on Tue, Jul 23 2019 8:58 AM

Civil Supply Corporation Will Collect Gunny Bags From Ration Dealers - Sakshi

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): ఖరీఫ్, రబీ సీజన్‌లలో వరిధాన్యం సేకరించడానికి ప్రతీ ఏడాది ఎదురవుతున్న గన్నీ బ్యాగుల కొరతను అధిగమించడానికి సివిల్‌ సప్లయి కార్పోరేషన్‌ శాఖ కొత్త మార్గాన్ని వెతుక్కుంది. కొనుగోలుకు అవుతున్న ఖర్చులో కొంత మేరకు తగ్గించుకుని నాణ్యమైన గోనే సంచులను సేకరించడానికి రేషన్‌ దుకాణాలను ఎంచుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాలతో పాటు మన జిల్లా సివిల్‌ సప్లయి అధికారులకు రాష్ట్ర శాఖ నుంచి ఆదేశాలు అందాయి. దీనికి సంబంధించిన అంశంపై వారం రోజుల క్రితం జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన రేషన్‌ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఇకపై రేషన్‌ డీలర్లు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయగా ఖాళీ అయిన సంచులను సివిల్‌ సప్లయి కార్పొరేషన్‌కే అప్పగించాలని సూచించారు.

ఒక్క గన్నీ బ్యాగుకు రూ.16 
జిల్లాలో ధాన్యం సేకరణ సమయంలో 54 శాతం కొత్తవి, 46 శాతం వినియోగించిన గన్నీ బ్యాగులు వినియోగించాలని నిబంధనలున్నాయి. అయితే కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేసిన గన్నీలు రైస్‌ మిల్లులకు చేరి, అక్కడి నుంచి బియ్యంతో అవే సంచుల్లో ఎఫ్‌సీఐకి చేరి, మళ్లీ ఎఫ్‌సీఐ నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లకు చేరాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గన్నీలు కొంత మేర పాడతువుతున్నాయి. దీంతో కార్పొరేషన్‌ శాఖకు నష్టం వాటిల్లుతోంది. మళ్లీ కొత్తవి కొనుగోలు చేయడం భారంగా మారుతోంది. బయటి మార్కెట్‌లో కొత్త గన్నీలు ఒకటి రూ. 22 వరకు లభిస్తోంది. అయితే రేషన్‌ దుకాణాలకు బియ్యం నింపిన గన్నీలు ఖాళీ అయిన అనంతరం డీలర్లు బయట విక్రయిస్తున్నారు.

రేషన్‌ దుకాణాలకు వచ్చిన గన్నీలు నాణ్యతగా, కొత్తగా ఉండడంతో వాటిని సివిల్‌ సప్లయి కార్పోరేషనే కొనుగోలు చేస్తే బాగుంటుందని, పైగా ధర కూడా తక్కువ . వెంటనే డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఒక్కో గన్నీ బ్యాగుకు రూ.16ల ధరను అధికారులు కుదుర్చుకున్నారు. డీలర్లు కూడా ఇందుకు సమ్మతం తెలుపడంతో గత కొన్ని రోజులుగా రేషన్‌ దుకాణాల నుంచి గన్నీల సేకరణ ప్రారంభమైంది. రేషన్‌ బస్తాలను సరఫరా చేసిన క్రమంలోనే అదే లారీలో ఖాళీ సంచులను పంపాలని అధికారులు డీలర్లకు సూచించారు. ప్రస్తుతం జిల్లాలో ఈ విధానంతో 75వేల గన్నీ బ్యాగులు సేకరించారు. ప్రతీ నెలా 1లక్షల వరకు గన్నీలు రేషన్‌ దుకాణాల నుంచి సేకరించాలని అధికారులు భావిస్తున్నారు.

రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు సేకరిస్తున్నాం
రేషన్‌ దుకాణాల నుంచి గన్నీ బ్యాగులు సేకరించాలని రాష్ట్ర శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆదేశాల ప్రకారంగా ఇటీవల రేషన్‌ డీలర్లతో జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. నిర్ణయించిన ధర ప్రకారంగా ప్రతీ నెలా ఖాళీ గన్నీలను సివిల్‌ సప్లయి కార్పోరేషన్‌కు అందించాలని తెలిపాం. నాణ్యమైన గన్నీలతో పాటు ధాన్యం కొనుగోలు చేసే సమయంలో గన్నీల కొరత రాకుండా ఉండేందుకు రాష్ట్ర శాఖ కొత్త మార్గాన్ని ఎంచుకుంది.  – అభిషేక్, డీఎం, సివిల్‌ సప్లయి కార్పొరేషన్, నిజామాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement