12న గజ్వేల్‌కు సీఎం రాక
- అప్రమత్తమైన అధికార యంత్రాంగం
- నాచగిరి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే అవకాశం
- ఆ తర్వాత నగర పంచాయతీలో పర్యటన
గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ పర్యటన దాదాపు ఖరారైంది. ఈనెల 12న నగర పంచాయతీలో పర్యటించనున్నారనే సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జనవరి 20న ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడిన సంగతి తెల్సిందే.
ఈ నేపథ్యంలో ఇక్కడ పర్యటించడానికి తాజాగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఆ రోజు ముందుగా వర్గల్ మండలం నాచగిరి బ్రహ్మోత్సవాల్లో కేసీఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత గజ్వేల్‌కు చేరుకొని నగరపంచాయతీ పరిధిలోని రామాలయం మీదుగా ఎస్సీ కాలనీలో పర్యటిస్తారు. పట్టణంలోని వివిధ వర్గాల సమస్యలను తెలుసుకుంటారు. ఎస్సీ కాలనీలోని పిడిచెడ్ రోడ్డు మీదుగా ముందుకు సాగుతారు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలను సందర్శిస్తారు.
ఇక్కడ నిర్మించతలపెట్టిన ప్రభుత్వ కార్యాలయాల సమీకృత భవనం, ఆడిటోరియానికి సంబంధించి స్థల సేకరణ విషయమై అధికారులతో చర్చిస్తారు. మధ్యాహ్న భోజనాన్ని ముగించుకొని హైదరాబాద్ వెళ్తారు. ఈ విషయాన్ని ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్‌డీ హన్మంతరావు ధ్రువీకరించారు. సీఎం పర్యటనను పురస్కరించుకొని శాఖల వారీగా అధికారులు సమీక్షల్లో నిమగ్నమయ్యారు.