ప్రకృతికి నెలవైన పచ్చని పల్లెలు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నాయి. స్వచ్ఛమైన గాలి విషతుల్యమవుతోంది. పరిశ్రమల నుంచి వెలువడుతున్న దుర్వాసనతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పరిశ్రమల ఇష్టారాజ్యంతో పంట పొలాలు నిస్సారంగా మారుతున్నాయి. ఇవేమీ పట్టించుకోని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు పరిశ్రమలకు కొమ్ముకాస్తూ అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కొండాపూర్ మండల ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
-కొండాపూర్
కొండాపూర్ మండల పరిధిలోని తేర్పోల్, చెర్లగోపులారం, మల్లెపల్లి, ఎదురుగూడెం, గుంతపల్లి గ్రామాల్లో నాలుగు మద్యం పరిశ్రమలు, పది టైర్ల పరిశ్రమలు ఉన్నాయి. మద్యం పరిశ్రమల నుంచి వెలుబడుతున్న వ్యర్థాలు, కాలుష్యంతో సమీపంలోని పొలాల్లో ఏ పంట వేసినా పండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే టైర్లను కాల్చి ఆయిల్ తీసే క్రమంలో వచ్చే పొగ, దుర్వాసనతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.
పగలు.. రాత్రి తేడా లేకుండా...
పగలు, రాత్రీ అనే తేడా లేకుండా పరిశ్రమలు వ్యర్థాలను యథేచ్చగా బయటకు వదులుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైందని పేర్కొంటున్నారు. ముక్కుపుటాలు అదిరే దుర్వాసనతో నిద్రకూడా పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషితమైన గాలి పీల్చడం వల్ల చిన్నారులు శ్వాసకోశ వ్యాధులకు గురవతున్నారని చెప్పారు. ఇదే క్రమంలో గొల్లపల్లికి చెందిన ఓ మహిళకు గర్భస్రావం జరిగినట్లు గ్రీవెన్స్‌డేలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని గతంలో గుంతపల్లి గ్రామస్తులు టైర్ల పరిశ్రమ ఎదుట పలుమార్లు ధర్నా నిర్వహించినా... అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కంపెనీల యాజమాన్యాలకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలుష్యాన్ని విడుదల చేస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
భయంగా ఉంది
నేను నిత్యం తేర్పోల్ నుంచి సంగారెడ్డికి ద్విచక్ర వాహనంపై వెళ్తుంటాను. గ్రామ శివారులోని టైర్ల పరిశ్రమ నుంచి వచ్చే పొగ రోడ్డును కమ్మేస్తోంది. సాయంత్రం వేళ కంపెనీ దరిదాపుల్లోకి వెళ్లాలంటే భయమేస్తుంది.
- ప్రభు, తేర్పోల్
ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
కంపెనీల నుంచి వస్తున్న కాలుష్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక మంది రోగాలపాలవుతున్నారు. రాత్రి వేళ నిద్రకూడా పట్టడం లేదు. అధికారు లు స్పందించి కాలుష్య నివారణకు చర్య తీసుకోవాలి.
-చంద్రమోహన్, గొల్లపల్లి
పల్లెలపై కాలుష్యం పంజా
Published Fri, Jul 17 2015 11:29 PM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM
Advertisement
Advertisement