రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.
కరీంనగర్: రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ప్రజల బతుకుల్లో మార్పు రాలేదన్నారు. సర్కారు ప్రజా సంక్షేమాన్ని మరిచిపోయి సంబరాలకే అధిక ప్రాధాన్యతనిచ్చిందని విమర్శించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, అణిచివేత, వెట్టిచాకిరి, బానిసత్వంపై రచనలు చేసిన సాహితీ వేత్త దాశరథి రంగాచార్య మరణం తెలంగాణ సాహితీలోకానికి తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు అని బేరసారాలు ఆడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నైతిక విలువలకు కట్టుబడి తన పదవికి రాజీనామా చేయాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేసినట్లు చంద్రబాబు వాయిస్ టేపులు బయటపడటంపై మరింత సమగ్రంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దోషులు ఎంతటి వారైనా శిక్షార్హులేననే విషయాన్ని గ్రహించి కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు.