వరంగల్‌లో గులాబీ జోష్‌! | CM KCR Election Campaign In Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో గులాబీ జోష్‌!

Published Fri, Apr 5 2019 7:37 AM | Last Updated on Fri, Apr 5 2019 7:39 AM

CM KCR Election Campaign In Warangal - Sakshi

జై తెలంగాణ నినాదాలు చేస్తున్న సీఎం కేసీఆర్, ఎంపీ అభ్యర్థి మాలోత్‌ కవిత

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభలు సక్సెస్‌ కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. రెండు రోజుల వ్యవధిలో వరంగల్, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించి కార్యకర్తల్లో జోష్‌ పెంచారు. ఢిల్లీలో పాగా వేయడమే లక్ష్యంగా 16 ఎంపీ స్థానాల్లో గెలుపు టార్గెట్‌ పెట్టుకున్న కేసీఆర్‌.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను ఆ దిశగా అప్రమత్తం చేస్తున్నారు. ఢిల్లీ టార్గెట్‌గా వారం రోజుల నుంచి ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత.. మంగళవారం, గురువారాల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రెండు బహిరంగ సభలు నిర్వహించడం విశేషం. ఎండ తీవ్రత ఉన్నప్పటికీ.. కేసీఆర్‌ సభలకు పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది.

 జిల్లాలో మూడు రోజులు ఉంటానన్న కేసీఆర్‌
వరంగల్‌లోని అజంజాహి మిల్లు మైదానంలో మంగళవారంనిర్వహించిన బహిరంగ సభలో సా గునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, రెవెన్యూ డివి జన్లు తదితర అంశాలపై వరాలు ప్రకటించిన కేసీఆర్‌... గురువారం మహబూబాబాద్‌లో జరిగిన సభలో పలు హామీలు ఇచ్చారు. ఎవరూ అడగకుండానే ప్రజల అవసరాలు గుర్తించి పథకాలు అమలు చేస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నా రు. అడగకుండానే ఈ ప్రాంత ప్రజల మనో భావాలను గమనించి మహబూబాబాద్‌ను జిల్లాగా చేశామని, ఇప్పుడు ఈ జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

తాగునీటి సమస్య మిషన్‌ భగీరథతో తీరనుందని.. ఏప్రిల్‌ తర్వాత ఇంటింటికీ నల్లా ద్వా రా నీరందిస్తామని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు కొనసాగిస్తామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర రావాలంటే పంటకాలనీలుగా వి భజించాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ తెలిపా రు. భూమి, వాతావరణం బట్టి ఏయే పంటలు వేయాలో అధికారులు చెబుతారని.. దాన్ని రైతులు అనుసరించాలని సూచించారు. ఆరునూరైనా దేశానికి తెలంగాణ రాష్ట్రమే ఆదర్శం కావాలని చెప్పారు. ఎన్నికల తర్వాత ఒక్కో జిల్లాలో రెండు మూడు రోజుల పాటు పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని వెల్లడించారు.

ఒంటరి మహిళలు, బోద కాలు బాధితులకు పింఛను ఇవ్వాలని ఎవ రూ కోరకున్నా అమలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు చేస్తామన్న ఆయన, రెవెన్యూ శాఖ పేరుతో సహా చట్టాన్ని మారుస్తామని పురుద్ఘాటించారు. జిల్లా కలెక్టర్‌ పేరు కూడా మార్చే ఆలోచనలో ఉన్నామని కేసీఆర్‌ మానుకోట సభలో వివరించారు. 

తెలంగాణలో పదహారు... వరంగల్‌లో రెండు
తెలంగాణలో 16 సీట్లు టీఆర్‌ఎస్‌కే రావాలని, కేంద్రంలో రాష్ట్రాల మాటలు చెల్లుబాటయ్యే ప్రభుత్వం ఉండాలని ఆకాంక్షించిన కేసీఆర్‌.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్‌ లోక్‌సభ సీట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశాన్ని 66 ఏళ్ల పాటు కాంగ్రెస్, భాజపాలే పరిపాలించాయని.. వారి పాలనలో జరిగింది మాత్రం శూన్యమన్నారు. ఇందిరాగాంధీ నుంచి రాహుల్‌ గాంధీ వరకు గరీబీ హఠావో అని నినాదాలు ఇస్తున్నారని.. ఎన్నేళ్లు ఇంకా గరీబులు ఉండాలని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి అవకాశమున్నా ఆయన చేయలేదని పేర్కొన్నారు.

డైలాగులు కొట్టుడు తప్ప చేసిందేమీలేదని కాంగ్రెస్, బీజేపీలను ఉద్దేశించి కేసీఆర్‌ దుయ్యబట్టారు. ఇక సీతారాం నాయక్‌కు టికెట్‌ ఇవ్వకపోవడంలో ఎలాంటి దురుద్దేశాలు లేవని.. ఆయనకు పార్టీలో ఎప్పటిలాగే తగిన గౌరవం ఉంటుందని వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాలోత్‌ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్‌ కోరారు. మహబూబాబాద్‌ను ఎందుకు జిల్లా చేయాల్సి వచ్చిందని చాలా మంది తనను అడుగుతున్నారని.. ఒక్క మహబూబాబాదే కాదు పూర్వ వరంగల్‌ జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, జనగామను కూడా జిల్లాలుగా చేసుకున్నామని చెప్పిన కేసీఆర్‌.. అందుకు గల కారణాలను వివరించారు.

ఈ ప్రాంతాలన్నీ గిరిజనులు కేంద్రీకతమైన ప్రాంతాలని వాళ్లు బాగుపడాలంటే ఏదో డంభాచారాలు కొడితే పని కాదని.. గిరిజనుల బతుకుల్లో వెలుతురు రావాలంటే పరిపాలన వాళ్ల దగ్గరికే రావాలన్నారు. అందుకే నాలుగు జిల్లాలను ఏర్పాటు చేసినట్లు కేసీఆర్‌ వెల్లడించారు.



మానుకోట పోరాట స్ఫూర్తి మరవలేం
మహబూబాబాద్‌ గడ్డకు తాను తల వంచి నమస్కారం చేస్తున్నానని, అద్భుతమైన పోరు గడ్డ మానుకోట పోరాట స్ఫూర్తిని మరవలేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ తెలంగాణ వస్తే ఏం చేస్తావు అని ఉద్యమ సందర్భంలో వివిధ రాష్ట్రాల వాళ్లు నన్ను ఢిల్లీలో అడిగేవారని, వాళ్లందరు కూడా ఇప్పుడు వివిధ సందర్భాల్లో నన్ను కలిసినప్పుడు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. ‘మీరు ఇవన్నీ ఎలా చేస్తున్నారు’ అని అడుగుతున్నారని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆశ్చర్యపోతున్నారన్న కేసీఆర్‌..  తెలంగాణ సంక్షేమం కోసం ఏం చేస్తున్నామనేది దేశమంతా తెలుసునన్నారు.

అది చేయి ఇది చేయి అని తనను ఎవరూ అడగలేదని, చర్చ చేసి తెలంగాణకు ఏం చేయాలో అది చేస్తున్నామని, ఎక్కడ ఎవరికి ఏది అవసరమో అది చేసుకుంటూ వెళ్తున్నామని స్పష్టం చేశారు. పోడుభూమి సమస్య ఒక్కటే కాదు.. అన్ని భూముల సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని, తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి మోడల్‌ కావాలంటే భూసంబంధమైన కిరికిరి లేకుండా చేస్తానని అన్నారు. అది ఏ భూమి అయినా సరే, దాని కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా తాను వెనుకాడనని తెలిపారు. ‘అధునాతన సిస్టమ్స్‌ జీపీఎస్‌ లాంటివి ఉపయోగించి సర్వే చేయిస్తా.. అవసరమైతే నేనే వస్తా.. గుంట భూమి గురించి కూడా ఏ రైతు బాధపడకూడదు’ అని కేసీఆర్‌ మానుకోట సభలో భరోసా ఇచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement