ఘటనాస్థలికి ‘దిశ’ నిందితులు! | Clues Team Visited Disha Incident Spot With Criminals For Clues | Sakshi
Sakshi News home page

ఘటనాస్థలికి ‘దిశ’ నిందితులు!

Published Fri, Dec 6 2019 1:12 AM | Last Updated on Fri, Dec 6 2019 5:05 AM

Clues Team Visited Disha Incident Spot With Criminals For Clues - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసులో బుధవారం సాయంత్రం నుంచి అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. ఇప్పటికే పోలీసుల నిర్లక్ష్యం జరిగిందంటూ విమర్శలు రావడంతో నిందితులను షాద్‌నగర్‌ కోర్టు కస్టడీకి ఇచ్చిన విషయాన్ని లీక్‌ కాకుండా జాగ్రత్తపడ్డారు. ఈ విషయంలో షాద్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్, డీజీపీ కార్యాలయాలు అత్యంత గోప్యత పాటిస్తున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలు, ప్రచారంపై పోలీసులు ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు. నలుగురు నిందితుల కస్టడీపై తమకు కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు.

మొబైల్‌ను తవ్వి తీయించారు
అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నిందితులు మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చర్లపల్లి జైలు నుంచి రహస్యంగా పోలీసులు తరలించారు. తొలుత తొండుపల్లి టోల్‌గేట్‌ ప్రాంతంలో ఘటనాస్థలానికి నిందితులను తీసుకెళ్లారు. అక్కడ లారీ నిలిపిన స్థలం, మద్యం తాగిన ప్రాంతాలను పరిశీలిం చారు. దిశను ముందు చూసిందెవరు? అత్యాచారం ఆలోచన ముందు ఎవరికి వచ్చింది?.. తదితర వివరాలు తెలుసుకున్నారు.

పంక్చర్‌ చేసిందెవరు? స్కూటీ బాగు చేయించేందుకు ఏ షాప్‌కు వెళ్లారు? దిశను ఎత్తుకెళ్లిన ప్రాంతాన్ని నిందితులు పోలీసులకు చూపించారు. అత్యా చారం జరిగిన ప్రాంతానికి సమీపంలో పాతి పెట్టిన దిశ మొబైల్‌ను నిందితులతోనే తవ్వి తీయించారు. అక్కడి నుంచి దిశ మృతదేహాన్ని క్యాబిన్‌లో ఎలా వేసుకుని వెళ్లారు? ఎవరెవరు  సాయం చేశారు? నవీన్, శివ పెట్రోల్‌ కొన్న బంకులు కూడా చూపించారు. ఇక షాద్‌నగర్‌ వైపు వెళ్లిన తర్వాత వెనక్కి రావడం, చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద మృతదేహాన్ని దహనం చేసేవరకు జరిగిన ఉదంతాన్ని నిందితులు పోలీసులకు కళ్లకు కట్టారు.

శవాన్ని ఈడ్చుకెళ్లిన దుండగులు..
చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద లారీని నిలిపిన నిందితులు మృతదేహాన్ని క్యాబిన్‌ నుంచి దించారు. వారే మోసుకెళ్లి బ్రిడ్జి కింద ఒక మూలకు ఈడ్చుకెళ్లినట్లు పోలీసులకు వివరించినట్లు తెలిసింది. తొండుపల్లి వద్ద ఘటనాస్థలంలోనే దిశ చనిపోయినా.. ఇంకా దిశ బతికే ఉండొచ్చన్న అనుమానంతో ఆనవాళ్లు కూడా దొరక్కుండా వెంట తెచ్చుకున్న పెట్రోల్‌తో పాటు, లారీ నుంచి డీజిల్‌ తీసి దహనం చేసిన విధానాన్ని చూపారు. ఆ మంటల్లోనే దిశ సిమ్‌ కార్డులు వేసినట్లు వివరించారు.

మరోసారి లారీ పరిశీలన
చటాన్‌పల్లి నుంచి నేరుగా క్లూస్‌ టీం షాద్‌నగర్‌లో ఉన్న లారీ వద్దకు వెళ్లి మరోసారి ఆనవాళ్లు సేకరించింది. స్థానిక ఆర్టీసీ డిపోలో నిలిపి ఉంచిన లారీ క్యాబిన్‌లో ఆధారాలు సేకరించింది. రక్తపు మరకలు, వెంట్రుకలు, వేలిముద్రలు, బ్లాంకెట్‌ పోగులు తదితర ఆనవాళ్లు సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో మొత్తం 50 మంది పోలీసులు పాలుపంచుకుంటున్నట్లు వినికిడి. మొత్తం 7 బృందాలను సీపీ సజ్జనార్‌ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. నలుగురు అదనపు ఎస్పీ స్థాయి అధికారులు ఈ బృందాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

విభజించి దర్యాప్తు..
20 రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేయాలన్న గడువు విధించుకోవవడంతో.. కేసును విభజించి దర్యాప్తు చేస్తున్నారు. డీఎన్‌ఏ, శరీర స్రావాల విశ్లేషణ, ప్రత్యేక సాక్షుల నుంచి వివరాల సేకరణ, సాంకేతిక ఆధారాలైన సెల్‌ఫోన్‌ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఫుటేజీ, లారీ, వాహనాల టైర్ల మార్కుల సేకరణ, లీగల్‌ ప్రొసీడింగ్స్‌ ఇలా ప్రతి పనిని విభజించి ఆయా బృందాలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ ఏడు బృందాలకు శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. కేసు వివరాలను ఎప్పటికపుడు సజ్జనార్‌ తెలుసుకుంటున్నారని సమాచారం.

పైకోర్టుకు వెళ్లినా.. ఉరి పడాల్సిందే
ఈ కేసులో ప్రత్యక్ష సాక్షుల కన్నా.. సాంకేతిక, ఫోరెన్సిక్‌ ఆధారాలే కీలకం కానున్నాయి. ఘటన జరిగిన ప్రాంతంలో మనుషుల సంచారం లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఘటనను నేరుగా చూసిన వారు లేకపోవడంతో ఈ కేసులో నిందితుల పాత్ర నిరూపించడం పోలీసులకు సవాలుగా మారింది. దిశ కేసు నేపథ్యంలో దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తుతుండటంతో తెలంగాణ పోలీసులపై ఒత్తిడి పెరిగింది. దీంతో నిందితులకు ఉరిశిక్ష పడేలా.. పైకోర్టుకు వెళ్లినా.. శిక్షలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోకుండా అత్యంత పకడ్బందీగా సాక్ష్యాలు సేకరిస్తున్నారు.

వరంగల్‌ కేసులా కాకుండా..
వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై లైంగికదాడి, హత్య కేసులో కూడా ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. కానీ, కేసులో నిందితుడి పాత్ర నిరూపించడంలో పోలీసులు సఫలమయ్యారు. తొలుత ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించింది. అయితే నిందితుడు పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన కోర్టు.. అత్యంత అరుదైన కేసుల్లోనే ఉరి శిక్ష విధించాలంటూ.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ.. తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ‘దిశ’కేసును దర్యాప్తు చేస్తున్న బృందం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వరంగల్‌ పోలీసుల సలహాలు తీసుకున్నట్లు సమాచారం. దిశ కేసు అత్యంత అరుదైనది కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులు పైకోర్టుకు వెళ్లినా.. శిక్షలో మార్పు లేకుండా చూడాలన్న పట్టుదలతో పోలీసులు పనిచేస్తున్నారు.

గొర్రెల కాపరి, కానిస్టేబుల్‌ సమయ స్ఫూర్తి..
బాధితురాలి మృతదేహం కాలిపోతుండగా చూసిన గొర్రెల కాపరి, అతడిచ్చిన సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి వెళ్లిన కానిస్టేబుల్‌ వెంటనే స్పందించడంతోనే పోలీసులు బాధితురాలిని గుర్తించడం సాధ్యమైంది. ఆధారాల సేకరణ కూడా వేగంగా జరిగింది. ఈ ఇద్దరూ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే దర్యాప్తు సాఫీగా సాగుతోందని చెప్పుకోవచ్చు.

మాకెలాంటి ఆదేశాలు రాలేదు..
దిశ కేసు దర్యాప్తు విషయంలో గురువారం ఉదయం నుంచే రకరకాల కథనాలు, విశ్లేషణలు జరుగుతున్నా.. పోలీసులు మాత్రం తమకు కోర్టు నుంచి ఇంకా కస్టడీ ఆదేశాలు రాలేదని స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఈ విషయంలో వివరణ అడిగేందుకు మీడియా ప్రతతినిధులు ప్రయత్నించినా లాభం లేకపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement